Begin typing your search above and press return to search.

అమెరికాలో ఆగని గన్ కల్చర్: చికాగోలో మృత్యుఘోష

By:  Tupaki Desk   |   5 July 2022 3:05 AM GMT
అమెరికాలో ఆగని గన్ కల్చర్: చికాగోలో మృత్యుఘోష
X
అభివృద్ధిలో అగ్రరాజ్యం..పెత్తనంలో పెద్దన్న..అలాంటి అమెరికాలోని ప్రజలు ఇప్పుడు నిత్యం భయపడుతూ బతుకుతున్నారు. అందుకు కారణం గన్ కల్చర్ పెరగడమే. మొన్నటికి మొన్న ఓ పాఠశాలలో 18 ఏళ్ల యువకుడు విచక్షణ రహితంగా అమాయకులైన విద్యార్థులపై కాల్పులు జరిపి 19 మంది ప్రాణాలను బలిగొన్నాడు. ఇటీవల మరో మరో గుర్తు తెలియని వ్యక్తి ప్రజలపై కాల్పులు జరపడంతో ముగ్గురు మరణించారు. 11 మందికి పైగా గాయపడ్డారు. వరుసగా జరుగుతున్న ఇలాంటి కాల్పులతో అమెరికాలోని ప్రజలు భిక్కభిక్కుమంటూ గడుపుతున్నారు. అసలు అమెరికాలో ఇలాంటి కాల్పులు జరగకుండా చట్టం చేసినా కూడా కాల్పులు ఆగకపోవడం గమనార్హం.విచ్చలవిడిగా గన్స్ అందుబాటులో ఉంచడమే ప్రజల ప్రాణాలు పోవడానికి కారణమవుతోంది.

తాజాగా చికాగోలో దారుణం జరిగింది. ఇండిపెండెన్స్ డే పరేడ్ లక్ష్యంగా ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ఐదుగురు మృతిచెందగా.. 16 మంది గాయపడినట్లు మీడియా వర్గాల సమాచారం. ఏడుగురు మృతిచెందారని,37 మంది గాయపడ్డారని అంటున్నారు.

జులై 4 ఉదయం 10 గంటలకు పరేడ్ ప్రారంభమైన 10 నిమిషాలకే ఈ ఘటన చోటు చేసుకుంది. వెంటనే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.వీధుల్లో యాక్టివ్ గా ఉన్న గన్ మ్యాన్ కోసం గాలిస్తున్నారు. ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

స్వాతంత్ర్య దినోత్సవ పరేడ్ జరుగుతున్న హైలెండ్ పార్క్ లో దుండగుడు 10 నిమిషాల పాటు కాల్పులు జరిపినట్లు అధికారులు తెలిపారు. అటు వైపు రావద్దని.. ప్రజలకు సూచించారు. పోలీసులు దుండగుడిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు.

ఈ ఘటనలో చాలా మంది ప్రాణాలు కోల్పోయారని కొంతమంది నెటిజన్లు ట్వీట్ చేస్తున్నారు. ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పరేడ్ అహ్లాదంగా కొనసాగుతుండగా.. ఒక్కసారిగా కాల్పుల శబ్ధం వినిపించింది. దీంతో పరేడ్ లో పాల్గొన్న సిబ్బంది.. ప్రజలు భయంతో పరుగులు తీశారు. చిన్నారులను చంకలో పెట్టుకొని ప్రాణభయంలో పరుగులు తీస్తున్న దృశ్యాలు దిగ్బ్రాంతికి గురిచేస్తున్నాయి.

అమెరికాలోని గన్ కల్చర్ ఈనాటిది కాదు.. 1775 నుంచి వీటి వాడకం మొదలైంది. అప్పట్లో ఆఫ్రికన్ అమెరికన్లను బానిసలుగా ఉంచుకోవాలనే ఉద్దేశంతో తుపాకులు వాడడం మొదలుపెట్టారు. 1776లో ఇంగ్లాండ్ తో పోరాటం చేసి స్వాతంత్ర్యం సంపాదించుకున్న అమెరికా ఆ తరువాత అమెరికన్లు తమ భద్రత కోసం గన్స్ తో తిరిగేవారు. అయితే అప్పటి నుంచి ఈ కల్చర్ కొనసాగుతోంది. అంతేకాకుండా ‘వ్యక్తిగత భద్రత’ అనే పేరు చెప్పి ప్రతి ఒక్కరూ గన్స్ ను కొనుగోలు చేస్తున్నారు. కొందరు భద్రత కోసం తుపాకులు కొనుగోలు చేస్తుండగా.. మరికొందరు ప్రెస్టెజీ కోసం వాడుతున్నారు. ఇలా ప్రతి ఒక్కరి దగ్గర ఏదో ఒక గన్ ఉంటుంది.

అమెరికా రాజ్యాంగం ప్రకారం ఆయుధాలను హక్కుగా భావిస్తారు. కొందమంది దీనిని వ్యతిరేకించినా వ్యక్తిగత భద్రత కోసం ఎక్కువ మంది సపోర్టు చేస్తున్నారు. 2020లో అమెరికాలో నిర్వహించిన ‘గన్ కల్చర్ నియంత్రణ కోసం చట్టాలను కఠినతరం చేయడం అవసరమా..?’అనే సర్వేలో 52 శాతం మాత్రమే మద్దతు ఇచ్చారు. మిగతావారిలో 35 శాతం మంది చట్టాల్లో మార్పు చేయాల్సిన అవసరం లేదన్నారు. దీనిని భట్టి అమెరికాలో గన్ ప్రాముఖ్యత ఏంటో తెలుస్తుంది.

రెండు దశాబ్దాల్లో అగ్రరాజ్యంలో 20 కోట్ల గన్స్ అమ్ముడు పోయినట్లు తెలుస్తోంది. 2019 ఏప్రిల్ నుంచి 2011 మధ్య అమెరికాలో 7.5 మిలియన్ల మంది మొదటిసారిగా తుపాకులను కొనుగోలు చేసినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇలా కొనుగోలు చేసిన వారిలో పిల్లలు కూడా ఉన్నారు. అయితే1968 నుంచి 2017 మధ్య అమెరికాలో గన్ ను వాడడం వల్ల 15 లక్షల మంది మరణించారు. యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్సన్ (సీడీసీ) ప్రకారం 2020లో గన్ ను పేల్చడం వల్ల 45 వేల మంది మరణించారు. అయితే ఇందులో హత్యలు, ఆత్మహత్యలు ఉన్నాయి. వీటీలో ఆత్మహత్యలు 24,300 ఉన్నట్లు సమాచారం. ఆత్మహత్య చేసుకోవాలనుకున్నవారు అమెరికాలో ఎక్కువగా గన్ వాడడం గమనార్హం.