Begin typing your search above and press return to search.

ఇక నుంచి.. అమెరికా వెళ్లే వారికి కరోనా పరీక్ష అవసరం లేదు

By:  Tupaki Desk   |   11 Jun 2022 5:10 AM GMT
ఇక నుంచి.. అమెరికా వెళ్లే వారికి కరోనా పరీక్ష అవసరం లేదు
X
ప్రపంచాన్ని మరోసారి గడగడలాడించడానికి కరోనా మహమ్మారి సిద్ధమవుతోంది. నాలుగో దశ మొదలైందా అన్నట్లుగా కొన్ని దేశాల్లో కొవిడ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో అమెరికా లో బైడెన్ సర్కార్ తీసుకున్న తాజా నిర్ణయం చర్చనీయాంశమైంది. ఇకపై అమెరికా వెళ్లే విదేశీ ప్రయాణికులు కరోనా పరీక్ష చేయించుకోవాల్సిన అవసరం లేదని ప్రకటించింది.

అమెరికా వెళ్లాలనుకుంటున్న వారికి ఓ గుడ్‌న్యూస్. ఇకపై అమెరికా వెళ్లే విదేశీ ప్రయాణికులు కరోనా పరీక్ష చేయించుకోవాల్సిన అవసరం లేదు. కొవిడ్ మొదటి దశలో అమల్లోకి వచ్చిన ఈ నిబంధనను ఎత్తివేస్తూ బైడెన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. శనివారం అర్ధరాత్రి 12.01 గంటల నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని ప్రకటించింది.

రెండేళ్ల క్రితం కరోనా కోరలు చాస్తున్న సమయంలో అమెరికా వెళ్లే ప్రయాణికులు ఒక రోజు ముందుగా కరోనా పరీక్ష చేయించుకోవాలనే నిబంధనను అగ్రరాజ్యం అమల్లోకి తీసుకు వచ్చింది. కరోనా మొదటి దశ, రెండు, మూడు దశల వరకు ఈ నిబంధనను అమలు చేశారు.

కరోనా పరీక్ష తర్వాత రిజల్ట్‌కు సంబంధించిన పత్రాలను చూపించాల్సి ఉంటుంది. రిజల్ట్ నెగెటివ్ వచ్చిన వాళ్లకు మాత్రమే అమెరికాలోకి అనుమతి ఉంటుంది. ప్రస్తుతం ఆ దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో ఈ పరీక్షలు అవసరం లేదని అమెరికాకు చెందిన సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) ప్రకటించింది.

ఈ అంశంపై సైన్స్ అండ్ డేటాను పరిశీలించి నిర్ణయం తీసుకున్నట్లు బైడెన్ సర్కార్ వెల్లడించింది. విమానయాన సంస్థలు, ట్రావెల్ ఇండస్ట్రీ ఒత్తిడి వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. వేసవి కావడం వల్ల టూరిస్ట్‌లు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుందని.. ఈ క్రమంలో వారికి ఇబ్బంది కలిగించే ఇలాంటి నిబంధనలు అవసరం లేదని.. వెంటనే వీటిని ఎత్తి వేయాలని ప్రభుత్వాన్ని కోరినట్లు సమాచారం. వారి విజ్ఞప్తిని పరిశీలించిన బైడెన్ సర్కార్.. ప్రస్తుతం దేశంలో పరిస్థితులను పరిగణననలోకి తీసుకుని నిబంధనను ఎత్తివేసింది.

ప్రస్తుతం ప్రపంచంలో ఇతర దేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్నందున.. ఈ నిబంధన ఎత్తివేయడం సరైందా కాదా అనే ప్రశ్న ప్రజల్లో తలెత్తుతోంది. అయితే 90 రోజుల వరకు ఈ నిబంధనను ఎత్తివేసి పరిస్థితులు ఎలా ఉంటాయో చూస్తామని.. మూణ్నాళ్ల తర్వాత అప్పటి పరిస్థితులకు అనుగుణంగా నిబంధన ఎత్తివేత కంటిన్యూ చేయడమో లేదా.. మళ్లీ అమలు చేయడమో నిర్ణయం తీసుకుంటామని సీడీసీ ప్రకటించింది.