Begin typing your search above and press return to search.

'సోషల్ మీడియా సన్'కు అన్నీ తానైన అమ్మ

By:  Tupaki Desk   |   4 Feb 2016 7:30 PM GMT
సోషల్ మీడియా సన్కు అన్నీ తానైన అమ్మ
X
డెబోరా మిల్లర్... 60 ఏళ్ల అమెరికన్ వృద్ధురాలు తన కొడుకు కృష్ణమోహన్ త్రిపాఠీ పెళ్లి కోసం ఇండియాకు వచ్చింది. అమెరికన్ తల్లి కొడుక్కి ఇండియన్ పేరు ఎందుకు పెట్టిందనుకుంటున్నారా? అక్కడే ఉంది ట్విస్టు. డెబోరాకు కృష్ణమోహన్ సొంత కొడుకు కాదు... అలా అని దత్తత తీసుకున్న కొడుకూ కాదు. 'సోషల్ మీడియా సన్' .. అవును.. సోషల్ మీడియాలో ఏర్పడిన పరిచయంతో వారి మధ్య ఏర్పడిన తల్లీకుమారుల బంధం. ఆ బంధం ఎక్కడో అమెరికాలోని కాలిఫోర్నియా నుంచి డెబోరాను ఇండియాలోని ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం గోరఖ్ పూర్ వచ్చేలా చేసింది. తన సోషల్ మీడియా సన్ కోసం సముద్రాలు దాటుకుని వచ్చిన ఆ తల్లి కుమారుడి వివాహం చూసి ఎంతో సంతోషించింది. అంతేకాదు... కృష్ణమోహన్ అసలు తల్లి మృతిచెందడం... డెబోరాకు కూడా సంతానం లేకపోవడంతో వారిద్దరూ తల్లీకొడుకులయ్యారు. కృష్ణమోహన్ కు ఈ పేస్ బుక్ అమ్మే దగ్గరుండి పెళ్లి చేసింది. డెఫేస్ బుక్ అంటే ప్రేమలు - మోసాలు - అక్రమ సంబంధాలు - విడాకులే అనుకుంటున్న సమయంలో ఇలా ఖండంతరాలు దాటి మనుషుల మధ్య తల్లీకొడుకుల సంబంధాన్ని ఏర్పరరచడం విశేషమే.

పెళ్లికుమారుడు కృష్ణమోహన్ త్రిపాఠిది ఉత్తర్ ప్రదేశ్ లోని గోరఖ్ పూర్. 28 ఏళ్ల ఆయన ఎమ్మెస్సీ పూర్తిచేసి న్యాయవాది కావాలని లా చదువుతున్నాడు. ఫేస్ బుక్ లో ఓ సందర్భంలో డెబోరా పరిచయమయ్యారు. ఇద్దరి మధ్య పలుమార్లు సంభాషణలు జరిగాక కృష్ణమోహన్ అంటే డెబోరా అనురాగం పెంచుకున్నారు. డెబోరాకు పిల్లలు లేరు. కృష్ణమోహన్ తల్లి కూడా మరణించింది. ఈ విషయాలన్నీ తెలుసుకున్నాక డెబోరా కృష్ణమోహన్ మంచితనం అన్ని తెలుసుకుని ఆయన్ను తన కుమారుడిగా భావించింది. దాంతో కొన్నేళ్లుగా వారిద్దరి మధ్య తల్లీకొడుకుల బంధం కొనసాగుతోంది. రోజూ వారిద్దరూ ఛాటింగ్ చేసుకునేవారు. తల్లీకొడుకులుగానే పిలుచుకునేవారు. మొన్న జనవరి 30న కృష్ణమోహన్ పెళ్లి జరిగింది. తన పెళ్లికి రావాలంటూ అమ్మ డెబోరాను పిలిచాడు కృష్ణమోహన్. ఇంకేముంది రెక్కలు కట్టుకుని వాలిపోయిందా తల్లి.అక్కడ కృష్ణమోహన్ - ఇతర కుటుంబసభ్యులు తన పట్ల చూపిన ఆదారాభిమానాలకు చలించిపోయింది. కొడుకును పట్టుకుని కన్నీరుపెట్టుకుంది. దీంతో పెళ్లికొచ్చినవారంతా అది చూసి వారిద్దరి మధ్య ఏ జన్మలోనో దేవుడు కలిపిన తల్లీకొడుకుల బంధం ఉంది అని అనుకుంటూ ఎంతో సంతోషించారు.

మరోవైపు ఈ అమ్మ తన కొడుక్కి పెళ్లి సందర్భంగా భారీ బహుమతులు ఇచ్చారు. కోడలు పిల్ల కోసం 25 లక్షల విలువైన బంగారం ఆభరణాలు తెచ్చారు. కృష్ణమోహన్ తన పెళ్లి విషయం చెప్పడం.. ఆహ్వానించడంతో ఆమె అరుదైన బహుమతి ఒకటి తెచ్చారు. బ్రిటన్ లో 125 ఏళ్ల కిందటి వజ్రాల ఉంగరాన్ని ఒకటి కొడుకు కోసం ఆమె వేలంలో దక్కించుకుని మరీ దాన్ని తీసుకొచ్చారు. పెళ్లిలో ఆమె భారతీయ సంప్రదాయ వస్త్రధారణతో వధూవరులను ఆశీర్వదించారు. కృష్ణమోహన్ ఆశలు, కలలు అన్నీ తీరి నిండునూరేళ్లు సంతోషంగా పిల్లాపాపలతో ఉండాలని ఆశీర్వదించి భారమైన హృదయంతో అమెరికాకు తిరిగి వెళ్లిందా తల్లి.