Begin typing your search above and press return to search.

తెదేపా నోరెత్తితే.. ఎదురుదాడికి కమలం సిద్ధం!

By:  Tupaki Desk   |   2 Feb 2018 4:04 AM GMT
తెదేపా నోరెత్తితే.. ఎదురుదాడికి కమలం సిద్ధం!
X
చంద్రబాబునాయుడు అసంతృప్తిని వ్యక్తం చేశారు సరే.. బడ్జెట్ లో రిక్త హస్తం చూపించినందుకు ఎందుకని కేంద్రం వైఖరిని తప్పుపట్టలేదు. వైకాపా ఎంపీలు కూడా అన్యాయం జరిగిందని ఎడాపెడా అనేస్తున్నారు. మరి ప్రభుత్వంలో తాము భాగస్వాములే అయి ఉండగా.. తమ రాష్ట్రానికి ఏమీ దక్కకపోవడం గురించి చంద్రబాబు ఎందుకు రైట్ వేలో స్పందించలేకపోతున్నారు? ఇలాంటి సందేహాలు ఎవరికైనా వస్తాయి. అయితే విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తున్న సమాచారాన్ని బట్టి.. తమ పార్టీ నాయకులు ఎవరికి తోచినట్లు వారు మాట్లాడినా సరే.. చంద్రబాబు ఇప్పటికీ తానుమాత్రం ఆచితూచి మాట్లాడే ఉద్దేశంతోనే ఉన్నారుట. భాజపా నుంచి ఆయన వేగుల ద్వారా ఆయనకు అందిన సంకేతాల్ని బట్టి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారుట.

బడ్జెట్ లో కేటాయింపులు లేవని - కేంద్రం అన్యాయం చేసిందని చంద్రబాబు కోపంగా అనే సీన్ మనం చూడలేకపోవచ్చు. అలా చెబితే ఆయననే ఇరుకున పెట్టేలా కౌంటర్లు తప్పవని, భాజపా నేతలు ఎదురుదాడికి సిద్ధంగా ఉన్నారని, అందుకు తగిన అస్త్రాలు కూడా వారి వద్ద పుష్కలంగా ఉన్నాయని.. ఆ ఇబ్బంది రాకుండా ఉండాలంటే.. మినిమం మాట్లాడాలని.. చంద్రబాబు పర్సనల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఆయనను హెచ్చరించిందని గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిధులు అనుకున్నట్లుగా, అవసరానికి తగినట్లుగా రాకపోవడానికి కారణం మొత్తం చంద్రబాబునాయుడే అని తీర్మానించేలా.. ప్రజలందరూ కూడా నమ్మేలాగా.. భాజపా నాయకులకు అమిత్ షా స్పెషల్ కోచింగ్ ఇచ్చి పంపినట్లుగా తెలుస్తోంది. పార్టీ నాయకులతో అమిత్ షా గురువారం నాడు భేటీ నిర్వహించిన సంగతి తెలిసిందే. బడ్జెట్ అసంతృప్తుల గురించి భయాలు అనవసరం అని.. పార్టీని విస్తరించడం గురించే దృష్టి పెట్టాలని.. అమిత్ తనదైన కార్యచరణ ప్రణాళికను వారికి నూరిపోశారుట. తెదేపానుంచి బడ్జెట్ పై విమర్శలు వస్తే ఎలా ఎదుర్కోవాలో చెప్పారుట.

పోలవరం పనుల నిర్వహణ విషయంలో చంద్రబాబు అవినీతిపై అనేక ఫిర్యాదులు కేంద్రం వద్ద ఉన్నాయని, అమరావతి నిర్మాణాలకు సంబంధించి... ఒక్కటంటే ఒక్క డీపీఆర్ తో కూడిన ప్రతిపాదన కూడా ఢిల్లీకి రాలేదని.. అలాంటప్పుడు నిధుల కేటాయింపు ఎలా జరుగుతుందని.. రాష్ట్రప్రభుత్వ అవినీతి పరిపాలన - ఇచ్చే డబ్బులకు పద్ధతిగా లెక్కలు చెప్పే అలవాటు లేకపోవడం - అంచనాల్లో పెంపు వంటి రూపేణా స్వాహాలకు పాల్పడుతున్నారనే అనుమానాలు ఇత్యాది అంశాలను ప్రచారంలో పెట్టాలని.. ఆ రకంగా తెదేపా నేతల నోర్లకు తాళాలు వేయాలని షా సూచించినట్లుగా కమలదళంలోని చంద్రబాబునాయుడు వేగులు ఆయనకు సమాచారం అందించినట్లుగా తెలుస్తున్నది. ఆమేరకు చంద్రబాబు కూడా వ్యూహం మార్చుకుంటున్నారు. భాజపా కూడా ఎదురుదాడికి దిగితే ఉక్కిరి బిక్కిరికాక తప్పదనే భయంతో.. కొంత సైలెంట్ గా ఉన్నట్లు తెలుస్తోంది.