Begin typing your search above and press return to search.

బీజేపీ - ఆర్ ఎస్ ఎస్‌ లో ఉగ్ర‌వాదులు

By:  Tupaki Desk   |   10 Jan 2018 3:49 PM GMT
బీజేపీ - ఆర్ ఎస్ ఎస్‌ లో ఉగ్ర‌వాదులు
X
పొరుగున ఉన్న క‌ర్ణాట‌క‌లో ఎన్నిక‌ల వేడి జోరందుకుంది. అగ్ర నాయ‌కుల విమ‌ర్శ‌లు - ప్ర‌తి విమ‌ర్శ‌లతో క‌న్న‌డ రాజ‌కీయం కాక‌మీదుంది. తాజాగా బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా - కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య పరస్పరం ఘాటు విమ‌ర్శ‌లు చేసుకున్నారు. ఏకంగా ఉగ్ర‌వాదుల ప్ర‌స్తావ‌న‌కు రావ‌డం గ‌మ‌నార్హం. తాజాగా జ‌రిగిన బ‌హిరంగ స‌భ‌లో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య మరోసారి హిందూత్వ సంస్థలపై మరోసారి మండిపడ్డారు. దీనికి అమిత్ షా కౌంట‌ర్ ఇచ్చారు.

కర్ణాటక ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతోందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. హిందూ మతానికి ఈ ప్రభుత్వం(కాంగ్రెస్) వ్యతిరేకంగా ఉందన్నారు. సీఎం సిద్ధరామయ్య ప్రభుత్వం.. భారత వ్యతిరేక పార్టీ అయిన ఎస్‌ డీపీఐ(సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా)పై ఉన్న కేసులను ఉపసంహరించుకోవడం సరికాదన్నారు. ఐదేళ్ల కాంగ్రెస్ పాలనలో కర్ణాటక ప్రజలకు సిద్ధరామయ్య చేసిందేమి లేదని అమిత్ షా స్పష్టం చేశారు. కేంద్రం ఇస్తున్న నిధులను ఎక్కడ ఖర్చు పెడుతున్నారని ప్రశ్నించారు. కర్ణాటకకు యూపీఏ హయాంలో 13వ ఆర్థిక సంఘం కింద రూ. 88,583 కోట్లు కేటాయిస్తే.. తమ ప్రభుత్వ హయాంలో 14 ఆర్థిక సంఘం నిధుల కింద రూ. 2 లక్షల 19 వేల కోట్లు కేటాయించామని అమిత్ షా గుర్తు చేశారు.

దీనికి వెంట‌నే సీఎం సిద్ధ‌రామ‌య్య స్పందించారు. బీజేపీ - ఆర్ ఎస్ ఎస్‌ - భ‌జరంగ్‌ దళ్‌ లో ఉగ్రవాద శక్తులు ఉన్నాయని ఆరోపించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని ఆయన తేల్చిచెప్పారు. అతివాద ఎస్డీపీఐ అయినా - భ‌జరంగ్‌ దళ్‌ అయినా శాంతిని భగ్నం చేస్తే విడిచిపెట్టబోమని హెచ్చరించారు.

కాగా, రెండు రోజుల క్రితం ట్విట్ట‌ర్ వేదిక‌గా కర్ణాటక - ఉత్తర్‌ ప్రదేశ్ ముఖ్యమంత్రులు సిద్దరామయ్య - యోగి ఆదిత్యనాథ్ ట్విట్టర్ వేదికగా పరస్పరం చేసుకున్న విమర్శలు ప్రస్తుతం ఇంటర్నెట్‌ లో వైరల్ అయిన సంగ‌తి తెలిసిందే. అభివృద్ధి - పరిపాలనపై బీజేపీ కర్ణాటక శాఖ ఆదివారం నిర్వహించిన ఒక సభలో పాల్గొనేందుకు ఆదిత్యనాథ్ బెంగళూరు వచ్చారు. ఈ సందర్భంగా సిద్దరామయ్య ట్విట్టర్‌ లో స్పందిస్తూ `యూపీ సీఎం ఆదిత్యనాథ్‌ కు స్వాగతం పలుకుతున్నాను. మా నుండి మీరు నేర్చుకోవలసింది ఎంతో ఉంది సర్. ఇందిరా క్యాంటీన్‌ ను - ఏదైనా ఒక రేషన్ షాపును తప్పకుండా సందర్శించండి. మీ రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న ఆకలిచావుల సమస్యను పరిష్కరించడానికి దోహదపడుతుంది` అని పేర్కొన్నారు. దీనికి యోగి ఆదిత్యనాథ్ కూడా దీటుగా సమాధానమిచ్చారు. `సిద్దరామయ్యాజీ మీ స్వాగతానికి ధన్యవాదాలు. మీ హయాంలోనే కర్ణాటకలో రైతుల ఆత్మహత్యలు ఎక్కువ జరుగుతున్నాయని విన్నాను. ఇక నిజాయితీగల అధికారుల చావులు - బదిలీల గురించి చెప్పవలసిన అవసరమే లేదు. యూపీలో మీ మిత్రపక్షాలు సృష్టించిన కష్టాలు - దుర్నీతిని తొలిగించడానికి ప్రయత్నిస్తున్నాను` అంటూ ట్వీట్ చేశారు.

బెంగళూరులో జరిగిన బహిరంగ సభలో యోగి మాట్లాడుతూ, `హిందువుగా ఉంటూ ఆయన (సిద్దరామయ్య) గొడ్డు మాంసం తినాలని ఇతరులను ప్రోత్సహించకూడదు. కర్ణాటకలో బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు గో హత్యను నిషేధిస్తూ చట్టం చేసింది. కాంగ్రెస్ వచ్చి ఆ చట్టాన్ని రద్దు చేసింది?` అన్నారు. ఈ వ్యాఖ్యలను తిప్పికొట్టేందుకు కర్ణాటక సీఎం మరోసారి ట్విట్టర్‌ లో స్పందించారు. `మేం ఏమి తినాలో చెప్పడానికి మీరెవరు? ఎంతోమంది హిందువులు గొడ్డుమాంసం తింటారు. అభ్యంతరపెట్టడానికి వీరెవరు? నాథూరాం గాడ్సే సూత్రీకరించిన హిందూమతాన్ని కాకుండా స్వామి వివేకానంద నిర్వచించిన హిందూ మతాన్ని నేను అనుసరిస్తాను` అని ట్వీట్ చేశారు.