Begin typing your search above and press return to search.

కిమ్ కు షాకిచ్చిన ట్రంప్‌?

By:  Tupaki Desk   |   3 Nov 2017 11:27 AM GMT
కిమ్ కు షాకిచ్చిన ట్రంప్‌?
X
కొద్ది రోజులుగా అమెరికా - ఉత్త‌ర కొరియాల మ‌ధ్య ఉద్రిక్త ప‌రిస్థితులు ఏర్ప‌డ్డ సంగ‌తి తెలిసిందే. అమెరికాలోని గువామ్ దీవిపై దాడి చేసేందుకు ఉత్త‌ర కొరియాధ్య‌క్షుడు కిమ్ జాంగ్ ఉన్‌ ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్న సంగ‌తి తెలిసిందే. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత తమ దేశానికి ముప్పుపెరిగిందని - తమ దేశంపై దాడి చేసేందుకు అమెరికా సిద్ధంగా ఉందని కిమ్ వివిధ దేశాల‌కు లేఖలు కూడా రాశారు. అమెరికా ప్రోద్బలంతో ఐక్యరాజ్యసమితి తమ దేశంపై విధించిన ఆంక్షలు స‌డ‌లించేందుకు స‌హ‌క‌రించాల‌ని కిమ్ కోరారు. కిమ్ ప్ర‌వ‌ర్త‌న‌తో విసుగెత్తిపోయిన అమెరికా...ఉత్త‌ర కొరియాపై దూకుడుగా వ్య‌వ‌హ‌రించేందుకు పావులు క‌దుపుతోంద‌న్న వార్త‌లు కొద్ది రోజులుగా వెలువ‌డుతున్నాయి. ఆ వార్త‌లను నిజం చేస్తూ ఉత్తరకొరియాకు అమెరికా అనూహ్యంగా షాకిచ్చింది. త‌మ‌పై క‌య్యానికి కాలుదువ్వుతున్న ఉత్తరకొరియాపై అమెరికా బీ-1 బీ బాంబులను జారవిడిచింది. ఈ హ‌ఠాత్ప‌రిణామంతో ఉత్తరకొరియా బిత్తరపోయింది.

అమెరికా - దక్షిణకొరియాలు సంయుక్తంగా ఈ బాంబులు జార‌విడిచిన‌ట్లు ఉత్త‌ర‌కొరియా అధికారులు భావిస్తున్నారు. ప్ర‌పంచ‌దేశాలు - ఐక్య‌రాజ్య‌స‌మితి సూచ‌న‌ల‌ను బేఖాత‌రు చేసిన కిమ్ కు త‌గిన బుద్ధి చెప్పాల‌ని అమెరికా భావిస్తున్న‌ట్లు అంత‌ర్జాతీయ మీడియాలో క‌థ‌నాలు వెలువ‌డుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో గురువారం నార్త్ కొరియాలోని కొన్ని ప్రదేశాల్లో బీ-1బీ బాంబులను అమెరికా జారవిడిచింది. అమెరికా - దక్షిణ కొరియాలు యుద్ధ విమానాలతో గువాంలోని అండర్సన్ ఎయిర్ ఫోర్స్ బేస్ స్టేషన్ నుంచి తమపై మాక్ డ్రిల్ నిర్వహించ‌డంపై ఉత్త‌ర‌ కొరియా మండిపడుతోంది. మాక్ డ్రిల్ లో భాగంగా ఆ బాంబులు జార‌విడిచిన‌ట్లు స్థానిక మీడియా కేసీఎన్ ఏ శుక్రవారం ఓ వీడియోను ప్రసారం చేసింది. వ‌రుస క్షిపణి పరీక్షలతో జపాన్ - అమెరికా - చైనా దేశాలకు వ‌ణుకు పుట్టిస్తున్న కిమ్ కు త‌గిన శాస్తి చేయాల‌ని దక్షిణ కొరియా - అమెరికాలు ప్లాన్ చేశాయి. తాము కిమ్ బెదిరింపుల‌కు భ‌య‌ప‌డ‌డం లేద‌ని రుజువు చేసేందుకే మాక్ డ్రిల్ ను నిర్వ‌హించి త‌మ అభిమ‌తాన్ని స్పష్టం చేశాయి.

అయితే దాడుల‌కు సిద్ధ‌మైన‌ట్లుగానీ, మ‌రిన్ని దాడులు చేయ‌బోతున్న‌ట్లు గానీ అమెరికా - దక్షిణ కొరియాలు అధికారికంగా ప్ర‌క‌టించ‌లేదు. ఇరు దేశాధినేత‌ల నుంచి ఈ విష‌యంపై ఎటువంటి అధికారిక ప్రకటన విడుద‌ల కాలేద‌ని ఆ చానెల్ త‌మ‌ కథనంలో ప్రకటించింది. ఇప్ప‌టివ‌ర‌కు అమెరికా - ద‌క్షిణ కొరియా - జ‌పాన్ - చైనాల‌పై ఒంటికాలిపై లేచిన కిమ్...తాజా మాక్ డ్రిల్ పై ఏ విధంగా స్పందిస్తాడో అన్న అంశంపై స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది. గ‌తంలో మాదిరిగానే కిమ్ త‌న దూకుడును కొన‌సాగిస్తాడా? లేక ఆచితూచి వ్య‌వ‌హ‌రిస్తాడా అన్న విష‌యం ఆస‌క్తిగా మారింది. ఐరాస‌తోపాటు మిగిలిన దేశాలు కూడా త‌మ దేశం వైఖ‌రిపై అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్న నేప‌థ్యంలో కిమ్ ఎటువంటి నిర్ణ‌యం తీసుకుంటాడో వేచి చూడాలి.