Begin typing your search above and press return to search.

అమెరికాకు పూర్తి భిన్నం.. అయినా జపాన్ లో పిస్టల్ పేలింది

By:  Tupaki Desk   |   9 July 2022 2:43 AM GMT
అమెరికాకు పూర్తి భిన్నం.. అయినా జపాన్ లో పిస్టల్ పేలింది
X
సూపర్ మార్కెట్ కు వెళ్లి సబ్బు కొన్నంత సింఫుల్ గా గన్ కొనే వీలు ప్రపంచానికి పెద్దన్న అమెరికాలో సాధ్యం. కానీ.. జపాన్ లో మాత్రం అందుకు భిన్నం. ఆ దేశంలో గన్ కల్చర్ చాలా చాలా తక్కువ. ఆ మాటకు వస్తే నేరాలు చాలా అరుదుగా జరిగే ఆ దేశంలో పోలీసులకు పనే ఉండదని చెబుతారు. అలాంటి దేశంలో మాజీ ప్రధానిపై కాల్పులు జరిపి హత్య చేయటం ప్రపంచం మొత్తానికి షాకింగ్ గా మారింది. అత్యున్నత స్థాయి భద్రత ఉన్న షింజోను ఒక వ్యక్తి కాల్చి చంపటం ఇప్పుడు జీర్ణించుకోలేకపోతున్నారు. కేవలం 12.5 కోట్ల జనాభా ఉన్న దేశంలో పిస్టల్ సంబంధిత నేరాలు గత ఏడాది మొత్తంలో పది మాత్రమే చోటు చేసుకున్నాయంటే.. ఆ దేశంలో నేరాలు ఎంత స్వల్పంగా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు.

జపాన్ లో కఠిన చట్టాలు అమలు చేస్తుంటారు. పోలీసులు.. సైన్యం మినహా జపాన్ లో ఎవరూ ఆయుధాలు కలిగి ఉండకూడదు. మామూలు ప్రజలకు రైఫిల్ అమ్మరు. కేవలం ఎయిర్ గన్స్ మాత్రమే అమ్ముతారు. అందుకు కూడా సవాలచ్చ నిబంధనలు.. పరిమితులు ఉంటాయి. జపాన్ లో పిస్టల్ లైసెన్సు ఉండాలంటే ఒక వ్యక్తి రాతపరీక్షలో పాస్ కావటంతో పాటు.. అతడి మానసిక ఆరోగ్యాన్ని కూడా చెక్ చేసిన తర్వాతే ఇస్తారు.

మనం కలలో కూడా ఊహించని ఎన్నో నిబంధనల్ని జపాన్ లో అమలు చేస్తుంటారు. మన దేశంలో కారు కొనాలంటే అందుకు అవసరమైన డబ్బులో.. లేదంటో రుణం ఇచ్చే సంస్థలో ఉంటే సరిపోతుంది. కానీ.. జపాన్ లో అలా కాదు. ఎవరైనా కారు కొనాలంటే ముందుగా.. వారు పార్కు చేసుకోవటానికి అవసరమైన ఖాళీ స్థలం ఉందన్న విషయాన్ని అధికారుల చేత సర్టిఫై చేసిన తర్వాత కారు కొనేందుకు అనుమతి లభిస్తుంది.

అలా కారు కొనటానికే ఇంత ప్రాసెస్ ఉంటే.. గన్ విషయంలో మరెన్ని జాగ్రత్తలు తీసుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. అంతేకాదు.. గన్ కోసం.. దాని లైసెన్సు కోసం ఎవరైనా అప్లికేషన్ పెట్టుకుంటే.. అధికారులు దరఖాస్తుదారుడి కుటుంబ సభ్యులు.. స్నేహితులు.. బంధు మిత్రుల్ని ప్రశ్నించి.. తాము అనుకున్న ప్రమాణాల ప్రకారం ఉన్న తర్వాత మాత్రమే గన్ ఇస్తారు. అంతేకాదు.. గన్ కోసం అప్లై చేసిన వారు.. షూటింగ్ కు టెస్టు నిర్వహిస్తారు. అందులోనూ 95 శాతం కచ్ఛితత్వాన్ని దరఖాస్తుదారుడికి ఉన్న తర్వాతే ఇస్తారు. మొత్తం 13 అంశాల మీద క్రాస్ చెక్ జరిగిన తర్వాతే గన్ లైసెన్సు జపాన్ లో లభిస్తుంది.

అంతేకాదు.. గన్ లైసెన్సు మూడేళ్లకు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. తర్వాత రెన్యువల్ కోసం కూడా అత్యధిక సంఖ్యలో అనుమతులు అవసరం ఉంటుంది. అంతేకాదు.. పిస్టల్ లైసెన్సు ఉన్న వారు తమ గన్ ను భద్రంగా దాచి ఉంచటానికి అవసరమైన లాకింగ్ వ్యవస్థను సైతం కొనుగోలు చేయాల్సి ఉంటుంది. గన్ లైసెన్సు ఉన్న వ్యక్తి మరణిస్తే.. అతడి కుటుంబ సభ్యులు లేదంటే బంధువులు వెంటనే ఆ గన్ ను ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉంటుంది.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. జపాన్ పోలీసుల వద్ద గన్లు ఉన్నప్పటికీ.. ఆ దేశంలోని చాలామంది పౌరులు తమ జీవిత కాలంలో ఒక్కసారి కూడా గన్ చూడని పరిస్థితులు కూడా ఉంటాయని చెబుతారు. పోలీసులు కాల్పులకు దిగటం చాలా చాలా అరుదుగా చెబుతారు. నిజానికి డ్యూటీలో ఉన్న చాలామంది పోలీసుల వద్ద పిస్టల్ అన్నది ఉండదు. ఆ మాటకు వస్తే.. ఉండకూడదు కూడా. షింజే హత్యకు ఉపయోగించిన పిస్టల్ ను నిందితుడు సొంతంగా తయారు చేసుకొని ఉండొచ్చన్న మాట వినిపిస్తోంది. ఇలాంటి వాటిలో తూటాలోకి విడిగా గన్ పౌడర్ ను కూరుస్తారు. 1990నుంచి ఇప్పటివరకు అంటే దాదాపు 32 ఏళ్లలో గన్ కారణంగా వివిధ హోదాలకు చెందిన ప్రముఖులు హత్యకు గురి కావటం.. తీవ్రంగా గాయపడటం లాంటి ఘటనలు కేవలం ఐదంటే ఐదు మాత్రమే చోటు చేసుకోవటం గమనార్హం. ఇలాంటి చోట దేశ మాజీ ప్రధానమంత్రిపై కాల్పులు జరగటం.. ఆయన మరణించటం లాంటి ఉదంతం సంచలనం కాకుండా మరేమవుతుంది?