Begin typing your search above and press return to search.

అమెరికాలో కరోనా కల్లోలం : 3 నెలలు ..60 వేల మంది మృతి

By:  Tupaki Desk   |   29 April 2020 2:00 PM GMT
అమెరికాలో కరోనా కల్లోలం :  3 నెలలు ..60 వేల మంది మృతి
X
అమెరికాలో కరోనా మరణమృదంగం మోగిస్తోంది. ప్రపంచంలోని అన్ని దేశాలతో పోలిస్తే ఇప్పుడు కరోనాతో అల్లకల్లోలమవుతోన్న దేశం అమెరికానే. కరోనా వెలుగులోకి వచ్చిన చైనా , ఆ తరువాత మొన్నటిదాకా ఇటలీ, స్పెయిన్ దేశాలు కరోనా కోరల్లో చిక్కుకున్నాయి, కానీ , ఆ దేశాలు త్వరగానే కరోనా నుండి బయటపడ్డాయి. కానీ, అమెరికా కరోనా దెబ్బకి వణికిపోతోంది. కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు అత్యధికంగా ఉన్న దేశం ఇప్పుడు అమెరికానే. గంట గంటకూ కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య పెరుగుతోంది.

కాగా, మూడు నెలల్లో అమెరికాలో ఈ వ్యాధి బారిన పడి మృతి చెందినవారి సంఖ్య 59,266 కి చేరింది. వియత్నాం యుధ్ధ సమయంలో దాదాపు రెండు దశాబ్దాల్లో మరణించినవారి సంఖ్య కన్నా ఇది ఎక్కువ. ఈ దేశంలో ప్రతి లక్ష మందికి 17 మందికి పైగా రోగులు మృత్యుబాట పడుతున్నారు. 10 లక్షలమందికి ఇన్ఫెక్షన్ సోకిందని అంచనా. అయితే ఈ అంచనా కన్నా 10 రెట్లు ఎక్కువమందికే ఈ వైరస్ సోకి ఉండవచ్చునని కూడా భావిస్తున్నారు.

1955-1975 మధ్య అమెరికా, వియత్నాం మధ్యకాలంలో జరిగిన యుధ్ధ సమయంలో 58 వేలమందికి పైగా మరణించారు. ఇప్పుడు కరోనా వల్ల మరణించిన వారి సంఖ్య ఆ సంఖ్యని దాటిపోయింది. అలాగే , 2017..18 సంవత్సరాల్లో అమెరికాలో ఫ్లూ కారణంగా దాదాపు 60 వేలమంది ప్రాణాలు కోల్పోయారు. అయితే అమెరికాలో కరోనా విలయతాండవం చేస్తున్నా కూడా అధినేత ట్రంప్ తీరు మాత్రం మారడం లేదు. అదీగాక ..తన ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల కారణంగానే మరిన్ని మరణాలు సంభవించకుండా నివారిస్తున్నామని చెబుతున్నారు.