Begin typing your search above and press return to search.

అమెరికా అంతే.. మరోసారి తన బుద్ధిని చూపించిందిగా

By:  Tupaki Desk   |   17 July 2022 12:30 PM GMT
అమెరికా అంతే.. మరోసారి తన బుద్ధిని చూపించిందిగా
X
నిద్ర లేచింది మొదలు ప్రపంచ దేశాలకు నీతులు చెప్పటం.. సుద్దులు వల్లె వేయటం లాంటివి చేస్తూ.. ప్రపంచం మీద తన అధిక్యతను.. అధిపత్యాన్ని ప్రదర్శించటానికి తెగ ఉబలాటపడుతుంటుంది అగ్రరాజ్యం అమెరికా. తన ప్రయోజనాలకు చిన్నపాటి నష్టం వాటిల్లినా సరే.. తట్టుకోలేని ఈ పెద్దన్న బుద్ధిని చూసినప్పుడు మాత్రం కంపరం పుట్టక మానదు. తాజాగా మరోసారి అలాంటి బుద్ధినే చూపించి.. అమెరికా అంతే అన్న మాటను మరోసారి రుజువు చేసిందని చెప్పాలి.

ఉక్రెయిన్ మీద యుద్ధాన్ని షురూ చేసిన రష్యాను ఏకాకిని చేసేందుకు అమెరికా అండ్ కో చేసిన ప్రయత్నాలు అన్ని ఇన్ని కావు. తన వరకే కాదు.. ప్రపంచం మొత్తం తాను చెప్పినట్లే చేయాలని చెప్పిన అమెరికా.. మన దేశానికి కూడా నీతులు చెప్పే ప్రయత్నం చేయటం తెలిసిందే. తమ ప్రయోజనాల కోసం ఏమైనా చేసే అమెరికా.. మిగిలిన వారి ప్రయోజనాల గురించి అస్సలు ఆలోచించదు. రష్యా మీద కత్తి కట్టి.. అందరూ తాను చెప్పినట్లే చేయాలని చెప్పిన ఆ దేశంలో ఇప్పుడు రష్యాతో అంటకాగేందుకు సిద్ధమైంది.

ఉక్రెయిన్ మీద యుద్ధంతో రష్యా మీద పలు అంశాలపై బ్యాన్ విధించిన అగ్ర రాజ్యం ఇప్పుడు అందుకు భిన్నంగా సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. రష్యాతో కలిసి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి విమానాల్ని తిరిగి ప్రారంభిస్తామని ప్రకటించింది. దీనికి సంబంధించిన అమెరికా స్పేస్ ఏజెన్సీ నాసా తాజా ప్రకటన చేసింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నిరంతరం సురక్షిత కార్యకలాపాలను నిర్దారించటానికి.. వ్యోమగాముల జీవితాల్ని పరరిక్షించటానికి మీలుగా రష్యాతో కలిసి పని చేయనున్నట్లు చెప్పాలి.

తన ప్రయోజనాల కోసం రష్యాతో చేతులు కలిపే ఈ వ్యవహారంలోనూ ప్రపంచం పేరు ప్రస్తావించటం గమనార్హం. తన ప్రయోజనాలు ప్రపంచ ప్రయోజనాలుగా భావించే పెద్దన్న పొగరు ఉట్టిపడేలా తాజా మాటలు ఉన్నాయని చెప్పక తప్పదు. తన మీద కత్తి దూసిన అమెరికా కారణంగా.. కిందా మీదా పడుతున్న పుతిన్ కు.. అమెరికా ప్రయోజనాల కోసం చేతులు ముందుకు చాచిన వైనం ఆసక్తికరంగా మారింది.

ఇదిలా ఉంటే.. నాసా ప్రకటన వేళలోనూ రష్యాలోనూ మరో విశేషం చోటుచేసుకుంది. వీలుగా రోస్ కాస్మోస్ సంస్థ డైరెక్టర్ దిమిత్రి రోగోజిన్ ను బాధ్యతల నుంచి తప్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో.. నాసా ప్రకటనకు పుతిన్ సానుకూలంగా స్పందించారని కొన్ని అంతర్జాతీయ మీడియా సంస్థల కథనాలు చెబుతుంటే.. మరికొందరు మాత్రం నాసా ప్రతిపాదనకు తాను అనుకూలంగా లేమన్న సంకేతాన్ని పుతిన్ పంపారంటున్నారు. దీనిపై కాలమే మరింత క్లారిటీ ఇవ్వనుంది. ఇదిలా ఉంటే.. టెక్నాలజీలో తోపులమని చెప్పుకునే అమెరికాకు.. ఇప్పటికి ఐఎస్ఎస్ విషయంలో రష్యాతో పని చేయటం తప్పించి.. మరో మార్గం లేదా? అన్న ప్రశ్న పలువురి నోట వినిపిస్తుండటం గమనార్హం.