Begin typing your search above and press return to search.

ముంద‌స్తుకు మంగ‌ళం!

By:  Tupaki Desk   |   15 July 2018 5:07 AM GMT
ముంద‌స్తుకు మంగ‌ళం!
X
కొన్ని రోజులుగా దేశ‌వ్యాప్తంగా ముంద‌స్తు ఊహాగానాలు షికారు చేస్తున్నాయి. డిసెంబ‌ర్ లేదా ఫిబ్రవ‌రి నెల‌లో ముంద‌స్తు ఎన్నిక‌లు వ‌స్తాయ‌ని ప్రింట్ - ఎల‌క్ట్రానిక్ మీడియా - సోష‌ల్ మీడియాల్లో విప‌రీత ప్రచారం జ‌రిగింది. ప‌లు రాజ‌కీయ పార్టీలు కూడా దీనిపై త‌మ స్పంద‌న‌ను తెలియ‌జేశాయి. ఈ మ‌ధ్య జ‌రిగిన లా క‌మిష‌న్ అభిప్రాయ వేదిక‌లో కూడా కొన్ని పార్టీలు ముంద‌స్తుకు సానుకూలంగానూ - మ‌రికొన్ని పార్టీలు వ్యతిరేకంగానూ స్పందించాయి. తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ ముంద‌స్తును వ్యతిరేకిస్తే - తెలంగాణ రాష్ట్ర స‌మితి - వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలు స‌మ‌ర్ధించాయి. త్వరలో జ‌రుగ‌నున్న మూడు రాష్ట్రాల శాస‌న‌స‌భ ఎన్నిక‌ల‌తో క‌లిసి లోక్ స‌భ‌కు ముందస్తు ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌ని ప్రధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ భావిస్తున్నట్లు స‌మాచారం.

అయితే, తాజాగా అందిన స‌మాచారం మేర‌కు ప్రధాని - భార‌తీయ జ‌న‌తా పార్టీ అగ్ర నాయ‌కత్వం త‌మ మ‌న‌సు మార్చుకున్నట్లు ఢిల్లీ వ‌ర్గాలు చెబుతున్నాయి. దీనికి కార‌ణం కేంద్ర ప్రభుత్వంపై ప్రజ‌లు మంచి అభిప్రాయం లేద‌ని - ఈ స‌మ‌యంలో ముంద‌స్తుకు వెళ్తే అనుకూల ఫ‌లితాలు రావ‌ని బిజేపీ అగ్ర నాయ‌కత్వం భావిస్తోంద‌ట‌. య‌థాత‌థంగా ఏప్రిల్ నెల‌లో కాని - మే నెల‌లో కాని ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌న్నది తాజా వ్యూహంగా చెబుతున్నారు. ఫిబ్రవ‌రి నెల‌లో వార్షిక బ‌డ్జెట్ ప్రవేశ పెట్టాల‌ని - స‌మావేశాలు ముగిసిన త‌ర్వాత ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల చేయాల‌ని అనుకుంటున్నట్లు స‌మాచారం.

రాజ‌స్థాన్ - మ‌ధ్యప్రదేశ్ - ఛ‌త్తీస్ ఘ‌డ్ శాస‌న‌స‌భ ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డిన త‌ర్వాత భార‌తీయ జ‌న‌తా పార్టీ ఓ అంచ‌నాకు వ‌స్తుంద‌ని - వీటి ఫ‌లితాల‌ను బ‌ట్టి వ్యూహ ర‌చ‌న చేయాల‌న్నది పార్టీ నాయ‌కుల యోచ‌న‌. అలాగే ఫిబ్రవ‌రి నెల‌లో బ‌డ్జెట్ పెడితే అందులో వ‌రాలు కురిపిస్తే ప్ర‌జ‌లు మ‌ళ్లీ త‌మ‌కు ప‌ట్టం క‌డ‌తార‌న్నది బిజేపి ఎత్తుగ‌డ‌. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పలు ప్రాంతీయ పార్టీల‌తో క‌ల‌వాల‌నుకుంటున్న నేప‌థ్యంలో బ‌డ్జెట్ త‌ర్వాత ఎన్నిక‌ల‌కు వెళ్లడ‌మే మంచిద‌ని భావిస్తున్నారు. రెండు రోజుల క్రితం హైద‌రాబాద్ వ‌చ్చిన బిజెపి అధ్యక్షుడు అమిత్ షా కూడా ముంద‌స్తు ఎన్నిక‌లు ఉండ‌వ‌ని తెలంగాణ బిజెపీ నాయ‌కుల‌కు స్పష్టం చేశారు.