Begin typing your search above and press return to search.

కరోనా వ్యాక్సిన్ డోస్ పూర్తయిన వారికి గుడ్ న్యూస్ చెప్పిన అమెరికా!

By:  Tupaki Desk   |   4 April 2021 12:30 AM GMT
కరోనా వ్యాక్సిన్ డోస్ పూర్తయిన వారికి గుడ్ న్యూస్ చెప్పిన అమెరికా!
X
కరోనా మహమ్మారి గతేడాది నుంచి ప్రపంచ దేశాలను వణికిస్తూనే ఉంది. అగ్రరాజ్యం, చిన్న రాజ్యం తేడా లేకుండా కోరలు చాస్తూనే ఉంది. ఈ వైరస్ను ఎదుర్కోవడానికి ఇప్పటికే పలు దేశాలు టీకాలు తయారు చేశాయి. చాలా దేశాల్లో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభించారు. అమెరికాలోనూ టీకా పంపిణీ జోరుగా సాగుతోంది. కాగా వ్యాక్సిన్ డోస్ పూర్తయిన వారికి అమెరికా గుడ్ న్యూస్ చెప్పింది.

కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వారికి కొన్ని మినహాయింపులు వర్తిస్తాయని ప్రకటించింది. టీకా తీసుకున్న వారికి మహమ్మారితో తక్కువ ప్రమాదం ఉన్నందున ఊరటనిచ్చే మార్గదర్శకాలు విడుదల చేసింది. అందుకు సంబంధించిన నూతన నిబంధనలను అమెరికా డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ సూచించింది. టీకా తీసుకున్న వారికి ప్రత్యేక నిబంధనలు విడుదల చేసినా... మాస్క్ ధరించడం, భౌతిక దూరం వంటివి కచ్చితంగా పాటించాల్సిందేనని నొక్కి చెప్పింది.

వ్యాక్సిన్ తీసుకున్న వారు అంతర్జాతీయ ప్రయాణాలకు ముందు కరోనా పరీక్ష చేయించుకోవాల్సిన అవసరం లేదని చెప్పింది. అంతేకాకుండా ప్రయాణం అనంతరం తిరిగివచ్చాక కూడా ఎలాంటి స్వీయ నిర్బంధం ఉండాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. అయితే ప్రయాణికులు వెళ్లే ప్రాంతాన్ని బట్టి ఆ పరీక్షలు చేయించుకోవాలని సూచించింది. విమాన ప్రయాణాలు చేసే మూడు రోజుల ముందు వైరస్ పరీక్షలు చేయించుకోవాలని నొక్కి చెప్పింది.

వ్యాక్సిన్ చివరి డోస్ తీసుకున్నట్లైతేనే వారు పూర్తిగా వ్యాక్సిన్ తీసుకున్నట్లుగా పరిగణిస్తారని అమెరికా డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తేల్చి చెప్పింది. అయితే టీకా తీసుకోని వారికి మునుపటి నిబంధనలే వర్తిస్తాయని స్పష్టం చేసింది. అంటే ప్రయాణానికి మూడు రోజుల ముందు వైరస్ పరీక్ష చేయించుకోవాలి. తిరిగి వచ్చాక అయిదు రోజుల లోపు పరీక్ష చేయించుకోవాలి. వారం రోజుల పాటు స్వీయ నిర్బంధంలో ఉండాల్సిందేనని స్పష్టం చేసింది.