Begin typing your search above and press return to search.

బాబును లెక్కలతో ఇరుకునపెట్టిన అమిత్ షా

By:  Tupaki Desk   |   28 May 2018 10:01 AM GMT
బాబును లెక్కలతో ఇరుకునపెట్టిన అమిత్ షా
X
టీడీపీ-బీజేపీ నాలుగేళ్ల సంసారం ఈ మధ్య తెగతెంపులయ్యింది. అప్పటినుంచి చంద్రబాబు బీజేపీ పెద్దలపై విరుచుకుపడుతూనే ఉన్నాడు. ఏపీకి అన్యాయం చేశారంటూ దుమ్మెత్తిపోస్తున్నాడు. అయితే ఇప్పటివరకు చంద్రబాబుపై మోడీ కానీ - అమిత్ షా కానీ తీవ్ర విమర్శలకు దిగలేదు..మహానాడు వేదికగా చంద్రబాబు అమిత్ షాపై నిప్పులు చెరగడంతో ఎట్టకేలకు అమిత్ షా ఢిల్లీలో విలేకరుల సమావేశం నిర్వహించి బాబు బండారాన్ని బయటపెట్టాడు..

చంద్రబాబు మహానాడులో మాట్లాడుతూ.. ‘ఏపీ ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకునేందుకు అసలు అమిత్ షా ఎవరన్నారు. ఇలా మరోసారి జోక్యం చేసుకుంటే ఊరుకునేది లేదని’ వార్నింగ్ ఇచ్చాడు. ఈ విమర్శలపై ఎట్టకేలకు అమిత్ షా స్పందించారు..

అమిత్ షా మాట్లాడుతూ.. రాజధాని నిర్మాణానికి నిధులు ఇవ్వడం లేదంటూ చంద్రబాబు చేస్తున్న ఆరోపణలను ఖండించారు. రాజధాని నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకూ 2100 కోట్ల రూపాయల నిధులను ఇచ్చిందని అమిత్ షా తెలిపారు. కానీ చంద్రబాబు ప్రభుత్వం వాటిని రాజధాని నిర్మాణం కోసం ఖర్చు చేయలేదని.. అసలు ఆ నిధులు ఏం చేశారో లెక్కలు చెప్పడం లేదని ఆరోపించారు. ఇచ్చిన నిధులకు లెక్కలు చెప్పకపోతే ఏ ప్రభుత్వమైనా ఏం చేస్తుందని అమిత్ షా ప్రశ్నించారు.

ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం కోసం తాము వేల కోట్ల రూపాయల నిధులు ఇచ్చినా ప్రభుత్వం ఒక్కటంటే ఒక్క భవనానికి కూడా ఇప్పటివరకు టెండర్ పిలవకపోవడం ఏమిటని అమిత్ షా తప్పుపట్టారు. చంద్రబాబు పలు సార్లు రాజధాని నిర్మాణం కోసమంటూ తయారు చేయించిన డిజైన్లన్నీ నేటికి సింగపూర్ దగ్గరే ఉన్నాయన్న విషయం గమనించాలని అమిత్ షా అన్నారు. ఇచ్చిన నిధులకు లెక్కలు చెప్పకుండా కేంద్ర ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదని హితవు పలికారు. వచ్చే ఎన్నికల్లో ఏపీలో బీజేపీ ఒంటరిగానే పోటీచేస్తుందని అమిత్ షా స్పష్టం చేశారు. తాము ఏపీలో ఏ పార్టీతో పొత్తు పెట్టుకోమని అమిత్ షా తేల్చేశారు.