Begin typing your search above and press return to search.

షా క‌డుపులో కేసీఆర్ అంటే అంత కోప‌మా?

By:  Tupaki Desk   |   11 Oct 2018 5:30 AM GMT
షా క‌డుపులో కేసీఆర్ అంటే అంత కోప‌మా?
X
స్నేహితుడు.. ర‌హ‌స్య స్నేహితుడంటూ కేసీఆర్‌.. బీజేపీ కీల‌క నేత‌లు మోడీషాల గురించి ప‌లువురు చెప్పే మాట‌ల‌కు భిన్న‌మైన తీరును ప్ర‌ద‌ర్శించారు షా. తాజాగా త‌న తెలంగాణ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా కేసీఆర్ మీద త‌మ‌కున్న ఆగ్ర‌హాన్ని.. ఆయన తీరుపై త‌న క‌డుపులో ఉన్న కుత‌కుత‌ను త‌న మాట‌ల్లో చెప్పేశార‌ని చెబుతున్నారు.

కేంద్రం చేప‌ట్టిన ప‌థ‌కాన్ని అమ‌లు చేసేందుకు నో అనేయ‌ట‌మే కాదు.. త‌న ఇమేజ్ కోసం త‌మ‌ను డ్యామేజ్ చేస్తున్న కేసీఆర్ ను ఎట్టి ప‌రిస్థితుల్లో ఉపేక్షించాల్సిన అవ‌స‌రం లేదన్న‌ట్లుగా అమిత్ షా మాట‌లు ఉన్న‌ట్లు తెలుస్తోంది. పార్టీ నేత‌ల‌తో పాటు.. ముఖ్యుల‌తో మాట్లాడిన సంద‌ర్భంగా కేసీఆర్ పై తీవ్ర ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేయ‌ట‌మే ఇందుకు నిద‌ర్శ‌నంగా చెప్పాలి.

తెలంగాణ‌లోని పేద‌లు అనారోగ్యంతో చ‌నిపోతే అందుకు బాధ్య‌త కేసీఆరేన‌ని మండిప‌డిన అమిత్ షా.. కేంద్రం ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన ఆయుష్మాన్ భార‌త్ ను గులాబీ అధినేత రిజెక్ట్ చేయ‌టంపై ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. అనారోగ్యంతో ఆప‌రేష‌న్లు చేయించుకోలేక పేద‌లు క‌న్నుమూస్తే ఆ పాపం కేసీఆర్ దేన‌న్న ఆయ‌న‌.. ఐదేళ్ల‌కోసారి స‌చివాల‌యానికి వెళ్లే సీఎంలు ఉంటే తెలంగాణ అభివృద్ధి ఉంటుందా? అన్న క్వ‌శ్చ‌న్ ను సంధించారు.

మ‌జ్లిస్ అధినేత ఓవైసీకి మ‌ద్ద‌తు ఇచ్చే ఏ పార్టీ కూడా దేశంలో అధికారంలో ఉండ‌టానికి వీల్లేద‌న్న మాట షా నోటి నుంచి వ‌చ్చింది. ముఖ్య‌మంత్రి కావ‌టంతోనే కేసీఆర్ కు సంతృప్తి క‌లిగిన‌ట్లుంద‌ని.. త‌న కుమారుడినో.. కుమార్తెనో ముఖ్య‌మంత్రి చేయాల‌ని భావిస్తున్నార‌ని త‌ప్పు ప‌ట్టారు. కేసీఆర్ పాల‌న‌లో 4500 మంది రైతులు ఆత్మ‌హ‌త్య‌లు చేసుకున్నార‌ని.. అందుకు బాధ్య‌త వ‌హించాల‌ని.. ఆ విష‌యాన్ని ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా తీసుకెళ్లాల‌ని పార్టీ నేత‌ల‌తో షా చెప్ప‌టం గ‌మ‌నార్హం. మొత్తానికి కేసీఆర్ వైఫ‌ల్యాల మీద షా కాసింత ఎక్స‌ర్ సైజ్ చేసిన‌ట్లుగా ఆయ‌న మాట‌లు చెప్పేస్తున్నాయ‌ని చెప్పాలి.