Begin typing your search above and press return to search.

బాస్ అమిత్ షా చాలా డేంజ‌ర్

By:  Tupaki Desk   |   16 March 2016 2:21 PM GMT
బాస్ అమిత్ షా చాలా డేంజ‌ర్
X
అమిత్ షా...దేశ రాజ‌కీయాలతో ప‌రిచ‌యం ఉన్న వారికి ఈ వ్య‌క్తి గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ తెర ముందు ఉంటే...ఈయ‌న తెర‌వెనుక ఉంటారు. అంతే తేడా!అయితే షా అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మైన వ్య‌క్తి అని తేల్చేశారు ప్రసిద్ధ చరిత్రకారుడు - రచయిత రామచంద్రగుహ. ఢిల్లీలో జరుగుతున్న ఐదురోజుల సాహితీ ఉత్సవంలో ఆయన ప్రసంగిస్తూ హిందూ మ‌తంపై, అమిత్ షాతో స‌హా మ‌రికొంద‌రిపై తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు.

ఇస్లామిక్ ఉగ్రవాదం అన్నది ప్రపంచానికి ముప్పు కలిగిస్తుందనడంలో సందేహం లేదని గుహా చెప్పారు. అయితే ఇస్లామిక్ ఉగ్రవాదం కంటే హిందూ ఛాందస వాదం వల్లనే దేశానికి ఎక్కువ ప్రమాదం ఉందని ఆయ‌న తేల్చేశారు. ఎందుకంటే దేశంలో 85 శాతం మంది హిందువులు ఉన్నారనీ, అందుకే హిందూ మ‌త‌స్తులు మెజారిటీ అనే భావ‌న భ‌యం క‌ల్పిస్తున్నదని గుహా విశ్లేషించారు. దేశంలో హిందూ జాతీయతా భావం పెచ్చరిల్లడం కొత్త విషయమేమీ కాదని అన్నారు. దేశ విభజన తరువాత, రామజన్మభూమి ఆందోళన సమయంలో ఈ పరిస్థితి తలెత్తిందని పేర్కొన్నారు. ఆ రెండు సార్లూ కూడా దీని వెనుక రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ ఎస్ ఎస్) వ్యూహం ఉందని రామచంద్రగుహ అన్నారు. దీని వల్ల దేశంలో లౌకిక - సాంస్కృతిక - రాజకీయ వ్యవస్థలు ప్రభావితమయ్యాయని పేర్కొన్నారు. ఈ పరిస్థితి విస్తరించదని తాను ఆశిస్తున్నానన్నారు. అయితే ప్రస్తుతం హిందూ ఛాందస వాదం అన్నది కొన్ని రాష్ట్రాలకే పరిమితమై ఉందన్నారు. హిందూ చాందసవాదం ప్రభావం కర్నాటక - పశ్చిమ బెంగాల్ - మహారాష్ట్ర వంటి రాష్ట్రాలపై పడలేదన్నారు. అయితే ఉత్తరప్రదేశ్ లో మాత్రం ఇది ఆందోళనకర స్థాయిలో ఉందని రామచంద్రగుహ చెప్పారు.

ఈ క్ర‌మంలో ఆయ‌న వ్య‌క్తుల గురించి విశ్లేషిస్తూ...దేశంలో అత్యంత ప్రమాదకరమైన రాజకీయనాయకులు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా - సమాజ్ వాదీ పార్టీ నాయకుడు - యూపీ మంత్రి అజాంఖాన్ అని వ్యాఖ్యానించారు. అజాంఖాన్ అంటే వీలైనంత త‌ర‌చుగా త‌న‌, ప‌ర అనే బేధం లేకుండా వివాదాలు రాజేస్తుంటారు. మ‌రి షాపై గుహ చూపెందుకు ప‌డిందో ఆయ‌న‌కే తెలియాలి.