Begin typing your search above and press return to search.

తిరుపతి అభ్యర్థిని ఖాయం చేసిన అమిత్ షా

By:  Tupaki Desk   |   20 Feb 2021 8:30 AM GMT
తిరుపతి అభ్యర్థిని ఖాయం చేసిన అమిత్ షా
X
భారతీయ జనతా పార్టీ మాజీ అధ్యక్షుడు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఏపీలో జరిగే తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని దాదాపు డిసైడ్ చేసినట్లు సమాచారం. మార్చి 4న అమిత్ షా తిరుమల ఆలయంతోపాటు తిరుపతి పట్టణ పర్యటన సందర్భంగా తిరుపతి పార్లమెంటరీ స్థానానికి జరిగే ఉప ఎన్నికలలో అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు తెలిపాయి..

29న దక్షిణాది రాష్ట్రాల మండలి సమావేశానికి అధ్యక్షత వహించడానికి అమిత్ షా తిరుపతికి వస్తున్నారు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు, తెలంగాణ మరియు పుదుచ్చేరి, ఆండమాన్ మరియు నికోబార్ దీవులు మరియు లక్షద్వీప్ యొక్క గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లతో భేటి కానున్నారు. దక్షిణాదికి సంబంధించిన సమస్యలను చర్చించడానికి ఈ సమావేశం నిర్వహిస్తున్నారు.

అలాగే తిరుమల వేంకటేశ్వరుడిని దర్శనం చేసుకోవడానికి అమిత్ షా మరో రోజు తిరుపతిలో ఉంటారని ఆ వర్గాలు తెలిపాయి. తిరుపతి పార్లమెంటరీ స్థానానికి రాబోయే ఉప ఎన్నికలపై అభ్యర్థిని ఇక్కడే తేలుస్తారని.. ఈ మేరకు బిజెపి నాయకులతో సమావేశం నిర్వహించి వారికి దిశానిర్దేశం చేస్తారని సమాచారం.అయితే, అభ్యర్థి బిజెపి నుంచి వస్తారా లేదా జనసేన నుంచి వస్తారా అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు.

తిరుపతి ఉప ఎన్నికలలో పోటీచేయడానికి బీజేపీ నాయకులు చాలా ఆసక్తిగా ఉన్నారు. జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కూడా ఈ సీటు కోసం గట్టిగా లాబీయింగ్ చేస్తున్నారు. అమిత్ షాను కలవడానికి పవన్ కళ్యాణ్ కూడా తిరుపతికి రావచ్చని, ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటామని వర్గాలు తెలిపాయి. "బిజెపి అభ్యర్థి అయినా, జనసేన అభ్యర్థి అయినా, అభ్యర్థి విజయం కోసం రెండు పార్టీలు కలిసి పనిచేస్తాయి" అని జనసేనాని పవన్ కళ్యాణ్ ఇప్పటికే ప్రకటించారు కూడా. దీంతో అమిత్ షా నిర్ణయం ఇక్కడ కీలకంగా మారింది.