Begin typing your search above and press return to search.

అమెరికన్ల‌కు వ‌ణుకు పుట్టిస్తున్న ట్రంప్‌

By:  Tupaki Desk   |   5 Dec 2016 4:57 AM GMT
అమెరికన్ల‌కు వ‌ణుకు పుట్టిస్తున్న ట్రంప్‌
X
వ‌చ్చేనెల‌లో అమెరికా అధ్య‌క్ష ప‌గ్గాలు చేప‌ట్ట‌నున్న డొనాల్డ్ ట్రంప్ అధికారికంగా సింహాసనాన్ని అధిష్టించకముందే తన చర్యలు - వ్యాఖ్యల్తో అమెరికన్లకు దడపుట్టిస్తున్నారు. సైనిక శక్తిలోనే కాదు.. వ్యాపారపరంగా కూడా ప్రపంచానికి పెద్దన్నగా వ్యవహరించాలని ఉబలాటపడే అమెరికన్లకు ట్రంప్‌ తీరు భవిష్యత్‌ పై అభద్రతాభావాన్ని పెంచుతోంది. ఇప్పటికే భారత్‌ - చైనాలకు వ్యతిరేకంగా ట్రంప్‌ చేపట్టిన చర్యలతో అమెరికన్లకు కొరివితో తలగోక్కున్నట్లవుతోంది. కాగా సరిహద్దు దేశం మెక్సికోపై ఆయన వ్యాఖ్యలు అమెరికన్ల వ్యాపార సామ్రాజ్యాన్ని దెబ్బతీసే పరిస్థితి తెస్తున్నాయి.

ఎన్నికల సందర్భంగా మెక్సికో నుంచి వ‌స్తున్న అక్రమ చొరబాటుదార్లను కట్టడి చేస్తానంటూ ట్రంప్‌ హామీ ఇచ్చారు. ఇందుకోసం మెక్సికో సరిహద్దు వెంబడి గోడను కూడా నిర్మిస్తామన్నారు. అయితే పూర్తిగా స్థానిక యువతకు కొరవడుతున్న ఉపాధి అవకా శాల్ని దృష్టిలో పెట్టుకుని ట్రంప్‌ ఈ హామీని గుప్పించారు. మెక్సికోలో నిరుద్యోగం అనూహ్యంగా పెరిగింది. ఇక్కడ ఏకంగా 21శాతం ఉద్యోగులు నమోదయ్యారు. ఉపాధి కోసం వీరు అక్రమంగా అమెరికాలోకి చొరబడుతున్నారు. అతి తక్కువ వేతనాలపైనే వీరు పని చేస్తుండడంతో స్తానికుల్ని కూడా కాదని వీరికే ఉద్యోగాలిస్తున్నారు. ఇది సహజంగానే అమెరికన్లకు కంటగింపు చర్యగా మారింది. పైగా అమెరికన్లకు చెల్లించాల్సిన వేతనంతో పోలిస్తే కేవలం 20నుంచి 25శాతానికే మెక్సికన్లు మరింత సమర్ధవంతంగా పని చేస్తున్నారు. అమెరికన్‌ యువతను దృష్టిలో పెట్టుకుని చేసిన వ్యాఖ్యల్ని ట్రంప్‌ ఎన్నికల తర్వాత కూడా మర్చిపోలేదు. తాజాగా మెక్సికో చొరబాబుదార్లపై ఆయన తీవ్ర వ్యాఖ్యలుచేశారు. సరిహద్దుల్ని మూసేస్తామంటూ హెచ్చరించారు. దీంతో యుఎస్‌ లోని వాణిజ్యవర్గాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి.

ట్రంప్ తాజా వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో చమురు - గ్యాస్‌ ఎగుమతిదార్లు భయాందోళనలకు గురౌతున్నారు. ఇందుక్కారణం యుఎస్‌ నుంచి జరిగే చమురు - గ్యాస్‌ ఎగుమతుల్లో సింహభాగం మెక్సికోకే వెళ్తున్నాయి. 2009నుంచి ఈ ఎగుమతులు ఏటేటా పెరుగుతున్నాయి. గతేడాదైతే మొత్తం ఎగుమతుల్లో సగానికిపైగా మెక్సికోకే జరిగాయి. దీన్ని దృష్టిలోపెట్టుకుని మెక్సికో మీదుగా యుఎస్‌ గ్యాస్‌ - చమురు పైప్‌ లైన్‌ నిర్మించింది. రానున్న మూడేళ్ళలో దీని ద్వారా సరఫరాను రెట్టింపు చేయాలని భావిస్తోంది. ప్రస్తుతం ఈ పైప్‌ లైన్‌ ద్వారా రోజూ4.2బిలియన్‌ క్యూబిక్‌ అడుగుల సామర్ధ్యంగల సహజవాయువును సరఫరా చేస్తున్నారు. ముఖ్యంగా టెక్సాస్‌ నుంచి జరిగే ఎగుమతులన్నీ కొత్త పైప్‌ లైన్‌ ద్వారా మెక్సికోకే జరుగుతున్నాయి. వాస్తవానికి ఈ పైప్‌ లైన్‌ సామర్ధ్యం రోజూ 7.2బిలియన్‌ క్యూబిక్‌ అడుగులుగా ఉంది. ఈ సామర్ద్యాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకునేందుకు చమురు - గ్యాస్‌ సంస్థలు సన్నద్దమయ్యాయి. తద్వారా మెక్సికోతో పాటు ఉత్తర అమెరికాలోని ఇతర దేశాలకు కూడా ఇదే పైప్‌ లైన్‌ ద్వారా ఎగుమతుల్ని పెంచేందుకు వ్యూహాలు సిద్దం చేస్తున్నాయి. ఈ దశలో ట్రంప్‌ మెక్సికో పట్ల ఇదే వైఖరిని కొనసాగిస్తే 3.2బిలియన్‌ డాలర్లతో నిర్మించిన ఈ పైప్‌ లైన్‌ మొత్తం వృధా అవుతుంది. అమెరికా నుంచి జరిగే చమురు - గ్యాస్‌ ఎగుమతులు సగానికి పైగా పడిపోతాయి. ఇదే సమయంలో మెక్సికో మరో విశ్వాసపాత్రుడైన ఎగుమతిదారుడి కోసం గాలింపు మొదలెట్టింది. అమెరికాతో తమకు చిరకాల వ్యాపారబంధం ఉంది.. అమెరికాను మిత్రదేశంగా భావిస్తాం.. అంతమాత్రాన ఆ దేశంపై ఆధారపడి జీవించాలని మేం కోరుకోమంటూ మెక్సికోలోని న్యూవో రాష్ట్ర గవర్నర్‌ లియోన్‌ చేసిన వ్యాఖ్యలు మెక్సికన్ల ఆలోచనా సరళికి అద్దంపడతాయి. పైగా ఇప్పుడు అమెరికా ఒక్కటే ప్రపంచం కాదు. అంతకుమించిన ఉత్పత్తులు చేసే దేశాలు లెక్కకు మించున్నాయంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. మెక్సికో అతిపెద్ద మార్కెట్‌. ఇక్కడ కొనుగోలు శక్తి కూడా ఎక్కువే. అంతర్జాతీయ మార్కెట్లు మాపై ఆధారపడాలి తప్ప మేం వారిముందు సాగిలపడేదిలేదంటూ ఆయన తేల్చిచెప్పేశారు. అమెరికన్లకిప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడుతోందన్న ఆనందం కంటే ట్రంప్‌ పాలనలో ఎలా నెట్టుకురావాలన్న భ యమే అధికంగా వ్యక్తమౌతోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/