Begin typing your search above and press return to search.

కేసులున్న నేతలకు దడ పుట్టేలా అమికస్ క్యూరీ సిఫార్సులు

By:  Tupaki Desk   |   15 Nov 2022 4:12 AM GMT
కేసులున్న నేతలకు దడ పుట్టేలా అమికస్ క్యూరీ సిఫార్సులు
X
ముఖ్యమంత్రులు మొదలు ఎంపీలు.. ఎమ్మెల్యేలు మొదలు కొని ప్రజాప్రతినిధులుగా ఉన్న వారిపై నమోదైన క్రిమినల్ కేసులను ఐదేళ్లకు మించి పెండింగ్ లో ఉండటాన్ని ప్రస్తావిస్తూ ఇచ్చిన ఒక నివేదిక నాయకులకు కొత్త టెన్షన్ పెట్టేలా చేస్తోంది.

దీనికి కారణం తాజాగా దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు అమికస్ క్యూరీ.. సీనియర్ న్యాయవాదిగా వ్యవహరిస్తున్న విజయ్ హన్సారియా తాజాగా ఒక నివేదికను అందజేశారు. 40 పేజీలు ఉన్న ఈ నివేదికలో పలు కీలక అంశాల్ని ప్రస్తావించటమే కాదు.. పలు సూచనల్ని చేశారు. ఇవన్నీ రానున్న రోజుల్లో క్రిమినల్ కేసులు ఉన్న నేతలకు తలనొప్పిగా మారటం ఖాయమంటున్నారు.

ప్రజాప్రతినిదులపై ఉన్న కేసుల్లో విచారణలో వేగాన్ని పెంచాలని కోరుతూ బీజేపీ నేత కమ్ న్యాయవాదిగా వ్యవహరిస్తున్న అశ్వినీ కుమార్ ఉపాధ్యాయ ఒక పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణను సుప్రీంకోర్టు స్వీకరించింది. ఇందులో భాగంగా సుప్రీంకోర్టు అమికస్ క్యూరీగా నియమించిన హన్సారియా తాజాగా తన నివేదికను కోర్టుకు అందజేశారు.

ప్రజాప్రతినిధులపై కేసుల వివరాలను దేశ వ్యాప్తంగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు పంపగా.. కొన్ని రాష్ట్రాలు మాత్రం పంపలేదు. ఆ జాబితాలో తెలంగాణతో పాటు మరో తొమ్మిది హైకోర్టులు పంపలేదని పేర్కొన్నారు. కేవలం పదహారు హైకోర్టులు మాత్రమే సమాచారాన్ని అందించినట్లుగా పేర్కొన్నారు.

ప్రజాప్రతినిధులపై ఉన్న పెండింగ్ కేసులపై హన్సారియా ఇచ్చిన రిపోర్టులో పేర్కొన్న అంశాలు.. చేసిన సిఫార్సుల్ని చూస్తే..
- సీఆర్ పీసీ సెక్షన్ 309 ప్రకారం రోజువారీగా ట్రయల్ నిర్వహించాలి. దీనికి సంబంధించిన పని విభజనను హైకోర్టు లేదా ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జీలు రెండు వారాల్లో పూర్తి చేయాలి. అసాధారణ.. అత్యవసర పరిస్థితుల్లో తప్పించి వాయిదాలు ఇవ్వకూడదు. ఒకవేళ ఇస్తే కారణాల్ని నమోదు చేయాలి.
- ప్రజాప్రతినిధులపై ఉన్న కేసుల్ని విచారిస్తున్న కోర్టులు ముందుగా వాటిపైనే విచారణను కొనసాగించాలి.
- వాయిదాలు పడకుండా ప్రాసిక్యూషన్.. డిఫెన్స్ న్యాయవాదులు సహకరించాలి.
- విచారణ కోసం సంబంధిత జిల్లా సెషన్స్ జడ్జితో సంప్రదించి.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ప్రత్యేక కోర్ుటలో కనీసం ఇద్దరు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమించాలి.
- ఒకవేళ నిందితుడు ట్రయల్ జాప్యానికి కారణమైతే వారికి బెయిల్ రద్దు చేయాలి.
- సిట్టింగ్ ప్రజా ప్రతినిధులకు సంబంధించిన కేసుల విచారణను తొలుత చేపట్టాలి.
- మరణశిక్ష లేదంటే ఏడేళ్ల జైలు.. అంతకు మించి జైలుశిక్ష పడటానికి వీలున్న కేసుల విచారణకు ప్రత్యేక కోర్టులు తొలి ప్రాధాన్యతను ఇవ్వాల్సి ఉంటుంది.
- కోర్టు ఆదేశించిన రోజున నిందితులను హాజరుపరిచే బాధ్యతను సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారికి అప్పగించాలి. ఒకవేళ అలా చేయకుంటే కోర్టులు నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేయాలి.

- నిందితులు.. సాక్ష్యులను కోర్టు ముందు హాజరుపర్చటంలో ఫెయిల్ అయితే కోర్టులు సంబంధిత పోలీసు అధికారుల నుంచి నివేదిక కోరాలి.
- నిందితుల హాజరు.. సాక్ష్యుల విచారణకు సంబంధించి కోర్టులు వీడియో కాన్ఫరెన్స్ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలి.
- పెండింగ్ లో ఉన్న ఈడీ.. సీబీఐ కేసుల పర్యవేక్షనను సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి లేదంటే హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలో పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేయాలి.
- ఎంపీలు.. ఎమ్మెల్యేలపై 121 సీబీఐ కేసులు ఉన్నాయి. వాటిల్లో 51 మంది ఎమ్మెల్యేలు.. 112 మంది ఎంపీలు నిందితులుగా ఉన్నారు. వీటిల్లో 58 కేసుల్లో జీవిత ఖైదు పడటానికి వీలున్న కేసులు కావటం గమనార్హం. ఎంపీలకు వ్యతిరేకంగా 51 ఈడీ కేసులు.. ఎమ్మెల్యే.. ఎమ్మెల్సీలపై 71 మనీ లాండరింగ్ కేసులు పెండింగ్ లో ఉన్నాయి. తాజా నివేదిక నేపథ్యంలో సుప్రీం కోర్టు ఈ సూచనల్ని వెంటనే అమలు చేయాలని ఆదేశిస్తే.. ప్రజాప్రతినిధులకు కొత్త చిక్కులు తప్పవన్న మాట వినిపిస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.