Begin typing your search above and press return to search.

బాబుకు మోదీ క‌న్నా!..పాక్ ప్ర‌ధానిపైనే న‌మ్మ‌క‌మట‌!

By:  Tupaki Desk   |   21 Feb 2019 2:55 PM GMT
బాబుకు మోదీ క‌న్నా!..పాక్ ప్ర‌ధానిపైనే న‌మ్మ‌క‌మట‌!
X
బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా... త‌న‌దైన శైలిలో టీడీపీ అధినేత‌ - ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడిపై ఒంటికాలిపై లేచారు. టీడీపీ - బీజేపీ మ‌ధ్య కొన‌సాగిన పొత్తు విడిపోయిన త‌ర్వాత ఇరు పార్టీల మ‌ధ్య మాట‌ల తూటాలు పేలుతున్నాయి. అప్ప‌టిదాకా ప‌ర‌స్ప‌రం ప్ర‌శంసించుకున్న నోళ్ల‌తోనే ఇప్పుడు తిట్ల దండ‌కాలు వినిపిస్తున్నాయి. ఈ క్ర‌మంలో నేడు తూర్పు గోదావ‌రి జిల్లా రాజ‌మ‌హేంద్ర‌వ‌రం వ‌చ్చిన అమిత్ షా... పార్టీ కార్య‌క‌ర్త‌ల స‌మావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్ర‌బాబుపై ఆయ‌న త‌న‌దైన శైలిలో విరుచుకుప‌డ్డారు.

పుల్వామా దాడి నేప‌థ్యంలో కేంద్ర ప్ర‌భుత్వం తీరు - ప్ర‌త్యేకించి ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ తీరును ఎండ‌గ‌ట్టేందుకంటూ రంగంలోకి దిగిన చంద్ర‌బాబు... పాకిస్థాన్ ప్ర‌ధానిని ప్ర‌శంసించేలా వ్యాఖ్య‌లు చేసి ఇరుకున‌ప‌డ్డారు. ఈ సంద‌ర్భాన్ని ఏమాత్రం వేస్ట్ చేసుకోని అమిత్ షా... చంద్రబాబును ఉతికి ఆరేశార‌నే చెప్పాలి. చంద్ర‌బాబుకు భార‌త ప్ర‌ధాని కంటే కూడా పాకిస్థాన్ ప్ర‌ధాని పైనే న‌మ్మ‌క‌ముంద‌ని, ఇందుకు చంద్ర‌బాబు వ్యాఖ్య‌లే నిద‌ర్శ‌న‌మ‌ని కూడా అమిత్ షా ధ్వ‌జ‌మెత్తారు. ఈ త‌ర‌హా నీచ రాజ‌కీయాలు చేయ‌డంలో చంద్ర‌బాబు దిట్టేన‌ని తిట్టిపోయిసి అమిత్ షా... మోసం చేయ‌డంలోనూ ఆయ‌న‌ది అందెవేసిన చెయ్యేన‌ని విమ‌ర్శించారు. అమరావతి - పోలవరం నిర్మాణానికి కేంద్రం ఇచ్చిన నిధులను ఖర్చు చేయకుండా చంద్ర‌బాబు అవినీతికి పాల్పడ్డారని దుయ్య‌బ‌ట్టారు.

ఏపీని విడగొట్టిన కాంగ్రెస్ నేతలతో చంద్రబాబు దోస్తీ చేస్తూ.. బీజేపీపై దుష్ప్రచారం చేస్తున్నారని అమిత్ షా మండిప‌డ్డారు. ఆర్థిక క‌ష్టాల్లో ఉన్న ఏపీని వదిలి ఢిల్లీ - కోల్‌ కతా - బెంగళూరు - చెన్నై వెళ్లి చంద్రబాబు ధర్నాలు చేస్తున్నారని షా ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. చంద్రబాబు ధర్నాలు చేయాలనుకుంటే... టీడీపీ ఆఫీసు ముందు చేయాల‌ని సెటైర్ వేసిన అమిత్ షా... అందుకు కార‌ణం కూడా చెప్పారు. ఏపీ ప్ర‌జ‌ల‌ను మోసం చేసింది టీడీపీనేన‌ని చెప్పిన షా... అందుకు నిర‌స‌న తెల‌పాల‌నుకుంటే చంద్ర‌బాబుకు టీడీపీ కార్యాల‌య‌మే వేదిక కావాలి క‌దా అంటూ త‌న‌దైన శైలి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మొత్తంగా ఏపీకి వ‌చ్చిన అమిత్ షా.. చంద్ర‌బాబుపై ఓ రేంజిలో ఫైరైపోయారు.