Begin typing your search above and press return to search.

‘సోము’..కథ సుఖాంతం వెనుక ఏం జరిగింది.?

By:  Tupaki Desk   |   15 May 2018 10:58 AM GMT
‘సోము’..కథ సుఖాంతం వెనుక ఏం జరిగింది.?
X
ఉవ్వెత్తున ఎగిసిన అసంతృప్తి జ్వాల ఒక్క ప్రకటనతో చల్లారింది. విజయవాడలోని రాష్ట్ర బీజేపీ కార్యాలయం నుంచి వెలువడిన ప్రకటనతో ఏపీ బీజేపీలో అంతర్యుద్ధం ముగిసిపోయింది. ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కన్నా లక్ష్మీనారాయణ నియామకంతో అలకవహించిన సోము వీర్రాజు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆయనకు మద్దతుగా పలువురు నాయకులు - కార్యకర్తలు నిలవడంతో ఏపీ బీజేపీ నిలువునా చీలిపోతుందని అంతా భావించారు. కొత్త అధ్యక్షుడిగా కన్నా నియామకంపై అంతటా వ్యతిరేకత వస్తున్న దరిమిలా కేంద్రంలోని బీజేపీ పెద్దలు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. అలక వహించిన సోము వీర్రాజుతో చర్చలు జరిపి అత్యున్నత పదవిని ఆఫర్ చేసినట్టు సమాచారం. దీంతో దిగివచ్చిన సోము ఎట్టకేలకు తన పేరు మీద ఓ ప్రకటన విడుదల చేశారు.

తాజాగా సోము వీర్రాజు విడుదల చేసిన ప్రకటనలో ‘‘తాను అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని.. రాష్ట్ర అధ్యక్షుని ప్రకటనతో భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం నిర్ణయాన్ని తాను సమర్థిస్తూ స్వాగతిస్తున్నానని’’ తెలిపారు. అధిష్టానం నిర్ణయమే శిరోధార్యమని.. పార్టీ కార్యకర్తలు దీనిని అనుసరించి వ్యవహరించాలని.. రానున్న రోజుల్లో పార్టీని సమర్థవంతంగా సమష్టి నాయకత్వంతో ముందుకు తీసుకెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కన్నా లక్ష్మీనారాయణ నియామకాన్ని స్వాగతిస్తున్నానని.. ఆయన ఎంపికకు తాను వ్యతిరేకం కాదని సోము వీర్రాజు స్పష్టం చేశారు. తనకు, కన్నాకు మధ్యన విభేదాలున్నట్టు మీడియా సృష్టించిందని.. ఇందులో వాస్తవం లేదన్నారు.

అయితే ఏపీ బీజేపీలో మొదట్లో చోటుచేసుకున్న ఈ ప్రతిష్టంభనను అమిత్ షా కలుగుజేసుకొని పరిష్కరించినట్టు సమాచారం. బీజేపీలోని ఈ కుమ్ములాటలు అధికార చంద్రబాబుకు ఆస్కారం కల్పించినట్టు అవుతుందని.. మున్ముందు మన పోరాటం టీడీపీపైనే కావడంతో గొడవలు పార్టీకి మంచివి కావని అమిత్ షా.. సోము వీర్రాజుకు నచ్చచెప్పినట్టు తెలిసింది. మున్ముందు కేంద్రంలో రాజ్యసభ సీటుతో పాటు అధికారంలోకి వస్తే ముఖ్యమైన పదవులు ఇస్తామని అమిత్ షా సోముకు హామీ ఇచ్చినట్టు విశ్వసనీయంగా తెలిసింది. అందుకే ఉన్నఫళంగా సోము వీర్రాజు మీడియాకు ఓ పత్రికా ప్రకటన విడుదల చేసి బీజేపీలో గొడవలకు తెరదించారు.