Begin typing your search above and press return to search.

అమిత్ షా మెమోరీ సూప‌ర‌బ్బా

By:  Tupaki Desk   |   10 Feb 2017 8:11 AM GMT
అమిత్ షా మెమోరీ సూప‌ర‌బ్బా
X
ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై విమ‌ర్శ‌లు ప్రారంభ‌మైన నేప‌థ్యంలో ఆయ‌న ఆప్త‌మిత్రుడైన భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా రంగంలోకి దిగారు. రాజ్యసభలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ ను ఉద్దేశించి మోడీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విమర్శలను తిప్పికొట్టారు. ముఖ్యంగా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై ఆయన ఎదురుదాడికి దిగారు. మీ తల్లి సోనియాగాంధీ గతంలో మోడీ గురించి మాట్లాడుతూ ఉపయోగించిన పదాన్ని గుర్తు చేసుకోవాలని ఆయన రాహుల్‌ కు హితవు పలికారు. ఉత్త‌రాఖండ్ లో నిర్వహించిన ఒక ఎన్నికల సభలో ఆయన మాట్లాడుతూ ప్రధాని మోడీ.. మన్మోహన్ సింగ్‌ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పు లేదని అన్నారు. మోడీ రాజ్యసభలో మన్మోహన్ సింగ్‌ ను ఉద్దేశించి మాట్లాడుతూ ‘ఆయన చుట్టూ అనేక కుంభకోణాలు జరిగాయి. కాని, వ్యక్తిగతంగా ఆయనపై ఎలాంటి మచ్చ పడలేదు. బాత్‌ రూమ్‌ లో రెయిన్‌ కోట్ వేసుకొని స్నానం చేసే కళ డాక్టర్ సాబ్‌ కు మాత్రమే తెలుసు’ అని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. మోడీ చేసిన ఈ వ్యాఖ్యలను గట్టిగా సమర్థించిన అమిత్ షా, ఇప్పటివరకు బహిరంగ సభలో మాట్లాడేప్పుడు ఉపయోగించే భాష ఆందోళన కలిగించేదిగా ఉందని, ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ మినహాయింపేమీ కాదని అన్నారు.

యూపీఏ హయాంలో జరిగిన రూ.12 లక్షల కోట్ల విలువైన కుంభకోణాలకు బాధ్యత వహించవలసింది కాంగ్రెస్ పార్టీ, అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ అని అమిత్ షా స్ప‌ష్టం చేశారు. అనేక సంవత్సరాల క్రితం సోనియాగాంధీ.. మోడీ గురించి మాట్లాడుతూ ఉపయోగించిన పదాన్ని గుర్తు చేసుకోవాలని ఆయన రాహుల్‌ కు హితవు పలికారు. అదే పదాన్ని ఇటీవల లోక్‌ సభలో ప్రతిపక్ష నాయకుడు సర్జికల్ స్ట్రైక్‌ పై మాట్లాడుతూ ‘ఖూన్ కి దలాల్’ అంటూ ఉపయోగించారని ఆయన పేర్కొన్నారు. సోనియాగాంధీ గతంలో మోడీని ఉద్దేశించి చేసిన ‘వౌత్‌ కా సౌదాగర్’ (హత్యల వ్యాపారి) అనే వ్యాఖ్యలను అమిత్ షా పరోక్షంగా గుర్తుచేశారు. మన్మోహన్ సింగ్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఒక ఆర్డినెన్స్ ప్రతిని బహిరంగంగా చించివేయడం ద్వారా ఆయనను అవమానించిన మొదటి వ్యక్తి రాహుల్ గాంధీయేనని అమిత్ షా అన్నారు. రెండున్నరేళ్లలో ఏం చేశారో చెప్పండంటూ ప్రధాని మోడీని రాహుల్ గాంధీ నిలదీయడాన్ని ఆయన తప్పుపట్టారు. 60ఏళ్ల పాటు ఏం చేశారో చెప్పనివారు మోడీని రిపోర్ట్ కార్డ్ అడుగుతున్నారని ఎదురుదాడికి దిగారు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/