Begin typing your search above and press return to search.

క్రైస్త‌వ మ‌త ప్ర‌చారమే..ఆ టూరిస్టును చంపేసిందా?

By:  Tupaki Desk   |   22 Nov 2018 6:21 AM GMT
క్రైస్త‌వ మ‌త ప్ర‌చారమే..ఆ టూరిస్టును చంపేసిందా?
X
అండమాన్ - నికోబార్ దీవుల్లో.. అమెరికాకు చెందిన ఓ పర్యాటకుడు హత్యకు గురయిన క‌ల‌క‌లం సృష్టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. మృతుడిని జాన్ అలెన్ చౌ(27)గా గుర్తించిన పోలీసులు.. ఉత్తర సెంటినెల్ దీవులకు చెందిన ఆటవిక తెగ ప్రజలే ఆయనను చంపి ఉండవచ్చునని భావిస్తున్నారు. అయితే - ఈయ‌న హ‌త్య ఉదంతం వెనుక సంచ‌ల‌న అంశాలు వెలుగులోకి వ‌స్తున్నాయి. త‌మ‌దైన ప్ర‌త్యేక జీవితం గ‌డిపే ఆదివాసీల‌కు క్రైస్త‌వ మ‌త ప్ర‌చారం చేసే క్ర‌మంలోనే ఈ హ‌త్యకు గుర‌యిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. జాన్ అలెన్ గతంలో ఐదుసార్లు అండమాన్‌కు వచ్చారని - క్రైస్తవ బోధనలను ఉత్తర సెంటినెల్ ద్వీపంలోని గిరిజనులకు అందుబాటులోకి తీసుకురావాలని తపన పడేవారని స్థానిక మీడియా పేర్కొంది.

జాన్ అలెన్ ఐదురోజులుగా ఆయన ఆచూకీ తెలియకపోవడంతో జాన్‌ అలెన్ తల్లి ఢిల్లీలోని అమెరికన్ రాయబార కార్యాలయానికి ఫిర్యాదు చేశారు. దీంతో కాన్సుల్ అధికారులు స్థానిక యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. బుధవారం సెంటినెల్ దీవి సమీపంలో అలెన్ మృతదేహం ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. హెలికాప్టర్ల ద్వారా గాలించినా మృతదేహాన్ని వారు కనుగొనలేకపోయారు. బహుశా అలెన్ మృతదేహాన్ని ఆదివాసీలే ఇసుకలో పూడ్చివేసి ఉండవచ్చునని ఎస్పీ జతిన్ నార్వాల్ అనుమానం వ్యక్తం చేశారు. మరోవైపు జాన్‌ ను సెంటినెల్ ద్వీపానికి తీసుకెళ్లిన ఏడుగురు మత్స్యకారులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. ఈ సంద‌ర్భంగా వారు ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌ను వెల్ల‌డించారు. `` ఆయన ఈనెల 14వ తేదీనే సెంటినల్ ద్వీపానికి వెళ్లాలని ప్రయత్నించారు. కానీ సాధ్యపడలేదు. దీంతో రెండురోజుల తర్వాత 16వ తేదీన అన్ని ఏర్పాట్లు చేసుకుని మా వద్దకు వచ్చారు. అయితే మాకు అక్కడి తెగ గురించి తెలుసుకాబట్టి మేం తీసుకెళ్లేందుకు సాహసించలేదు. ఆయన మాకు డబ్బులిచ్చి ద్వీపానికి కొద్దిదూరంలో వదిలిపెడితే చాలని చెప్పారు. అన్నట్టుగానే మధ్యలోనే బోటు దిగి - చిన్నతెప్పను నడుపుకుంటూ ఆయనే ఆ ద్వీపం వైపు వెళ్లిపోయాడు. మేం అక్కడే ఉండి చూస్తుండగానే.. జాన్‌ అలెన్ సెంటినెల్ తీరానికి చేరుకున్నాడు. ఆయన తెప్ప నుంచి కాలు కింద పెట్టగానే స్థానిక తెగ ప్రజలు ఆయనపై బాణాలు విసరడం ప్రారంభించారు.బాణాలు గుచ్చుకుంటున్నా ఆయన ముందుకే నడుస్తూ వెళ్లాడు. కొద్దిసేపటికే కుప్పకూలిన ఆయన గొంతుకు తాడుబిగించిన సెంటినెల్‌ వాసులు.. శరీరాన్ని ఈడ్చుకెళ్లడం కనిపించింది. మేం భయంతో పారిపోయి వచ్చాం. తర్వాతి రోజు అక్కడికి వెళ్లినా.. ఆయన మృతదేహం మాత్రం మాకు కానరాలేదు`` అని మత్స్యకారులు పోలీసుల విచారణలో వెల్లడించినట్లు తెలిసింది.

బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా ఏకాకిగా మిగిలిపోయిన తెగల్లో సెంటినెలీస్ ఒకటి. అత్యంత ప్రమాదకరమైన తెగ కూడా ఇదే. తాము నివసించే ఉత్తర సెంటినెల్ దీవి ఛాయలకు కూడా ఇతరుల్ని రానివ్వరు. ఇటీవలే అండమాన్ ప్రభుత్వం నిషేధిత ప్రాంతాల జాబితా నుంచి సెంటినల్ దీవిని తొలగించింది. దీంతో 2022 డిసెంబర్ 31వరకు ఎవరైనా అక్కడికి వెళ్లేందుకు ప్రభుత్వ అనుమతి అవసరం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలోనే జాన్ అలెన్ అక్కడికి వెళ్లడానికి ప్రయత్నించినట్లు తెలుస్తున్నది. అండమాన్‌ లోని చిడియతాపు ప్రాంతం నుంచి కొందరు మత్స్యకారుల సహకారంతో ఈనెల 16న అలెన్ ఉత్తర సెంటినల్ ద్వీపం వద్దకు వెళ్లారు. అమెరికన్ టూరిస్ట్ అండమాన్ దీవులకు వెళ్లినట్లు మాకు సమాచారముంది. వ్యక్తిగత గోప్యత కారణంగా జాన్ అలెన్‌ కు సంబంధించిన మిగతా వివరాలను వెల్లడించలేము అని అమెరికన్ రాయబార కార్యాలయ ప్రతినిధి ఒకరు తెలిపారు. 2006లోనూ చేపల వేటకు వెళ్లిన ఓ బోటు సెంటినల్ ద్వీపం వద్ద బురదలో కూరుకుపోగా - స్థానిక తెగ బోటులోని వారిని హతమార్చింది. బోటును ధ్వంసం చేసింది. సెంటినలీస్‌ ను ప్రత్యేక సార్వభౌమత్వ రక్షిత ప్రాంతంగా గుర్తిసున్న భారత ప్రభుత్వం.. వారిపై విచారణ జరిపేందుకు నిరాకరించింది.