Begin typing your search above and press return to search.

అమీర్ పేట మెట్రో లిఫ్ట్ లో లైంగిక వేధింపులు

By:  Tupaki Desk   |   16 Feb 2018 7:14 AM GMT
అమీర్ పేట మెట్రో లిఫ్ట్ లో లైంగిక వేధింపులు
X
భ‌య‌ప‌డిందంతా జ‌రిగింది. హైద‌రాబాద్ మెట్రో భ‌ద్ర‌త‌పై ఉన్న సందేహాలు.. అనుమానాల్ని నిజం చేస్తూ షాకింగ్ ఉదంతం ఒక‌టి చోటు చేసుకుంది. మెట్రో స్టేష‌న్లలోనే అత్యంత ఆధునిక‌మైన స్టేష‌న్ గా పేర్కొనే అమీర్ పేట మెట్రో స్టేష‌న్లో ఒక మ‌హిళ లైంగిక వేధింపుల్ని ఎదుర్కొంది.

అయితే.. ఈ దారుణం మెట్రో సిబ్బంది కార‌ణంగా జ‌ర‌గ‌టం సంచ‌ల‌నంగా మారింది. అమీర్ పేట ఇంట‌ర్ ఛేంజ్ స్టేష‌న్లో జ‌రిగిన ఈ ఉదంతంలోకి వెళితే.. సికింద్రాబాద్‌కు చెందిన 22 ఏళ్ల యువ‌తి ఒక‌రు ర‌సూల్ పురా వెళ్ల‌టానికి జేఎన్ టీయూ స్టేష‌న్ లో మెట్రో ఎక్కింది.

అమీర్ పేట ఇంట‌ర్ ఛేంజ్ స్టేష‌న్లో దిగి రెండో అంత‌స్తులో రైలు మారాల్సి ఉంది. ఇందుకోసం స్టేష‌న్లోని లిఫ్ట్ లో ఎక్కింది. మెట్రో స్టేష‌న్లో టికెటింగ్‌.. క్యాష్ మేనేజ్ మెంట్ ఉద్యోగిగా ప‌ని చేస్తున్న నితిన్ రెడ్డి కూడా యువ‌తితో పాటు లిఫ్ట్ లో ఎక్కాడు. లిఫ్ట్ వెళ్లే స‌మ‌యంలో స‌ద‌రు యువ‌తి ప‌ట్ల రెండు సార్లు అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించారు. దీంతో.. షాక్ తిన్న ఆ యువ‌తి ఎస్సార్ న‌గ‌ర్ పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది.

లిఫ్ట్ లో యువ‌తిపై లైంగిక దాడికి పాల్ప‌డిన నితిన్ ట్రిగ్ డిటెక్టివ్ స‌ర్వీసెస్ కు చెందిన ఉద్యోగి. మెట్రో అవ‌స‌రాల కోసం ప‌లు అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల్ని నియ‌మించారు. త‌క్కువ జీతాలతో ప‌ని చేయించేందుకు వీలుగా అవుట్ సోర్సింగ్ ద్వారా ఉద్యోగుల్ని నియ‌మించిన‌ట్లు చెబుతున్నారు. ప్ర‌తిష్ఠాత్మ‌క‌మైన మెట్రో లాంటి ప్రాజెక్టులో నిపుణులైన వారిని రిక్రూట్ చేసుకుంటే మంచిద‌న్న సూచ‌న‌లు ప‌లువురు చేస్తున్నారు. ఇక‌..యువ‌తిపై లైంగిక వేధింపుల‌కు పాల్ప‌డిన నితిన్ ను అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు త‌ర‌లించారు. ఈ ఉదంతం మెట్రో వ‌ర్గాల్లో సంచ‌ల‌నంగా మారింది.