Begin typing your search above and press return to search.

అద్వానీ సీట్లో షా!..నామినేష‌న్ ఘ‌ట్టం అదిరింది!

By:  Tupaki Desk   |   30 March 2019 9:03 AM GMT
అద్వానీ సీట్లో షా!..నామినేష‌న్ ఘ‌ట్టం అదిరింది!
X
బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జాతీయ రాజ‌కీయాల్లో కూడా పూర్తిగా యాక్టివేట్ అయిపోయార‌నే చెప్పాలి. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఎక్క‌డ ఉంటే... తాను అక్క‌డే అన్న చందంగా త‌న రాజ‌కీయ ప్ర‌స్థానాన్ని కొన‌సాగిస్తూ వ‌స్తున్న అమిత్ షా... మోదీ గుజ‌రాత్ సీఎంగా ఉన్నంత కాలం ఆ రాష్ట్రం గ‌డ‌ప దాటి బ‌య‌ట‌కు వ‌చ్చిన దాఖ‌లా లేదు. అయితే మోదీ ఎప్పుడైతే జాతీయ రాజ‌కీయాల్లోకి వ‌చ్చేశారో, షా కూడా మోదీ వెంటే ఢిల్లీకి షిఫ్ట్ అయిపోయారు. అయితే మోదీ మాదిరి ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల్లో అంత‌గా గ్రాండ్ రికార్డు లేని షా... గుజ‌రాత్ లో ఎమ్మెల్సీగా - జాతీయ రాజ‌కీయాల్లోకి వ‌చ్చాక రాజ్య‌స‌భ స‌భ్యుడిగా కొన‌సాగారు.

అయితే ఇప్పుడు మోదీ మాదిరే ఆయ‌న కూడా ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లో మ‌రింత‌గా యాక్టివేట్ కావాల‌ని భావించిన‌ట్టుగా తెలుస్తోంది. ప్ర‌స్తుత సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ప్ర‌త్య‌క్ష బ‌రిలోకి దిగేందుకే నిర్ణ‌యించుకున్న అమిత్ షా... ఏకంగా పార్టీ సీనియ‌ర్ నేత‌, పార్టీకి జ‌వ‌స‌త్వాలు నింపిన ఎల్కే అద్వానీ సీటుకే ఎస‌రు పెట్టేశారు. ప్ర‌ధానిగా మోదీ, పార్టీ జాతీయ అధ్యక్షుడిగా అమిత్ షాలు ఉన్న నేప‌థ్యంలో... షా నిర్ణ‌యాన్ని కాద‌నే నేత బీజేపీలో ఎవ‌రు ఉంటారు చెప్పండి. నిజ‌మే... అద్వానీకి సీటు ఇవ్వ‌కుండా అదే సీటు నుంచి బ‌రిలోకి దిగేందుకు అమిత్ షా సిద్ద‌మైతే.,.. ఏ ఒక్క‌రు కూడా నోరు మెద‌ప‌కపోగా... అమిత్ షా నామినేష‌న్ ఘ‌ట్టాన్ని ర‌క్తి క‌ట్టించేందుకు పార్టీ సీనియ‌ర్లు క్యూ క‌ట్టారు. కాసేప‌టి క్రితం గాంధీ న‌గ‌ర్ లోక్ స‌భ స్థానం నుంచి బీజేపీ అభ్య‌ర్థిగా అమిత్ షా నామినేష‌న్ వేశారు. ఈ సంద‌ర్భంగా గాంధీ న‌గ‌ర్ లో కోలాహ‌ల వాతావ‌ర‌ణం చోటుచేసుకుంది.

నామినేష‌న్ వేయ‌డానికి భార్య‌ - కుమారుడిని వెంట‌బెట్టుకుని అమిత్ షా బ‌య‌లుదేర‌గా... పార్టీ శ్రేణులు భారీ ఎత్తున స్వాగ‌తం ప‌లికాయి. ఇక నామినేష‌న్ పేప‌ర్ల‌ను రిట‌ర్నింగ్ అధికారికి అందించేందుకు వెళ్లిన షా వెంట పార్టీ సీనియ‌ర్ నేత‌లు, మోదీ కేబినెట్ లో కీల‌క మంత్రులుగా ఉన్న రాజ్ నాథ్ సింగ్‌, అరుణ్ జైట్లీ, గుజ‌రాత్ ముఖ్య‌మంత్రి విజ‌య్ రూపానీలు ఉన్నారు. బీజేపీ విధానాల‌పై ఎప్ప‌టికప్పుడు త‌న‌దైన శైలి విమర్శలు గుప్పిస్తూ క‌మ‌ల‌నాథుల‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న శివ‌సేన అధినేత ఉద్ధ‌వ్ ఠాక్రే కూడా ఈ కార్య‌క్ర‌మానికి స్వ‌యంగా హాజ‌రై అంద‌రినీ ఆశ్చ‌ర్యంలో ముంచెత్తారు. మొత్తంగా అమిత్ షా నామినేష‌న్ కార్య‌క్ర‌మం సూప‌ర్ గ్రాండ్ షోగానే సాగింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.