Begin typing your search above and press return to search.

రేవంత్ చేరిక‌కు అమిత్ షా పెట్టిన ష‌ర‌తు ఇదేనా?

By:  Tupaki Desk   |   26 Sep 2017 4:11 AM GMT
రేవంత్ చేరిక‌కు అమిత్ షా పెట్టిన ష‌ర‌తు ఇదేనా?
X
తెలంగాణ టీడీపీ కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి బీజేపీలో చేర‌డం ఎందుకు ఆగిపోయింది? సైకిల్ పార్టీని వీడి కాషాయం కండువా కప్పుకొనేందుకు స‌ర్వం సిద్ధ‌మ‌యిన‌ట్లు వార్త‌లు వ‌చ్చిన‌ప్ప‌టికీ చివ‌రి నిమిషంలో నిలిచిపోవ‌డం వెనుక ఢిల్లీ పెద్ద‌లు ఉన్నారా? అందులోనూ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ ఆత్మ‌గా పేరున్న అమిత్ షా వ‌ల్లే ఈ జాయినింగ్ ఆగిపోయిందా? అంటే అవున‌నే చర్చ రాజకీయ వ‌ర్గాల్లో సాగుతోంది. ఇలా రేవంత్‌కు అడ్డుప‌డింది ఆయ‌న కెరీర్‌లో అత్యంత మ‌ర‌క‌గా మిగిలిన ఓటుకునోటు కేసు అని విశ్లేషిస్తున్నారు.

తెలంగాణలో జ‌రిగిన ఎమ్మెల్సీ ఎన్నిక‌ల సంద‌ర్భంగా తెలుగుదేశం పార్టీ అభ్య‌ర్థిని గెలిపించుకునేందుకు టీఆర్ ఎస్ ఎమ్మెల్యేల‌ను కొనుగోలు చేస్తున్న స‌మ‌యంలో రేవంత్ రెడ్డి రెడ్ హ్యాండెండ్‌ గా ప‌ట్టుబ‌డిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ క్ర‌మంలో తెలంగాణ ఏసీబీ ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డిని దోషిగా తేల్చ‌డం...ఇప్ప‌టికీ ఆ కేసు విచార‌ణ జ‌రుగుతుండ‌టం..ఇవ‌న్నీ తెలిసిన సంగ‌తే. ఈ ఓటుకు నోటు కేసు కార‌ణంగా రేవంత్ రెడ్డి బీజేపీలో చేరిక ఆగిపోయిందనేది విశ్లేషకుల మాట.

బీజేపీలో చేరేందుకు రేవంత్ రెడ్డి సిద్ధ‌మ‌యిపోయారని కొద్దికాలం క్రితం భారీగా ప్రచారం సాగిన సంగతి తెలిసిందే.అయితే...రేవంత్ రెడ్డి రాక స‌మ‌యంలో ఆయ‌న పొలిటిక‌ల్ జ‌ర్నీ త‌దిత‌రాల గురించి పార్టీ ర‌థ‌సార‌థి అమిత్ షా ఎంక్వైరీ చేశారని చెప్తున్నారు. ఈ క్ర‌మంలో ఓటుకు నోటు కేసులో రేవంత్ పాత్ర - ఇంకా కేసు కొన‌సాగుతుండ‌టం బ‌య‌ట‌ప‌డిందని అంటున్నారు. దీంతో ఈ కేసు నుంచి విముక్తి అయిన త‌ర్వాతే పార్టీ చేరిక గురించి చ‌ర్చించాల‌ని అమిత్ షా స్ప‌ష్టం చేసిన‌ట్లు రాజకీయవర్గాలు చెప్తున్నాయి. బీజేపీ అవినీతికి వ్య‌తిరేకం అని బలంగా ప్రచారం చేసుకుంటున్న సమయంలో...రేవంత్ రెడ్డిని చేర్చుకోవ‌డం ద్వారా పార్టీ ప‌రువును ప‌లుచన చేసుకోవ‌ద్ద‌ని అమిత్ షా భావించార‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో ప్ర‌చారం సాగుతోంది. అందుకే రేవంత్ రెడ్డి కాషాయ పార్టీలో చేరలేదనే రాజకీయవర్గాలు చర్చించుకుంటున్నాయి.