Begin typing your search above and press return to search.

ఒమిక్రాన్ అయినా ఫర్లేదు.. విధుల్లోకి రండి.. అమెరికాలో దారుణ పరిస్థితి

By:  Tupaki Desk   |   12 Jan 2022 2:58 AM GMT
ఒమిక్రాన్ అయినా ఫర్లేదు.. విధుల్లోకి రండి.. అమెరికాలో దారుణ పరిస్థితి
X
ఎవరితోనైనా పెట్టుకోవచ్చు ఫర్లేదు. కానీ.. ప్రకృతితో పెట్టుకుంటేనే సమస్య అంతా. మనిషి ఎంత తోపు మేధావి అయినా.. అదంతా ప్రకృతి మూడో కన్ను తెరవనంత వరకే. ఒక్కసారి విపత్తు విరుచుకుపడితే.. ఎంతటి శాస్త్ర సాంకేతికత అయినా సరే.. అడ్రస్ లేకుండా పోవటం చూస్తున్నాం. ఎంతో శ్రమించి సాలీడు గూడు కట్టుకుంటే.. దాన్ని నాశనం చేయటం మనిషికి సెకను మాత్రమే. సరిగ్గా.. మనిషి ఏర్పాటు చేసుకున్న వ్యవస్థల్ని దెబ్బ తీయటానికి ప్రకృతికి అంతే తక్కువ టైం తీసుకుంటుందన్న విషయాన్ని మర్చిపోకూడదు.

ప్రపంచానికే పెద్దన్న అయిన అమెరికాలో ఇప్పుడు పరిస్థితులు ఏ మాత్రం బాగోలేవని చెబుతున్నారు. కరోనా మూడో వేవ్.. అందునా ఒమిక్రాన్ మహమ్మారి దెబ్బకు దేశ ఆరోగ్య వ్యవస్థ తీవ్రంగా ప్రభావితం అవుతుందని చెబుతున్నారు. క్యాలెండర్ లో రోజు గడిచేసరికి ఒమిక్రాన్ కేసులు అంచనాలకు మించి పెరిగిపోతున్నాయి. రోజుకు పదకొండు లక్షల కేసులు నమోదుకావటం చూస్తే.. అమెరికా ఇప్పుడు ఎంతటి విపత్కర పరిస్థితుల్లో ఉందో అర్థమవుతుంది. గత ఏడాది జనవరి 14న రికార్డుస్థాయిలో 1.42 లక్షల మంది ఆసుపత్రిలో చేరితే.. సోమవారం నాటికి ఒమిక్రాన్.. ఇతర వేరియంట్లుసోకి 1.41లక్షల మంది ఆసుపత్రుల్లో చేరారున రానున్న రోజుల్లో ఈ సంఖ్య మరింత భారీగా పెరుగుతుందని చెబుతున్నారు.

అన్ని అనుకున్నట్లు జరిగితే మరికొన్ని రోజుల్లోనే 2.75 లక్షల నుంచి 3 లక్షలవరకు ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య ఉంటుందని చెబుతున్నారు. ఇప్పటికే అమెరికాలోని కొలొరాడో.. ఒరిగాన్ లూసియానా.. మేరీల్యాండ్.. వర్జీనియాల్లో ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. రోగుల సంఖ్య అంతకంతకూ ఎక్కువై పోవటం.. వారికి వైద్య సేవల్ని అందించే వైద్య సిబ్బంది కొరత అంతకంతకూ ఎక్కువ అవుతోంది. అమెరికా వ్యాప్తంగా 1200 ఆసుపత్రుల్లో వైద్య సిబ్బంది కొరత ఎక్కువగా ఉందని చెబుతున్నారు. కేసుల తీవ్రత నేపథ్యంలో మరో వారం వ్యవధిలోనే మరో 100 ఆసుపత్రుల్లో సిబ్బంది కొరత ఏర్పడుతుందని చెబుతున్నారు.

ఇలాంటివేళ.. కాలిఫోర్నియా డిపార్ట్ మెంట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ కీలకనిర్ణయాన్ని తసీుకుంది. ఒమిక్రాన్ కారణంగా భారీసంఖ్యలో వైద్య సిబ్బంది దాని బారిన పడిన వేళ.. పాజిటివ్ అయిన వారు సైతం.. ఎలాంటి లక్షణాలు లేకుంటే మాత్రం ఎన్ 95 మాస్కులు ధరించి.. విధులకు హాజరు కావాలని కోరుతున్నారు. ఈ ఆదేశాలు జనవరి 8 నుంచి ఫిబ్రవరి 1 వరకు తాత్కాలికంగా అమల్లో ఉంటాయని చెబుతున్నారు. ఇదొక్క ఉదంతం చాలు.. అమెరికాలో ఇప్పుడు ఎలాంటి పరిస్థితి ఉందన్న విషయాన్ని తెలిసేలా చేస్తుంది.

అంతేకాదు.. కరోనా రోగి కాంటాక్ట్ లోకి వెళ్లిన వైద్య సిబ్బంది తమకు ఎలాంటి లక్షణాలు కనిపించని పక్షంలో.. పరీక్షలు చేయించుకోవద్దని.. ఎన్ 95 మాస్కులు ధరించి విధులకు హాజరైతే సరిపోతుందని చెబుతున్నారు. అయితే.. ఈ నిర్ణయం ఏ మాత్రం సరికాదు.. నిప్పుతో చెలగాటం ఆడినట్లేనని చెబుతున్నారు. వైరస్ సోకిన వారికి లక్షణాలు కనిపించనంత మాత్రాన.. వారి ముఖాలకు మాస్కులు వేసి.. విధుల్లోకి రమ్మని చెప్పటం డేంజర్ గేమ్ గా అభివర్ణిస్తున్నారు.

అదే జరిగితే.. వైరస్ మరింత వేగంగా వ్యాప్తి చెందుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఇదిలా ఉంటే.. తాజాగా వాషింగ్టన్ పోస్టు ఒక కథనాన్ని పోస్టు చేసింది. దీని ప్రకారం.. నమోదవుతున్న కేసుల సంఖ్యతో పోల్చినప్పుడు ఆసుపత్రుల్లోచేరే వారి సంఖ్య బాగా తక్కువగా ఉన్నా.. రానున్న రోజుల్లో ఐసీయూ పడకలు దొరకని పరిస్థితి ఉంటుందని చెబుతున్నారు. ఇదంతా చూసినప్పుడు అగ్రరాజ్యం లెక్క తేల్చేందుకే కరోనా పుట్టిందా? అన్న భావన కలుగక మానదు. మరి.. ఈ సవాలు నుంచి అమెరికా ఎలా బయటపడుతుందో చూడాలి.