Begin typing your search above and press return to search.

అసద్ కు అదిరేలా షా కౌంటర్

By:  Tupaki Desk   |   7 Aug 2019 7:37 AM GMT
అసద్ కు అదిరేలా షా కౌంటర్
X
ఏదో అనుకుంటే మరేదో అన్నట్లుగా మారింది మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ పరిస్థితి. కశ్మీర్ పై మోడీ సర్కారు తీసకున్న నిర్ణయంపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన అసద్.. వరుస వ్యాఖ్యలతో చెలరేగిపోయారు. చారిత్రక తప్పిదం చేసిందంటూ మాట్లాడిన అసద్ కు.. కేంద్ర రక్షణ మంత్రి అమిత్ షా ఘాటు కౌంటర్ ఇచ్చారు. కశ్మీర్ విషయంలో బీజేపీ అస్సలు తప్పు చేయలేదన్న విషయం అసద్ కు త్వరలోనే తెలిసి వస్తుందని చెప్పిన అమిత్ షా.. ఐదేళ్లలో జమ్ముకశ్మీర్ లో జరిగే అభివృద్ది చూస్తే అసలు విషయం అర్థమవుతుందన్నారు.

అసద్ చేసిన వ్యాఖ్యలకు ధీటుగా సమాధానం ఇచ్చే క్రమంలో అమిత్ షా అనూహ్య వ్యాఖ్యలు చేశారు. దేశ చరిత్రలో ఇప్పటివరకూ ఏ హోం మంత్రి చేయని రీతిలో భారీ ప్రకటన చేశారు. పీవోకే భారత్ లో అంతర్భాగమేనని.. దాన్ని ఎలా స్వాధీనం చేసుకోవాలో తమకు తెలుసంటూ సంచలన వ్యాఖ్య చేశారు. దేశంలోని చిన్న పిల్లాడిని అడిగినా కాశ్మీర్ భారత్ లో అంతర్భాగమని చెబుతారని.. 70 ఏళ్లుగా నానుతున్న సమస్యకు మోడీ సమాధానం ఇచ్చారన్నారు.

ఆర్టికల్ 370లో మార్పులకు సంబంధించిన నిర్ణయం మంచిదా ? కాధా? అన్న విషయం కాలమే నిర్ణయిస్తుందని చెప్పిన ఆమె.. ఫ్యూచర్లో ఆర్టికల్ 370 గురించి ఎప్పుడు మాట్లాడినా.. చర్చ జరిగినా మోడీ గురించి మాట్లాడుకుంటారన్నారు. ప్రజలు ప్రధాని గురించి చర్చించుకుంటారన్నారు.

చర్చలకు బీజేపీ ఎప్పుడూ వెనకడుగు వేయలేదని చెప్పిన ఆయన.. 70 ఏళ్లుగా చర్చలు జరుగుతున్నాయని.. అలాంటి క్రమంలో పాక్ తో వత్తాసు పలికే వారితో చర్చలు జరపాలా? అని ప్రశ్నించారు. కశ్మీర్ లో సాధారణ పరిస్థితులు చోటు చేసుకున్న తర్వాత అసెంబ్లీ ఏర్పాటు ఉంటుందన్నారు. శాంతిభద్రతల కోసమే జమ్ముకశ్మీర్ లో నిషేదాజ్ఞలు అమలు చేయాల్సి వచ్చిందని.. కేంద్రపాలిత ప్రాంతంగా ఎన్నాళ్లు ఉంటుందన్న సందేహం అక్కర్లేదన్నారు. సాధారణ పరిస్థితులు నెలకొన్న తర్వాత రాష్ట్రంగా మారుతుందన్నారు.

కశ్మీరులో మైనార్టీలంటే హిందువులు.. జైనులు.. సిక్కులని చెప్పిన అమిత్ షా.. ఆర్టికల్ 370 ద్వారా వారికి తీవ్ర అన్యాయం జరిగిందన్న విషయాన్ని ప్రస్తావించారు. కశ్మీర్ పూర్తిస్థాయిలో నష్టపోవటానికి ఆర్టికల్ 370 కారణమని.. అలాంటప్పుడు అది ఉండటం అవసరమా? అని ప్రశ్నించిన షా.. 370తో 371 పోల్చటం సరికాదన్నారు. ఇది ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్లేలా చేస్తాయన్నారు. కశ్మీర్ గురించి అసద్ ప్రస్తావిస్తే.. అనూహ్యంగా పీవోకే ప్రస్తావన తీసుకురావటం ద్వారా అమిత్ షా అసద్ అండ్ కో నోట మాట రాకుండా చేశారని చెప్పాలి.