Begin typing your search above and press return to search.

కేసీఆర్‌ పై షా పంచ్ లు మామూలుగా లేవుగా?

By:  Tupaki Desk   |   16 Sep 2018 4:28 AM GMT
కేసీఆర్‌ పై షా పంచ్ లు మామూలుగా లేవుగా?
X
బీజేపీ-టీఆర్ ఎస్ ల మ‌ధ్య ర‌హ‌స్య డీల్ ఉంద‌ని.. వారి మ‌ధ్య జ‌రిగిన ఒప్పందంలో భాగంగానే బీజేపీ సిట్టింగులు బ‌రిలో ఉన్న చోట్ల బ‌ల‌హీన‌మైన అభ్య‌ర్థుల్ని బ‌రిలో దించాల‌ని భావిస్తున్న‌ట్లుగా జోరుగా ప్ర‌చారం జ‌రుగుతున్న వేళ‌.. తెలంగాణ ఆప‌ద్ద‌ర్మ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఊహించని విధంగా బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా పంఛ్ లు వేశారు. ఇటీవ‌ల కాలంలో కేసీఆర్ మీద ఈస్థాయిలో విరుచుకుప‌డ‌టం.. ఆయ‌న ఇబ్బంది ప‌డేలా ప్ర‌శ్న‌లు సంధించ‌టం షాకే చెల్లు అనేలా చేయ‌గ‌లిగారు.

కీల‌క‌మైన అంశాల్ని త‌న‌దైన శైలిలో లాజిక్ గా అడిగిన తీరు కేసీఆర్ పై మ‌రింత కోపాన్ని పెంచేలా ఉన్నాయ‌ని చెప్పాలి. ఓప‌క్క జ‌మిలికి ఓకే చెబుతూ.. మ‌రోవైపు ముంద‌స్తుకు వెళ్ల‌టం ఏమిటి? అన‌వ‌స‌ర‌మైన ఖ‌ర్చును కేసీఆర్ పెంచుతున్నార‌న్న మాట‌తో కేసీఆర్ నిర్ణ‌యాన్ని ఆయ‌న సూటిగా ప్ర‌శ్నించార‌ని చెప్పాలి.

అన్నింటికి మించి తెలంగాణ తొలి ముఖ్య‌మంత్రి ద‌ళితుడే అన్న కేసీఆర్ హామీని గుర్తు చేస్తూ.. తొలిసారి ఏదో జ‌రిగింద‌ని అనుకుందాం.. ఈసారి ఎన్నిక‌ల్లో గెలిస్తే ముఖ్య‌మంత్రిగా ద‌ళితుడ్ని చేస్తారా? మీ అబ్బాయిని చేస్తారా? అన్న విష‌యాల‌పై క్లారిటీ ఇవ్వాల‌న్న షా మాట గులాబీ అధిప‌తికి కొత్త త‌ల‌నొప్పిని తెచ్చిపెట్టేలా మారింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

ఆట‌లో అర‌టిపండు మాదిరి బీజేపీ ఉంటుంద‌ని అంచ‌నా వేసిన వారికి.. అదంతా త‌ప్పుడు భావ‌న అన్న సందేశాన్ని త‌న తాజా ప‌ర్య‌ట‌న‌లో షా స్ప‌ష్టం చేశార‌ని చెప్పాలి. షా చేసిన వ్యాఖ్య‌ల్లో కీల‌క‌మైన‌వి చూస్తే..

+ తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు ఎందుకు వెళుతున్నారు? ప్రధాని మోదీ జమిలి ఎన్నికలకు ప్రతిపాదిస్తే.. తొలుత కేసీఆర్‌ ఆమోదం తెలిపారు. కానీ, ఇప్పుడు 9 నెలల ముందుగా ఎన్నికలకు ఎందుకు వెళుతున్నారు!? దీనికి కేసీఆర్‌ జవాబు చెప్పాలి

+ మేలో ఎన్నికలు జరిగితే విజయం సాధించలేనని భయపడుతున్న కేసీఆర్‌.. నవంబరులో ఎలా విజయం సాధిస్తారు? కుటుంబ పాలన కోసమే ముందస్తుకు వెళుతున్నారు. ముందస్తుతో ఎన్నికల ఖర్చు భారాన్ని తెలంగాణ ప్రజలపై ఎందుకు వేస్తున్నారు? రాజకీయ స్వార్థం కోసం కేసీఆర్‌ కోట్లాది రూపాయల ఖర్చును ప్రజలపై రుద్దారు.

+ దళితుడిని సీఎంని చేస్తామని 2014 ఎన్నికల సందర్భంగా ప్రకటించిన టీఆర్ ఎస్‌ తన హామీని నిలబెట్టుకోలేకపోయింది. కనీసం 2018లోనైనా దళితుడిని సీఎంని చేస్తానని మాటిస్తారా?

+ దళితులు, ఆదివాసీ రైతులపై టీఆర్ ఎస్‌ ప్రభుత్వం కాల్పులు జరిపింది. ఖమ్మంలో మద్దతు ధర కోసం ఉద్యమించిన రైతులకు బేడీలు వేశారు. సిరిసిల్ల జిల్లాలో ఇసుక వ్యాపారానికి వ్యతిరేకంగా పోరాడిన దళితులపై దాడులు చేశారు. తమను మోసం చేసిన కేసీఆర్‌పై దళితులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.

+ మూఢ నమ్మకాలతో నాలుగున్నరేళ్లుగా సచివాలయంలో అడుగుపెట్టనివారు.. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ఎలా ముందుకు తీసుకెళతారో అర్థం కావడం లేదు. తెలంగాణ సమరయోధుల శోకతప్త కుటుంబాలకు ఉద్యోగాలు ఇస్తామన్న హామీ నెరవేరలేదు.

+ ప్రభుత్వ ఉద్యోగాలు - పాఠశాలల్లో ఖాళీల భర్తీ హామీలను పూర్తి చేయలేదు. చేపట్టిన ఏ ఒక్క కార్యక్రమం పూర్తి కాలేదు. ఉస్మానియా - గాంధీ ఆస్పత్రులను ఆధునికీకరిస్తామన్నారు. ప్రతి జిల్లా కేంద్రంలో 100 పడకలు, మండల కేంద్రంలో 30 పడకల ఆస్పత్రులను నిర్మిస్తామన్నారు. ఇవీ నెరవేరలేదు. పేదలకు 2 లక్షల డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లను నిర్మించి ఇస్తామన్నారు. ఈ నాలుగేళ్లలో ఎన్ని ఇచ్చారు. కనీసం ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజననైనా సక్రమంగా వినియోగించుకుంటే పేదలకు ఇళ్లు దక్కేవి. హామీలను సగంలోనే వదిలేయడం ఈ ప్రభుత్వానికి అలవాటుగా మారింది

+ నాలుగున్నరేళ్లలో రాష్ట్రంలో 4,200కుపైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం దీనికి జవాబు చెప్పాలి. కొత్త జిల్లాలను ఏర్పాటు చేశారు.వాటిలో సిబ్బంది నియామకం, మౌలిక సదుపాయాలను కల్పించలేదు. కొత్త పాలనా వ్యవస్థను గ్రామాలకు తీసుకెళ్లలేకపోయారు. పాత - కొత్త జిల్లాల అయోమయంతో ప్రజల ఇబ్బందులు పెరిగాయే తప్ప తగ్గలేదు.

+ మైనారిటీలకు రిజర్వేషన్లు ఇవ్వాలా? వద్దా?’ అంటూ సభికులను ప్రశ్నిస్తూ... నిబంధనల మేరకు రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదు. మైనారిటీలకు 12 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తే .. ఎస్సీ - ఎస్టీ - బీసీల రిజర్వేషన్లకు కోత పడుతుంది. ఇది మైనారిటీలను సంతృప్తిపరిచే విధానం కాదా? మతం ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వడం సాధ్యం కాదన్న విషయం వారికీ తెలుసు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మతం ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వదు. కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే ఈ ప్రతిపాదన పంపారు.

+ టీఆర్ ఎస్‌ మళ్లీ అధికారంలోకి వస్తే ఓటు బ్యాంకు రాజకీయాలు కొనసాగుతూనే ఉంటాయి. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం గురించి మాట్లాడే టీఆర్ ఎస్‌..మజ్లిస్‌ ఒత్తిడితోనే విమోచన దినోత్సవాన్ని జరపలేదు. ఒవైసీకి భయపడుతున్న కేసీఆర్‌ తెలంగాణ ఆత్మ గౌరవాన్ని ఎలా కాపాడతారు?

+ టీఆర్ ఎస్‌ తో ఎలాంటి పొత్తు పెట్టుకోవడం లేదని - స్నేహపూర్వక పోటీ కూడా లేదని అమిత్‌ షా స్పష్టం చేశారు. ఆ పార్టీని ప్రత్యర్థిగానే చూస్తున్నాం. టీఆర్ ఎస్‌ తో బీజేపీ పోరాటం ఆరంభమైంది. ఒవైసీ మాటను ముఖ్యమంత్రి కాదనలేరు. బీజేపీ స్వశక్తి - సమర్థతతో ఎన్నికల్లో పోరాడుతుంది. టీఆర్ ఎస్‌ - మజ్లిస్‌ - కాంగ్రెస్‌ కు వ్యతిరేకంగా పోటీ చేస్తాం.

+ తెలంగాణ రాష్ట్రంలో ప్రచారానికి మోదీ కూడా వస్తారు జోరుగా ప్రచారం చేస్తారు. యూపీలో యోగి ఆదిత్యనాథ్‌ తరహాలో రాష్ట్రంలో స్వామీజీలను తీసుకొచ్చే ఎలాంటి ప్రతిపాదన లేదు.