Begin typing your search above and press return to search.

తంబికి చెమటల వెనుక అమిత్ షా ప్రతీకారం?

By:  Tupaki Desk   |   21 Aug 2019 8:27 AM GMT
తంబికి చెమటల వెనుక అమిత్ షా ప్రతీకారం?
X
పగ.. ప్రతీకారాలు రీల్ లో ఒకలా కనిపిస్తాయి. రియల్ లో మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తాయి. భారీ డైలాగులు ఉండవు.. పంచ్ మాటలు అస్సలే వినిపించవు. కామ్ గా జరగాల్సింది జరిగిపోతూ ఉంటాయి. మరీ లోతుగా కన్నేస్తే కానీ అసలు విషయాలు బయటకు రాని పరిస్థితి. ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో అరెస్ట్ ముప్పు ఎదుర్కొంటున్న మాజీ కేంద్రమంత్రి చిదంబరం ఇప్పుడు అండర్ గ్రౌండ్ లో ఉండటం తెలిసిందే.

ఒకప్పుడు దేశ రాజకీయాల్ని శాసించిన చిదంబరానికి ఇప్పుడు చెమటలు పడుతున్న చిత్రమైన పరిస్థితి. ఐదేళ్ల వ్యవధిలో పరిస్థితి ఎంతగా మారిపోయిందో చూస్తే ఆశ్చర్యం కలగక మానదు. ఒకప్పుడు తాను వ్యవహరించిన తీరే తాజాగా చిదంబరానికి చెమటలు పడేలా చేస్తోందన్న మాట వినిపిస్తోంది. ఇంతకీ ఐఎన్‌ఎక్స్‌ కేసులోకి వెళితే.. సదరు మీడియా సంస్థకు విదేశాల నుంచి రూ.305 కోట్ల నిధులు రావాల్సి ఉండగా.. దానికి చిదంబరం కేంద్ర ఆర్థికమంత్రిగా ఉన్నప్పుడు విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ద్వారా అనుమతులు జారీ చేశారు. ఈ భారీ మొత్తాన్ని దేశానికి రప్పించటం వెనుక అవకతవకలు ఉన్నట్లుగా చెబుతారు. ఇదే.. ఇప్పుడు చిదంబరాన్ని వణికిస్తోంది.

అయినా.. దేశంలో ఎన్నో అవకతవకలు.. కేసులు ఉన్నప్పుడు ఈ కేసే ఎందుకు హైలెట్ అవుతోందన్న విషయంలోకి వెళితే.. ఆసక్తికర అంశాలు తెర మీదకు వస్తాయి. కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు కేంద్ర ఆర్థిక మంత్రిగా.. హోం మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు చిదంబరం. అదే సమయంలో గుజరాత్ హోం మంత్రిగా ఉన్నారు అమిత్ షా. ఆయన పలు కేసుల్లో నిందితుడిగా పేర్కొంటూ అరెస్ట్ చేయించటమే కాదు.. జైల్లో వేయించారు. దీనికి సంబంధించి కీలకమైన సోహ్రాబుద్దీన్ ఎన్ కౌంటర్ లో షా హస్తం ఉందన్న మాటను బలంగా చెబుతుంటారు.

తాను జైలుకు వెళ్లటానికి కారణమైన చిదంబరాన్ని షా అంత తేలిగ్గా విడిచిపెట్టరన్న మాట ప్రచారంలో ఉంది. తనను అక్రమంగా జైలుపాలు కావటానికి కారణమైన చిదంబరాన్ని అదే రీతిలో జైలుకు పంపాలన్న విషయంలో షా చాలా కచ్ఛితంగా ఉన్న్లట్లు చెబుతారు. సోహ్రుబుద్దీన్ నకిలీ ఎన్ కౌంటర్ కేసులో అమిత్ షా మూడు నెలల పాటు జైల్లో ఉండి వచ్చారు. తర్వాత కాలంలో ఆయనకు కోర్టు బెయిల్ ఇవ్వటంతో బయటకు వచ్చారు. నాటి నుంచి చిదంబరాన్ని ఫిక్స్ చేయాలన్న పట్టుదలతో ఎన్నో ఏళ్ల నుంచి వెయిట్ చేసిన సీన్ ఇప్పుడు తన ముందుకు రావటంతో తమిళ తంబిని అరెస్ట్ చేయాలన్న ఆలోచనలో షా ఉన్నట్లు చెబుతారు. మరి.. ఆయన మనసులో ఏముందన్నది చిదంబరానికి ఎదురయ్యే పరిణామాలతో ఇట్టే అర్థమవుతుందని చెప్పక తప్పదు.