Begin typing your search above and press return to search.

ఇద్ద‌రు చంద్రుళ్ల‌ను సింఫుల్ గా తీసేసిన షా!

By:  Tupaki Desk   |   28 May 2018 4:22 AM GMT
ఇద్ద‌రు చంద్రుళ్ల‌ను సింఫుల్ గా తీసేసిన షా!
X
మామూలుగా చూస్తే చీపురు పుల్ల‌కు సీన్ ఉండ‌దు. సింఫుల్ గా విరిచి పారేయొచ్చు. కానీ.. గుప్పెడు చీపురు పుల్ల‌ల్ని క‌ట్ట‌గా చేసి.. విరిచే ప్ర‌య‌త్నం చేస్తే వ‌ర్క్ వుట్ కాదు. ఎంత బ‌ల‌వంతుడికైనా ఇబ్బందే. ఈ చిన్న విష‌యాన్ని అమిత్ షా మ‌ర్చిపోతున్న‌ట్లుగా ఆయ‌న మాట‌లు స్ప‌ష్టం చేస్తున్నాయి.

నిజ‌మే.. ప్రాంతీయ పార్టీలు జాతీయ స్థాయిలో ప్ర‌భావితం చేయ‌లేవు. కానీ.. ప్రాంతీయ పార్టీలు కొన్ని బ‌లంగా ఉంటే.. జాతీయ స్థాయిలో వాటి హ‌వా షురూ అవుతుంద‌న్న నిజాన్ని మ‌ర్చిపోకూడ‌దు. కానీ.. అమిత్ షా మైండ్ సెట్ ఏ మాత్రం నెగిటివ్ గా ఆలోచించేందుకు సిద్ధంగా లేద‌న్న‌ట్లు క‌నిపిస్తోంది. అంతా త‌మ‌కు అనుకూలంగానే ఆయ‌న ఆలోచ‌న‌లు ఉన్న‌ట్లుగా చెప్పాలి. తాజాగా ప్రాంతీయ ప‌త్రిక‌ల ఎడిట‌ర్లు.. సీనియ‌ర్ పాత్రికేయుల‌తో ఆదివారం సాయంత్రం ఢిల్లీలో ఆయ‌న స‌మావేశ‌మ‌య్యారు.

మోడీ నాలుగేళ్ల పాల‌న‌లో తాము సాధించిన విజ‌యాల్ని ఏక‌రువు పెట్టేందుకు ఏర్పాటు చేసిన ఈ స‌మావేశంలో ఏకంగా 40 నిమిషాల ప్ర‌జంటేష‌న్ ను ఇవ్వ‌టం గ‌మ‌నార్హం. కేంద్ర‌మంత్రి రాజ్య‌వ‌ర్ధ‌న్ సింగ్ రాథోడ్ ప్ర‌జంటేష‌న్ బాధ్య‌త‌ను మీదేసుకున్నారు.

ఈ మీటింగ్ కు కేంద్ర‌మంత్రులు.. బీజేపీలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్న కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్‌.. రైల్వే మంత్రి పీయూష్ గోయ‌ల్ లు పాల్గొన్నారు. ప్రాంతీయ పార్టీల ప‌రిమితులు ఎక్కువ‌ని.. వారు జాతీయ స్థాయిలో ప్ర‌భావం చూపించే అవ‌కాశం లేద‌ని అమిత్ షా పేర్కొన్నారు. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఒడిశాలో ప్ర‌చారం చేస్తే ఎవ‌రైనా ఓటేస్తారా? కేసీఆర్ వెళ్లి ప‌శ్చిమ‌బెంగాల్ లో ప్ర‌చారం చేస్తే ప‌ది ఓట్లు అయినా వ‌స్తాయా? వారంతా ప్రాంతీయ పార్టీ నేత‌ల‌ని.. తామున్న ప్రాంతాల్లో బ‌ల‌మైన‌నేత‌లు త‌ప్పించి.. వారికి వేరే ప్రాంతాల్లో బ‌లం ఉండ‌ద‌ని.. వారు ప్ర‌భావాన్ని చూపించ‌లేర‌న్నారు.

ప్రాంతీయ నేత‌లంతా ఆయా రాష్ట్రాల్లో అంతో ఇంతో ప్ర‌భావం చూపిస్తారే కానీ.. జాతీయ‌స్థాయిలో చూపించ‌లేర‌న్న స్ప‌ష్ట‌త ఇచ్చిన అమిత్ షా.. ప్రాంతీయ పార్టీల‌తో క‌లిసి ఎన్నిక‌ల‌కు వెళ్ల‌టం సాధ్యం కాద‌ని తేల్చేశారు. గ‌డిచిన కొద్ది రోజులుగా అదే ప‌నిగా ప్ర‌చారం సాగుతున్న ముంద‌స్తు ఎన్నిక‌ల‌పైనా షా క్లారిటీ ఇచ్చేశారు.

ముంద‌స్తు అన్న‌ది ఉత్త అబ‌ద్ధ‌మ‌ని.. అలాంటి ఆలోచ‌న ఏదీ త‌మ‌కు లేద‌ని తేల్చేశారు. ప్రాంతీయ పార్టీల‌తో ఫ్రంట్ ఏర్ప‌డ‌టం అసాధ్య‌మ‌ని.. ఆచ‌ర‌ణ‌లో క‌ష్ట‌మ‌ని స్ప‌ష్టం చేశారు. షా చెప్పిన మాట‌ల‌తో చూసిన‌ప్పుడు.. గ‌డిచిన కొద్ది రోజులుగా తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి ప్ర‌స్తావిస్తున్న ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ పెద్ద‌గా ప్ర‌భావం చూపించేదేమీ ఉండ‌ద‌న్న విష‌యాన్ని షా తేల్చి చెప్పిన‌ట్లైంది. కానీ.. ఒక జాతీయ పార్టీతో కొన్ని బ‌ల‌మైన ప్రాంతీయ పార్టీలు జ‌త క‌డితే సీన్ మారుతుంద‌న్న వాస్త‌వాన్ని అమిత్ షా గుర్తిస్తే మంచిద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. త‌మ‌కు త‌ప్ప మ‌రే ప్ర‌త్యామ్నాయం లేద‌ని చెప్ప‌టం బాగానే ఉన్నా.. ఓవ‌ర్ కాన్ఫిడెన్స్ ఎంత‌కూ మంచిది కాద‌న్న‌ది షా వ‌ర‌కూ గుర్తుంటే చాలు.