Begin typing your search above and press return to search.

అమెరికా.. రష్యా.. ఓ ఆయుధ వ్యాపారి.. ఓ యువ బాస్కెట్ బాల్ ప్లేయర్

By:  Tupaki Desk   |   10 Dec 2022 2:30 AM GMT
అమెరికా.. రష్యా.. ఓ ఆయుధ వ్యాపారి.. ఓ యువ బాస్కెట్ బాల్ ప్లేయర్
X
ఉక్రెయిన్ యుద్ధం వేళ.. అమెరికా-రష్యా మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో ఉద్రిక్తతలు పెరిగాయి. అంతకుముందు కూడా ఇరు దేశాలు ఒకరిపై ఒకరు కుట్రలు
చేసుకోవడంలో ఎప్పుడూ నిమగ్నమై ఉండేవి. ప్రచ్ఛన్న యుద్ధం జరిగే సమయంలో అమెరికా-రష్యా పరస్పర ఎదురుపడడమే ఆశ్చర్యకరం అన్నట్లుండేది. ఇక ఉక్రెయిన్
యుద్ధంతో రష్యాపై మళ్లీ అమెరికా అప్పట్లోలా కారాలు మిరియాలు నూరుతోంది. అనేక ఆంక్షలతో విరుచుకుపడింది. మెక్ డొనాల్డ్స్ సహా దిగ్గజ కంపెనీలు రష్యాను వదిలి
వెళ్లాల్సిన పరిస్థితి ఎదురైంది. అసలు పుతిన్ పొడనే గిట్టనట్లుగా అమెరికా వ్యవహరించింది.

రష్యా ఉడుంపట్టు.. అమెరికా కాళ్ల బేరం రష్యా-అమెరికాలాంటి పెద్ద దేశాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరిగితే ఎలా ఉంటుందో ఇప్పటివారికి ఎవరికీ తెలిసి ఉండదు. నేరుగా తలపడకపోయినా.. ఆ ప్రచ్ఛన్న యుద్ధంలో ఎన్నో ఎత్తులు, పైఎత్తులు. ప్రత్యర్థిని మానసికంగా, శారీరకంగానే కాదు.. అనేక రకాలుగా కుంగదీసే ప్రయత్నాలు ఆ ఎత్తుగడల్లో భాగంగా ఉంటాయి. ఇదే సమయంలో అలాంటి అవకాశం ప్రత్యర్థికి ఇవ్వకూడదని జాగ్రత్తలు తీసుకుంటాయి. కానీ, అమెరికా ఈసారి కాలు జారింది. రష్యా గట్టిగా పట్టుకుని పంతం నెగ్గించుకుంది.

ఇంతకూ ఏం జరిగిందంటే..? బ్రిట్నీగ్రినెర్‌ అమెరికా జాతీయ మహిళా బాస్కెట్‌ బాల్‌ స్టార్‌. ఈమె ఈ ఏడాది ఫిబ్రవరిలో గంజాయి తైలంతో మాస్కో విమానాశ్రయంలో అరెస్టయింది. అయితే, అప్పటికి ఉక్రెయిన్ పై రష్యా యుద్ధానికి దిగలేదు. లేదా యుద్ధం ప్రారంభ దశలో ఉంది. కానీ, గ్రినెర్ అరెస్టు తర్వాత యుద్ధం మొదలై పతాక స్థాయికి వెళ్లి అమెరికా-రష్యా కారాలు మిరియాలు నూరుకునే పరిస్థితి వచ్చింది. దీంతో గ్రినెర్ రష్యాలో మగ్గిపోసాగింది. అయితే, ఆమెను బయటకు తీసుకురావాలంటే ఏం చేయాలో పాలుపోని పరిస్థితి. ఇలాంటి సమయంలో ఓ బేరం కుదిరింది.

బౌట్.. బెట్...అతడి పేరు విక్టర్ బౌట్. వయసు 55 ఏళ్లు. సోవియట్ యూనియన్ లో భాగమైన తజకిస్థాన్ లో పుట్టాడు. గతంలో సోవియట్‌ సైన్యంలో ట్రాన్స్‌లేటర్‌గా పనిచేశారు. సోవియట్‌ మిలటరీ ఇన్‌స్టిట్యూట్‌లో ఫారెన్‌ లాంగ్వేజెస్‌ చదివాడు. సోవియట్‌ పతనం తర్వాత అంతర్జాతీయ రవాణా వ్యాపారిగా మారాడు. ఆయుధ వ్యాపారిగా మారి ఉక్రెయిన్‌ తదితర ప్రాంతాల నుంచి ఆయుధాలను ప్రపంచమంతటా విక్రయించాడు. ప్రపంచ వ్యాప్తంగా ఉగ్ర, తిరుగుబాటు గ్రూపులతో సంబంధాలు పెట్టుకొన్నాడు. ఇతడి నెట్‌వర్క్‌ అఫ్గానిస్థాన్‌, పాకిస్థాన్‌, ఇరాక్‌, సూడాన్‌, అంగోలా, కాంగో, లైబీరియా, ఫిలిప్పీన్స్‌, రువాండా, సియెర్రా లియోన్‌కు విస్తరించింది. సోవియట్‌ యూనియన్‌కు చెందిన ఇంటెలిజెన్స్‌ సంస్థ జీఆర్‌యూ తోడ్పాటుతో ఓ స్టార్టప్‌ మొదలుపెట్టాడు. విక్టర్‌కు సొంతగా పెద్దసంఖ్యలో విమానాలున్నాయి. తొలి మూడు విమానాలు జీఆర్‌యూనే ఇచ్చింది.ఇతడి వద్ద యాంటినోవ్‌, ఇల్యూషన్‌, యకోవ్‌లెవ్‌ రకం కార్గో విమానాలు ఉన్నాయి. వీటితో పలుసార్లు యుద్ధ క్షేత్రాలకు ఆయుధాలను తరలించాడు. అమెరికా ట్విన్‌ టవర్స్ పేల్చివేత జరిగే వరకు విక్టర్‌ భారీగా ఆయుధాలను విక్రయించేవాడు.

అయితే, 2006లో అమెరికా బౌట్ కు ఉన్న 30 డొల్ల కంపెనీల్లో 12 సంస్థల ఆస్తులను స్తంభింపజేసింది. అమెరికన్లతో లావాదేవీలు నిర్వహించకుండా ఆదేశాలు జారీ చేసింది. కానీ, అతడి పరపతి కారణంగా అరెస్టు చేయలేదు. 2008లో పరిస్థితులు మారాయి. ఆ ఏడాది అమెరికా డ్రగ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏజెన్సీలు థాయ్‌లాండ్‌లో వేసిన ఉచ్చులో బౌట్ చిక్కాడు. కొలంబియాకు చెందిన ఎఫ్‌ఏఆర్‌సీ రెబల్స్‌ రూపంలో బౌట్ వద్ద ఆయుధ కొనుగోళ్లకు వెళ్లి పట్టుకున్నారు. అలా 2008 మార్చిలో అరెస్టు చేయగా.. 2010లో అమెరికాకు తరలించారు. 2012లో బౌట్కు 25 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఎఫ్‌ఏఆర్‌సీ రెబల్స్‌కు వందల కొద్దీ సర్ఫేస్‌ టూ ఎయిర్‌ మిసైళ్లను, 20 వేల ఏకే 47లను అమ్మేందుకు అంగీకారం కుదుర్చుకున్నందుకు ఈ శిక్ష విధించారు.

అతడు కావాలి..విక్టర్ బౌట్ ను ఎలాగైనా విడిపించాలని భావించిన రష్యా.. అతడి విడుదలకు బ్రిట్నీ గ్రినెర్ తో ముడిపెట్టింది. ఈ మేరకు డీల్‌లో భాగంగా అమెరికా అతడిని జైలు నుంచి విడుదల చేసింది. ఇందుకు సౌదీ-యూఏఈ మధ్యవర్తిత్వం వహించాయి. వాషింగ్టన్‌ నుంచి ప్రైవేటు విమానంలో బౌట్‌ను అబుదాబి తీసుకొచ్చారు. మాస్కో నుంచి మరో ప్రైవేట్‌ జెట్‌ గ్రినెర్ ను తీసుకొని వచ్చింది. విమానాశ్రయంలోనే పరస్పరం మార్చుకొన్నారు. ఆ వీడియో క్లిప్‌ను రష్యా ప్రభుత్వ మీడియా సంస్థలు విడుదల చేశాయి. ఈ డీల్‌ కుదిర్చేందుకు సౌదీ యువరాజు మహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌(ఎంబీఎస్‌), యూఏఈ అధ్యక్షుడు మహమ్మద్‌ బిన్‌ జయేద్‌ అల్‌ నహ్యాన్‌ కీలక పాత్ర పోషించారు. ఈ విషయాన్ని
ఆయా దేశాల విదేశాంగ విభాగాలు పేర్కొన్నాయి. కానీ, వాషింగ్టన్‌ దీనిని అంగీకరించలేదు. అమెరికా-రష్యాలే చర్చించుకొన్నాయని పేర్కొంది.

అతడిపై సినిమా విక్టర్ బౌట్ కు రష్యా మద్దతు అందరికీ తెలిసిందే. ఆయుధ వ్యాపారి కావడమే ఇందుకు కారణం. బౌట్ వ్యాపారంపై ఏకంగా 'ఘోస్ట్‌రైడర్‌' హీరో నికోలస్‌ కేజ్‌తో 'లార్డ్‌ ఆఫ్‌ వార్‌' సినిమానే నిర్మించారు. బౌట్ విమానాలు ఆఫ్రికా, ఆసియాల్లో తిరిగేవి. యునైటెడ్ నేషన్స్ శాంతి పరిరక్షక దళాన్ని సోమాలియాకు చేర్చడానికి, ఐరాస ఆహార సాయాన్ని కాంగోకు చేర్చడానికి కూడా విక్టర్‌ విమానాలు వినియోగించారు. అల్‌ఖైదా, తాలిబన్లతో సంబంధాలున్నట్లు అతడిపై ఆరోపణలు ఉన్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.