Begin typing your search above and press return to search.

పాక్ కు షాకిచ్చిన అమెరికా!

By:  Tupaki Desk   |   9 Oct 2016 10:34 AM GMT
పాక్ కు షాకిచ్చిన అమెరికా!
X
అమెరికా అండ కోసం ప్రయత్నించిన పాకిస్థాన్ కు నిరాశే మిగిలింది. యూరీ ఘటన - భారత్ సర్జికల్ దాడుల అనంతర పరిణామాలతో అంతర్జాతీయ సమాజంలో ఏకాకిగా మారుతున్న క్రమంలో పాక్ అమెరికా అండ కోసం వాషింగ్టన్ బయలుదేరిన సంగతి తెలిసిందే. పాక్ ప్రతినిధులు అగ్రరాజ్యాన్ని సంప్రదించినా కూడా అక్కడ వారికి ఎలాంటి భరోసా దొరకలేదు. కాశ్మీర్ విషయంలో అమెరికా జోక్యం చేసుకోవాలంటూ వారు చేసిన వినతికి మద్దతు దక్కలేదు. సీమాంతర ఉగ్రవాదాన్ని నిలిపివేస్తే తప్ప కశ్మీర్ విషయంలో జోక్యం చేసుకోలేమని అమెరికా తెగేసి చెప్పింది.

అయితే.. పాక్ మాత్రం తన బుద్ధి ఏమాత్రం మార్చుకోకుండా అమెరికాకే కొత్త సంకేతాలు పంపింది. అమెరికా కనుక ఈ విషయంలో ఎంటర్ కాకుంటే తాము చైనా-రష్యా-ఇరాన్ ల కూటమితో జతకడతామన్న సంకేతాలను పంపించింది. నిజానికి అమెరికా గత అయిదేళ్లుగా తన వైఖరిని పూర్తిగా మార్చుకుంది. అంతర్జాతీయ పరిణామాలను నిశితంగా గమనించే ఆ దేశం క్రమంగా పాక్ కు తమ అండదండలు తగ్గిస్తూ వస్తోంది. మరోవైపు చైనాతో వైరం కారణంగా భారత్ ను దువ్వుతోంది. అదే సమయంలో చైనా పాక్ తో చెలిమి పెంచుకుంటోంది. రష్యా కూడా అమెరికాపై ఆగ్రహంతో పాక్ కు చేరువవుతోంది. ఆ దన్నుతో పాక్ ఇప్పుడు అమెరికాను చైనా-రష్యాలను చూపించి బెదిరించే ప్రయత్నాలు చేస్తోంది. అయితే.. పాక్ చెబుతున్నట్లు ఆ కూటమిలోని ఇరాన్ తో పాక్ కు పొసిగే పరిస్థితి లేదు. బలూచిస్థాన్ విషయంలో ఇరాన్ జోక్యంతో పాటు ఇటీవల మన సర్జికల్ దాడుల సమయంలోనూ ఇరాన్ అటు వైపు నుంచి పాక్ పై దాడి చేసిన విషయం తెలిసిందే.

మరోవైపు ఇండియా కనుక బలూచిస్థాన్ విషయంలో జోక్యం చేసుకుని తమ దేశంలో అశాంతి రేపే ప్రయత్నం చేస్తే ఈశాన్య భారతంలో మావోయిస్టులు - ఇతర తీవ్ర వాద గ్రూపులకు తాము మద్దతిచ్చి భారత్ ను అల్లకల్లోలం చేస్తామని పాక్ ఇప్పటికే బెదిరింపులకు దిగింది. అయితే... చైనా - రష్యాలు పరోక్షంగా పాక్ కు ఆయుధ సహకారం అందించడమే తప్ప నేరుగా భారత్ తో కయ్యానికిదిగే పరిస్థితులు కనిపించకపోవడం... అమెరికా కూడా ఉగ్రవాదాన్ని రూపుమాపితేనే ఏమైనా మాట్లాడుతామని కుండబద్ధలు కొట్టేయడంతో పాక్ బెదిరింపులు నిజం కావడం అంత సులభం కాదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/