Begin typing your search above and press return to search.

భ‌విష్య‌త్తులో యూఎస్‌ కు హిందు అధ్య‌క్షుడు

By:  Tupaki Desk   |   19 Jan 2017 9:18 AM GMT
భ‌విష్య‌త్తులో యూఎస్‌ కు హిందు అధ్య‌క్షుడు
X
అమెరికా అధ్య‌క్షుడు బ‌రాక్ ఒబామా అధ్యక్షుడిగా త‌న చివ‌రి ప్రెస్ కాన్ఫ‌రెన్స్‌ లో ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌తిభ‌కు ప‌ట్టం క‌డుతూ.. అంద‌రికీ స‌మాన అవ‌కాశాలు క‌ల్పిస్తూ అగ్ర‌రాజ్యం ఇలాగే ముందుకు సాగితే భ‌విష్య‌త్తులో తొలి మ‌హిళా అధ్య‌క్షురాలే కాదు ఓ హిందూ ప్రెసిడెంట్‌ - ఓ లాటినో ప్రెసిడెంట్‌ - జ్యూయిష్ ప్రెసిడెంట్ కూడా వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని ఒబామా జోస్యం చెప్పారు. ప్ర‌తిభ క‌లిగిన వ్య‌క్తులు ఈ దేశంలోని ప్ర‌తి జాతి - మ‌తం - ప్ర‌దేశాల నుంచి ఉద్భ‌వించ‌డం మ‌నం చూడ‌బోతున్నాం. ఎందుకంటే ఇదే అమెరికా బ‌లం. ఇలాగే అంద‌రికీ స‌మాన అవ‌కాశాలు క‌ల్పిస్తూ వెళ్తే మ‌హిళా అధ్య‌క్షురాలిని చూస్తాం. అలాగే హిందూ - లాటినో - జ్యూయిష్ ప్రెసిడెంట్ల‌ను కూడా అని ఒబామా అన్నారు. ఈ సంద‌ర్భంగా హాజ‌రైన వారంతా క‌ర‌తాళ ధ్వ‌నులు వెల్ల‌డించారు. అగ్ర‌రాజ్యం అమెరికా తొలి న‌ల్ల జాతీయ అధ్య‌క్షుడిగా ఎన్నికైన ఘ‌న‌త‌ను సొంతం చేసుకున్న ఒబామా.. భ‌విష్య‌త్తులో ఇలాంటివి మ‌ళ్లీ చూడ‌గ‌ల‌మా అని అడిగిన ప్ర‌శ్న‌కు పై విధంగా స్పందించారు.

అమెరిక‌న్ల‌దే అమెరికా అనే విధానంతో ముందుకు సాగుతున్న డొనాల్డ్‌ ట్రంప్ విజ‌యం దేశంలోని మైనార్టీల‌కు ఎదురుదెబ్బే అన్న వాద‌న‌ల నేప‌థ్యంలో ఒబామా ఇచ్చిన వివ‌ర‌ణ ఆస‌క్తికరంగా మారింది. ఈ స‌మావేశంలో ట్రంప్‌ పై ప‌రోక్షంగా ఒబామా విమ‌ర్శ‌లు గుప్పించారు. "అధ్యక్షుడిగా ఎన్నికైన వ్య‌క్తికి అంద‌రూ ఓట్లేశారు. దీనికి కార‌ణం వాళ్లు త‌మ‌ హ‌క్కులు కోల్పోతున్నామ‌ని, త‌మ‌ను మ‌రచిపోతున్నార‌న్న భావ‌న వారిలో క‌ల‌గ‌డ‌మే. త‌మ‌ను త‌క్కువ‌గా చూస్తున్నార‌ని, తమ‌కు ల‌భించిన అవ‌కాశాలు త‌మ పిల్ల‌ల‌కు ద‌క్క‌వేమోన‌న్న ఆందోళ‌న వారిలో ఉంది. కొంత‌మంది తెల్ల‌జాతీయులు మాత్రం వైభోగాలు అనుభ‌వించే అమెరికాను వాళ్లు కోరుకోవ‌డం లేదు" అని ఒబామా అన్నారు. ఈ సంద‌ర్భంగా మీడియాపై కూడా ఒబామా ప్ర‌శంస‌లు కురిపించారు. ఓవైపు మీడియాను త‌న నియంత్ర‌ణ‌లో పెట్టుకోవ‌డానికి ట్రంప్ చూస్తుంటే.. ఒబామా మాత్రం మీడియా వ‌ల్లే తాము మ‌రింత నిజాయితీగా, క‌ష్ట‌ప‌డి ప‌నిచేసేలా చేసింద‌ని అన్నారు. ప్ర‌జ‌ల‌కు తాము జ‌వాబుదారీగా ఉండేలా చూడాల్సిన బాధ్య‌త మీడియాపై ఉంద‌ని, త‌మ‌కు ఫ్యాన్స్‌గా మార‌కూడ‌ద‌ని సూచించారు. వైట్‌ హౌజ్‌ ను వీడిన త‌ర్వాత త‌న విలువైన స‌మ‌యాన్ని కుటుంబానికే కేటాయిస్తాన‌ని ఒబామా చెప్పారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/