Begin typing your search above and press return to search.

అమిత్ షా.. రాహుల్ ఒక‌రికొక‌రు ఎదురుప‌డితే?

By:  Tupaki Desk   |   13 March 2018 4:42 AM GMT
అమిత్ షా.. రాహుల్ ఒక‌రికొక‌రు ఎదురుప‌డితే?
X
సైద్ధాంతిక విభేదాలు వేరు. వ్య‌క్తిగ‌త విభేధాలు వేరు. రాజ‌కీయాల్లో ఒక‌రిపైఒక‌రు తీవ్ర‌స్థాయిలో ఆరోప‌ణ‌లు చేసినా..వ్య‌క్తిగ‌తంగా సంబంధాలు మాత్రం బాగానే ఉంటాయి. పార్ల‌మెంటు కానీ అసెంబ్లీ కానీ అధికార‌.. విప‌క్షాల మ‌ధ్య హోరీహోరీగా వాగ్వాదం చోటు చేసుకున్నా..అసెంబ్లీ బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌ర్వాత కులాసాగా క‌బుర్లు చెప్పుకోవ‌టం చాలాచోట్ల క‌నిపించేదే. కానీ.. ఇటీవ‌ల మారిన రాజ‌కీయంలో నేత‌ల మ‌ధ్య విభేదాలు సైద్ధాంతికం నుంచి వ్య‌క్తిగ‌తానికి చేరుకుంటున్నాయి.

దీంతో.. స‌భ‌లో ఏ తీరులో అయితే క‌త్తులు దూసుకుంటున్నారో.. స‌భ బ‌య‌ట కూడా ఆ శ‌త్రుత్వాన్ని కొన‌సాగిస్తున్న తీరు స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ఎక్క‌డిదాకానోఎందుకు బీజేపీ కురువృద్ధుడు ఎల్ కే అద్వానీ సంగ‌తే తీసుకోండి. ఆయ‌న‌కు.. కాంగ్రెస్ పార్టీకి అధినేత్రిగా వ్య‌వ‌హ‌రించి..ఈ మ‌ధ్య‌నే రిటైర్ అయిన సోనియాగాంధీని తీసుకోండి. ఇరువురి మ‌ధ్య రాజ‌కీయ శ‌త్రుత్వం ఉన్న‌ప్ప‌టికీ.. ఒక‌రికొక‌రు ఇచ్చుకునే మ‌ర్యాద చాలా ఎక్కువ‌గా ఉంటుంది. ఇరువురి మ‌ధ్య గౌర‌వ‌ప్ర‌ద‌మైన భావ‌న ఉంది.

కానీ.. మారిన కాలానికి త‌గ్గ‌ట్లు మార్పులు చోటు చేసుకుంటున్నాయి. గతానికి భిన్నంగా ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇందుకు తాజాగా చోటు చేసుకున్న ఉదంత‌మే నిద‌ర్శ‌నం. బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా.. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీలు పార్ల‌మెంటులో ఎదురెదురు ప‌డ్డారు. అయితే.. ఈ సంద‌ర్భంగా వీరిద్ద‌రూ ఒక‌రికొక‌రు తెలీన‌ట్లుగా ప్ర‌వ‌ర్తించారు. చూడ‌న‌ట్లే ఇద్ద‌రు త‌మ దారిన వెళ్లిపోయారు. అత్య‌న్నుత స్థాయిలో ఉండే నాయ‌కుల మ‌ధ్య‌నే ఇలాంటి ప‌రిస్థితి ఉంటే.. కిందిస్థాయిలో మ‌రెంత శ‌త్రుత్వం న‌డుస్తుందో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు.

ఇద్ద‌రు కీల‌క నేత‌లు ఎదురెదురు ప‌డిన‌ప్పుడు మాట వ‌ర‌స‌కు విష్ చేసుకోవ‌టం.. ప‌లుక‌రించుకోవ‌టం.. గౌర‌వ‌ప్ర‌దంగా మాట్లాడుకోవ‌టం క‌నిపిస్తుంది. ఇందుకు భిన్నంగా ముఖం చూడ‌టానికి సైతం ఇష్టం లేన‌ట్లుగా వెళ్ల‌టం చూస్తే.. రాజ‌కీయాల్లో మ‌ర్యాద అంత‌కంత‌కూ త‌గ్గిపోతుంద‌న్న భావ‌న క‌ల‌గ‌టం ఖాయం. సోమ‌వారం పార్ల‌మెంటు స‌మావేశాల సంద‌ర్భంగా బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా పార్ల‌మెంటుకు చేరుకున్నారు. అదే స‌మ‌యంలో కాంగ్రెస్ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ గేట్ నెంబ‌రు 4 నుంచి బ‌య‌ట‌కు వ‌స్తున్నారు.

ఈ సంద‌ర్భంగా ఇరువురు ఎదురెదురు ప‌డ్డారు. అయితే.. ఒక‌రికొక‌రు తెలీన‌ట్లుగా ఎవ‌రి దారిలో వారు వెళ్లిపోయారు. రాహుల్ ముఖం ప‌క్క‌కు తిప్పుకొని ముందుకు వెళ్లిపోతే.. అమిత్ షా సైతం రాహుల్ ఎవ‌రో త‌న‌కు తెలీన‌ట్లు వెళ్లిపోయారు. గాంధీల‌తో త‌న‌కు సంబంధాలు లేవ‌ని 2016లోనే అమిత్ షా చెప్పారు. తాజాగా నిర్వ‌హించిన ఇండియా టుడే కాంక్లేవ్ లోనూ ఈ త‌ర‌హాలోనే మాట చెప్పారు. తాను చెప్పిన మాట నిజ‌మ‌న్న‌ట్లుగా చేత‌ల్లో అమిత్ షా చూపించార‌ని చెప్పాలి. అందుకు త‌గ్గ‌ట్లే రాహుల్ సైతం వ్య‌వ‌హ‌రించార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.