Begin typing your search above and press return to search.

అమెరికాలో చ‌దువు కోసం ప్ర‌భుత్వ ప్ర‌త్యేక యాప్!

By:  Tupaki Desk   |   12 May 2019 5:23 AM GMT
అమెరికాలో చ‌దువు కోసం ప్ర‌భుత్వ ప్ర‌త్యేక యాప్!
X
అమెరికాలో చ‌దువుకునేందుకు భార‌తీయుల ఆస‌క్తి ఎంత ఎక్కువో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. అమెరికాలో చ‌దువుకునేందుకు భారత విద్యార్థులు ప‌డే పాట్లు అన్నిఇన్ని కావు. ఈ క్ర‌మంలో కొన్ని అనుమ‌తి లేని క‌ళాశాలల్లో ఆడ్మిష‌న్లు తీసుకొని మోస‌పోవ‌టం లాంటి ఉదంతాలు త‌ర‌చూ వెలుగు చూస్తుంటాయి. ఈ క్ర‌మంలో ఇలాంటి ఇబ్బందులు లేకుండా.. భార‌తీయ విద్యార్థుల కోసం అమెరికా ప్ర‌భుత్వం ప్ర‌త్యేక యాప్ రూపొందించే కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టింది.

విద్యార్థి వీసా కోసం ఎలా అప్లై చేయాలి? విద్యా సంస్థ‌ను ఎలా ఎంపిక చేసుకోవాలి? విద్యా సంవ‌త్స‌రం ఎప్పుడు ప్రారంభం కానుంది? ఏయే కోర్సుల‌కు స్కాల‌ర్ షిప్.. ఫెలో షిప్స్ ల‌భిస్తాయి? ఏయే విద్యా సంస్థ‌లు వాటిని అందిస్తాయి? వీసా కోసం ఎలాంటి ప‌త్రాలు అవ‌స‌రం? ఎప్పుడు అప్లై చేయాలి? వీసా ఇంట‌ర్వ్యూ అపాయింట్ మెంట్ తీసుకోవ‌టం ఎలా? లాంటి అంశాల్లో భార‌తీయ విద్యార్థుల‌కు ఉప‌యుక్తంగా ఉండేలా యాప్ ను రూపొందిస్తున్నారు.

భార‌తీయ విద్యార్థుల కోసం రూపొందిస్తున్న యాప్ ను వ‌చ్చే నెల‌లో ఆవిష్క‌రించేందుకు క‌స‌ర‌త్తు చేస్తున్న‌ట్లు అమెరికా రాయ‌బార కార్యాల‌యం చెబుతోంది. 400 విశ్వ‌విద్యాల‌యాలు.. 4700 విద్యా సంస్థ‌లు ఉన్నాయి. వీటిల్లో ప్ర‌పంచ వ్యాప్తంగా వివిధ దేశాల‌కు చెందిన సుమారు ప‌ది ల‌క్ష‌ల మంది విద్యార్థులు చ‌దువుతున్నారు. భార‌త్ నుంచే ఏటా రెండు ల‌క్ష‌ల మంది విద్యార్థులు చ‌దువుకోసం యూఎస్ వెళుతున్నారు.

అమెరికాకు వెళ్లే భార‌తీయ విద్యార్థుల్లో 70 శాతం మంది 300నుంచి 400 వ‌ర్సిటీల్లోనే చ‌దువుతున్న‌ట్లుగా గ‌ణాంకాలు స్ప‌ష్టం చేస్తున్నాయి. అమెరికాకు చ‌దువు కోసం వెళ్లే వారిలో ద‌క్షిణాది వారు ఎక్కువ‌. వారిలో రెండు తెలుగు రాష్ట్రాల వారి సంఖ్య ఎక్కువే. సౌత్ లో ఎడ్యుకేష‌న్ వీసాల కోసం చెన్నై.. హైద‌రాబాద్ కార్యాల‌యాల‌కు అత్య‌ధిక అప్లికేష‌న్లు వ‌స్తుంటాయి. అమెరికాలో విద్యా సంవ‌త్స‌రం ఇప్పుడే ప్రారంభ‌మైన నేప‌థ్యంలో వ‌చ్చే నెల‌లో యాప్ ను అందుబాటులోకి తీసుకురావాల‌ని భావిస్తున్న‌ట్లు చెబుతున్నారు. అమెరికాలో చ‌దువుకోసం వాళ్ల మీద‌.. వీళ్ల మీద ఆధార‌ప‌డే క‌న్నా.. అమెరికా ప్ర‌భుత్వ యాప్ మీద ఆధార‌ప‌డ‌టం మేలుగా చెప్ప‌క త‌ప్ప‌దు.