Begin typing your search above and press return to search.

ఉద్రిక్తతలపై కేంద్రం చర్యలు.. కేజ్రీవాల్ తో అమిత్ షా వ్యూహం

By:  Tupaki Desk   |   25 Feb 2020 9:15 AM GMT
ఉద్రిక్తతలపై కేంద్రం చర్యలు.. కేజ్రీవాల్ తో అమిత్ షా వ్యూహం
X
ఈశాన్య ఢిల్లీలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. మూకదాడులు చోటుచేసుకోవడంతో ఏకంగా ఏడు మంది మృతి చెందడంతో కేంద్ర ప్రభుత్వం స్పందిచినట్టు తెలుస్తోంది. పౌరసత్వ సవరణ చట్టం తీసుకువచ్చినప్పటి నుంచి దేశంలో అల్లర్లు, హింసాత్మక సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అనుకూలంగా కొందరు, వ్యతిరేకంగా కొందరు చేస్తున్న నిరసనలతో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడుతున్నాయి. తాజాగా ఈశాన్య ఢిల్లీలో ఇప్పటికే హెడ్ కానిస్టేబుల్ సహా ఆరుగురు చని పోగా 50 మంది వరకు గాయ పడ్డారు. ఇరువర్గాలు దాడులతో 400 మీటర్ల వరకు రాళ్లు, ఇటుకలు, గాజు ముక్కలతో ఢిల్లీలోని జాఫ్రాబాద్, మౌజ్‌పూర్‌లో రహదారి నిండిపోయింది. మరోవైపు బ్రహ్మ్‌పుర్, మూజ్‌పుర్ వద్ద మంగళవారం ఉదయం కూడా అల్లరిమూకలు దాడులకు పాల్పడ్డాయి. భద్రతా సిబ్బంది కవాతు సందర్భంగా ఆ దుండగులు దాడులకు పాల్పడడంతో మరోసారి పరిస్థితి ఉద్రిక్తం గా మారింది.

అయితే దీనిపై కేంద్రం ఫోకస్ పెట్టిందని తెలుస్తోంది. ఈశాన్య ఢిల్లీలో పరిస్థితికి సంబంధించి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆందోళన వ్యక్తం చేశారు. స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఆందోళనకారులు శాంతించాలని కోరారు. ఈ మేరకు శాంతి భద్రతలపై సమీక్ష చేశారు. ఈశాన్య ఢిల్లీలో పరిస్థితిపై సీఎం అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం తమ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. ఢిల్లీలో పరిస్థితిపై చర్చించేందుకు వారిని పిలిచారు. ఆందోళనకారులు శాంతియుతంగా ఉండాలని, వారి సమస్య పై చర్చించేందుకు సిద్ధమని ప్రకటించారు.

ఈ ఆందోళనల నేపథ్యంలో జాఫ్రాబద్, మౌజ్‌పూర్-బాబర్‌పూర్, గోకుల్‌పురి, జాహ్రీ, శివ్ విహార్ మెట్రో స్టేషన్లను మూసివేశారు. ఢిల్లీలో ఉద్రిక్త పరిస్థితులపై సోమవారం రాత్రి సమీక్షించిన హోంమంత్రి అమిత్ షా నేడు మంగళవారం లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌తో నార్త్ బ్లాక్‌లో సమావేశం కానున్నట్లు సమాచారం. సమావేశంలో రాజకీయ పార్టీలకు చెందిన ప్రతినిధులు కూడా పాల్గొనే అవకాశం ఉంది.