Begin typing your search above and press return to search.

అమిత్‌ షా రాక‌స‌రే...బీజేపీ ఏం చేయ‌నుంది?

By:  Tupaki Desk   |   15 Sep 2018 6:58 AM GMT
అమిత్‌ షా రాక‌స‌రే...బీజేపీ ఏం చేయ‌నుంది?
X
తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల హీట్ నేటి నుంచి మ‌రింత ముద‌ర‌బోతోంది. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా ముంద‌స్తు ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని మొద‌లుపెట్టేందుకు శ‌నివారం హైదరాబాద్ రానున్నారు. ఒక‌రోజంతా తెలంగాణ రాష్ట్రంలోనే గ‌డ‌ప‌నున్న బీజేపీ అధ్య‌క్షుడు సమరశంఖారావాన్ని పూరించ‌నున్నారు. అమిత్ షా శనివారం ఉదయం 11.30 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి ప్రత్యేక విమానంలో చేరుకుంటారు. అక్కడి నుండి పార్టీ కార్యాలయానికి చేరుకొని మీడియాతో మాట్లాడతారు. మధ్యాహ్న భోజనం అనంతరం ఆయన లాల్ దర్వాజాలోని అమ్మవారి ఆలయాన్ని దర్శనం చేసుకుంటారు. అక్కడి నుండి నేరుగా మహబూబ్‌ నగర్ ఎంవీఎస్ కాలేజీ గ్రౌండ్స్‌ కు చేరుకుంటారు. అక్కడే ఎన్నికల ప్రచారం మొదలవుతుంది. సాయంత్రం ఐదు గంటల వరకూ బహిరంగ సభ లో పాల్గొని, అక్కడి నుండి షాద్‌ నగర్ మండలం కొత్తూరు చేరుకుంటారు. సాయంత్రం 6.30 గంటలకు పార్టీ పదాధికారులు - జిల్లా అధ్యక్షులు - జిల్లాల ఇన్‌ ఛార్జిలతోపాటు - శక్తి సంఘాలతో భేటీ అవుతారు. అక్కడి నుండి శంషాబాద్‌ కు అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకొని ఢిల్లీకి వెళతారు.

లాల్ దర్వాజ అమ్మవారిని దర్శించుకున్న తర్వాత అమిత్ షా ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడతారు. ఈ నెలాఖరుకు మరో మారు ఆయన రాష్ట్రానికి వస్తారు. కరీంనగర్‌ లో నిర్వహించే బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. కాగా, తమ పార్టీ జాతీయ అధ్యక్షుడి పర్యటన రాజకీయ ప్రకంపనలు సృష్టించనున్నాయ‌ని ఆ పార్టీ రాష్ట్ర నేత‌లు - నాయకులు - కార్యకర్తలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే, అమిత్ షా స‌త్తా ఎంత‌మేర‌కు ప్ర‌భావం చూపుతుంద‌నేది రాజ‌కీయ వ‌ర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇప్ప‌టికే టీఆర్ ఎస్‌-బీజేపీల మ‌ధ్య స‌ఖ్య‌త ఉంద‌న్న అభిప్రాయం బ‌ల‌ప‌డింద‌ని - ముంద‌స్తు ప‌రిణామాలు..ఎన్నిక‌ల షెడ్యూల్‌ ను ప్ర‌క్రియ‌ను సైతం కేసీఆర్ సూత్రప్రాయంగా వెల్ల‌డించ‌డం ఇందుకు నిద‌ర్శ‌న‌మంటున్నారు. ఈ క్ర‌మంలో అమిత్ చేసే విమ‌ర్శ‌ల‌ను ప్ర‌జ‌లు ఎలా స్వీక‌రిస్తార‌నేది ఆస‌క్తిక‌రమేన‌ని ప‌లువురు వ్యాఖ్యానిస్తున్నారు.

అయితే, అమిత్‌ షా పర్యటనపై బీజేపీ శ్రేణులు గంపెడాశ‌లు పెట్టుకున్నారు. ఈ టూర్‌ తో రాజకీయ పార్టీల్లో ప్రకంపనలు మొదలవుతాయ‌ని బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు డాక్టర్ కే.లక్ష్మణ్ చెప్పారు. తెలంగాణలో బీజేపీకి ఉజ్వల భవిష్యత్ ఉందని, తమ సత్తా ఏమిటో రాబోయే రోజుల్లో చూపిస్తామని ఆయన ధీమా వ్య‌క్తం చేశారు. రాబోయే రోజుల్లో బీజేపీ అసెంబ్లీల వారీ సభలు నిర్వహిస్తుందని పేర్కొన్నారు. 119 అసెంబ్లీలకు బీజేపీ అభ్యర్ధులు పోటీ చేస్తారని, ఎన్నికల షెడ్యూలు జారీ అయిన తర్వాతనే అభ్యర్థుల ఎంపిక జరుగుతుందని ఒక ప్రశ్నకు బదులుగా చెప్పారు. టీఆర్ఎస్, టీడీపీ, కాంగ్రెస్‌ల నుండి చాలా మంది నేతలు టచ్‌ లో ఉన్నారని వెల్ల‌డించారు. ఈ ఎన్నిక‌ల్లో టీఆర్ ఎస్ అవినీతి పాలనకు విముక్తి కల్పించి బీజేపీకి అవకాశం కల్పించాలని కోరుతున్నామని అన్నారు. బీజేపీ ధీమా ఎంత‌మేర‌కు నిజం అవుతుందో తేలాలంటే మ‌రికొద్దిరోజులు ఆగాల్సిందే.