Begin typing your search above and press return to search.

ప్రపంచం దృష్టిలో జోక్ గా అమెరికా మీడియా

By:  Tupaki Desk   |   10 Nov 2016 6:33 AM GMT
ప్రపంచం దృష్టిలో జోక్ గా అమెరికా మీడియా
X
ప్రపంచానికి సంబంధించి ఏ విషయంలో అయినా తమకు మించిన తోపులు ఉండరన్నట్లుగా వ్యవహరిస్తుంటారు అమెరికన్లు. కొందరు నమ్రతతో ఆ విషయాన్ని చెబితే.. మరికొందరు ఆత్మవిశ్వాసంతో.. ఇంకొందరు అతిశయంతో గొప్పలు చెప్పుకుంటూ పోతారు. ఏ విషయంలో అయినా మొనగాళ్లమని చెప్పుకునే దానికి భిన్నంగా ఈ రోజున ప్రపంచం దృష్టిలో అమెరికా మీడియా పెద్ద జోక్ గా మారింది. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి ఆ దేశ మీడియా చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. శాస్త్రీయ పద్ధతిలో సర్వేలు నిర్వహిస్తున్నామని చెప్పిన గొప్పలు ట్రంప్ విజయంతో నవ్వుల పాలైన పరిస్థితి.

తోపుల్లాంటి అమెరికా మీడియా సంస్థలన్నీ (ఒకట్రెండు మినహాయించి) మూకుమ్మడిగా అమెరికా తదుపరి అధ్యక్షురాలిగా హిల్లరీ క్లింటన్ అని నొక్కి వక్కాణించాయి. ఆమె ఎలా విజయం సాధిస్తారో చెబుతూ భారీగానే నివేదికలు ప్రచురించాయి. దేశంలో వివిధ వర్గాల వారు హిల్లరీని ఎంతగా అభిమానిస్తున్నారంటూ గ్రాఫులు వగైరా.. వగైరా అచ్చేసి మరీ తమ అంచనాల్ని వెల్లడించాయి. అయితే.. వారు చెప్పిన దానికి భిన్నంగా అమెరికా అధ్యక్షునిగా ట్రంప్ సంచలన విజయం సాధించటం అమెరికన్ మీడియాకు భారీ షాక్ గా చెప్పక తప్పదు.

అమెరికా మీడియా వెల్లడించిన అంచనాల్నే ప్రపంచంలోని పలు దేశాలకు చెందిన మీడియా ఫాలో కావటం.. వాటిని అంచనాల్ని ఆధారంగా.. వారి విశ్లేషణల్ని ప్రాతిపదికగా చేసుకొని కథనాలు అల్లటంతో అమెరికన్ మీడియాతో పాటు.. ప్రపంచ మీడియా సైతం తప్పులో కాలేసినట్లైంది. అయితే.. తాము ప్రచురిస్తున్న సమాచారం మొత్తం అమెరికన్ మీడియాను ఆధారంగా చేసుకొనే అన్న విషయాన్ని ప్రపంచ దేశాలకు చెందిన మీడియా సంస్థలు స్పష్టం చేసిన నేపథ్యంలో అమెరికన్ మీడియా ఇప్పుడు దోషిగా మారిన పరిస్థితి. సాంకేతికంగా ఎంతో ముందు ఉంటుందని చెప్పే అమెరికన్ మీడియా.. ప్రపంచంలో ఏం జరిగినా భారీ విశ్లేషణల్ని అచ్చేయటం.. దాన్ని గొప్పగా చెప్పుకోవటం ప్రపంచంలోని చాలా దేశాల ప్రజలకు అలవాటు.

ఇకపై అలాంటి వాటికి విలువ లేదని చెప్పాలి. ఎందుకంటే.. సొంత ప్రజల మనసుల్ని చదవలేని అమెరికా మీడియాకు.. ప్రపంచ దేశాల్లోని పరిణామాల్ని విశ్లేషించేంత సీన్ ఉందనుకోవటం తప్పే అవుతుంది. సొంత ప్రజలు ఏమనుకుంటున్నారు. తమ భవిష్యత్ నేతగా ఎవరిని కోరుకుంటున్నారన్న విషయంలో అమెరికన్ మీడియా చేసిన తప్పు చరిత్రలో అదో జోక్ గా మారటమే కాదు.. అమెరికన్ మీడియా పెద్ద ఫూల్ గా మారిందన్న ఘాటు విమర్శ కొందరు వ్యక్తం చేస్తున్నారని చెప్పక తప్పదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/