Begin typing your search above and press return to search.

హిందీ రుద్దుతారా? తప్పా.? ఒప్పా.?

By:  Tupaki Desk   |   15 Sep 2019 8:05 AM GMT
హిందీ రుద్దుతారా? తప్పా.? ఒప్పా.?
X
ఒక దేశం.. ఒకే ఎన్నికలు.. ఇప్పుడు ఈ నినాదంతోనే కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం జమిలి ఎన్నికలకు వెళుతోంది. తద్వారా ప్రాంతీయ పార్టీలను కబళించే కుట్ర జరుగుతోందన్న విమర్శలు ఉన్నాయి. ఈ పరిణామం దక్షిణాదిలో ప్రబలంగా ఉన్న ప్రాంతీయ పార్టీలకు శరాఘాతంగా మారింది. అయితే కేంద్రంలో అఖండ మెజార్టీ ఉన్న బీజేపీ ఎదురించే స్థితిలో ప్రాంతీయ పార్టీలు లేవు..

సరే జమిలి ఎన్నికలు భరించాలి తప్పదు.. ఇప్పుడు ‘ఒకే దేశం.. ఒకటే భాష’.. మరో కొత్త ప్రతిపాదనను బీజేపీ అధ్యక్షుడు , హోంమంత్రి అమిత్ షాకు ముందుకు తీసుకొచ్చారు. ఉత్తరాది వారైన అమిత్ షా తమ భాష అయిన హిందీని జాతీయ భాషగా చేయాలని తపన పడడం తప్పులేదు. కానీ భిన్నత్వంలో ఏకత్వం లాంటి చాలా భాషలున్న భారత్ లో అలా హిందీని నెత్తిన పెట్టుకోవడం.. రుద్దడం ఇప్పుడు దుమారం రేపుతోంది. హిందీని జాతీయ భాషగా చేసి అందరూ మాట్లాడేలా చేస్తామన్న అమిత్ షా ప్రకటనపై ఇతర భాషల వారు.. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రల వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

భారత దేశం అంటేనే భిన్నత్వంలో ఏకత్వం.. భారత రాజ్యాంగంలోని 29వ అధికరణం దేశంలోని ప్రతి మనిషీ తనకు నచ్చిన భాషను ఎంచుకునే హక్కును రాజ్యాంగం కల్పిస్తుంది. బహుళత్వమే భారత బలం.. ఇప్పుడు కేంద్రంలో భారీ మెజారిటీ ఉందని అమిత్ షా హిందీని బలవంతంగా రుద్దే ప్రయత్నం చేయడంపై తమిళనాడు, కేరళ, కర్ణాటక, తెలుగు, బెంగాలీ, అస్సామీ రాష్ట్రాల రాజకీయ నేతలు, ప్రముఖుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తమను కాని మాతృభాషను తమపై రుద్దడం కరెక్ట్ కాదంటున్నారు..

నిజానికి ద్రవిడ భాషల నుంచే దేశంలో సంస్కృతం, హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మళయాలం పుట్టాయంటారు. అంటే ఇందులో అన్నింటికి ద్రవిడ భాష, సంస్కృతమే మూలం.. అలాంటి భాషల్లో ఒకటి తక్కువ.. వేరొకటి ఎక్కువ కాదు.. కానీ మెజార్టీ మాట్లాడుతున్నారని.. అధికారంలో ఉత్తరాది వారు ఉన్నారని ప్రాంతీయ భాషలపై హిందీని రుద్దే ప్రయత్నాలను అందరూ వ్యతిరేకిస్తున్నారు.

నిజానికి దక్షిణాదిలో హిందీ మాట్లాడేవారి సంఖ్య కేవలం 2శాతం మాత్రమే. హైదరాబాద్ లాంటి చోట తప్పితే ఎక్కడ జనాలు హిందీని విస్తృతంగా మాట్లాడరు. అలాంటి దక్షిణాదిపై ఇప్పుడు హిందీ రుద్దుతామనడంపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.

కేంద్రంలో బీజేపీ గెలిచిందే జాతీయ వాదంపైనే.. ఇప్పుడు కమలం పార్టీకి అదే బలం.. బలగం.. హిందీ, హిందూ, హిందుత్వంతో ముందుకెళ్తున్న బీజేపీకి భారతీయతే చాలా పెద్దది. అది గుర్తించి హిందీని రుద్దడం ఆపాలన్న డిమాండ్లు ఇతర భాషాభిమానుల నుంచి వ్యక్తమవుతున్నాయి.

భాషాభిమానం గొప్పదే. హిందీ జనాలకు వారి భాషపై ప్రేమ అభిమానం ఉండడం మంచిదే. కానీ దక్షిణాది వారికి కూడా వారి భాషపై ప్రేమ, అభిమానం ఉంటుంది. గ్లోబల్ భాష ఇంగ్లీష్ ను నేర్చుకోవడం తప్పనిసరి.. కానీ దేశీయ భాష హిందీని దక్షిణాది మాతృభాషలపై రుద్దడం మాత్రం కరెక్ట్ కాదంటూ అందరూ ముక్తకంఠంతో నినదిస్తున్నారు. మరి బీజేపీ, అమిత్ షా లాంటి పెద్దలు హిందీని రుద్దే ప్రయత్నాలకు ఇకనైనా స్వస్తి పలికితే మంచిదంటున్నారు.