Begin typing your search above and press return to search.

కేసీఆర్ సర్కార్ కూలుతుంది.. బాంబు పేల్చిన అమిత్ షా

By:  Tupaki Desk   |   21 Aug 2022 1:34 PM GMT
కేసీఆర్ సర్కార్ కూలుతుంది.. బాంబు పేల్చిన అమిత్ షా
X
మునుగోడులో బీజేపీ సభకు ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర హోంమంత్రి అమిత్ షా బాంబు పేల్చారు.కేసీఆర్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరినట్లు అమిత్ షా వెల్లడించారు. ఈ ఉప ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డిని గెలిపిస్తే కేసీఆర్ ప్రభుత్వం పడిపోతుంది. తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహిస్తామని కేసీఆర్ చెప్పి, మాట తప్పారు. బీజేపీ సీఎం వస్తే ఏటా తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహిస్తాం.

వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ను ఓడించి రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అమిత్ షా ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మేరకు తమ ప్రణాళికలన్నీ అమలు చేస్తామన్నారు. కేసీఆర్ ను గద్దె దించడమే ధ్యేయమని స్పష్టం చేశారు.

కేసీఆర్ వివక్షకు వ్యతిరేకంగా యుద్ధం చేస్తున్నానని.. అరాచక పాలనను అంతమొందించాల్సిన సమయం ఆసన్నమైందని మునుగోడు తాజా మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. మునుగోడులో ఏర్పాటు చేసిన బీజేపీ సమరభేరి సభలో రాజగోపాల్ రెడ్డికి.. హోంమంత్రి అమిత్ షా కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈసందర్భంగా రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ..‘తాను అమ్ముడు పోయానంటున్నారని.. నన్ను కొనే శక్తి ఈ ప్రపంచంలో ఎవరికీ లేదన్నారు. రాజీనామా చేసి నిజాయితీగా ప్రజల తీర్పు కోరుతున్నా.. మునుగోడు ప్రజలు తలదించుకునే పని ఎప్పటికీ చేయను అని అన్నారు. నియోజకవర్గ సమస్యలపై అసెంబ్లీలో ప్రస్తావించినా న్యాయం జరగలేదని.. ఎన్ని సార్లు అపాయింట్ మెంట్ అడిగినా సీఎం ఇవ్వలేదని అన్నారు. అందుకే ప్రజల్లోనే తేల్చుకుందామని రాజీనామా చేశానని రాజగోపాల్ రెడ్డి అన్నారు.

ఫామ్ హౌస్ లో పడుకున్న కేసీఆర్ నిద్రలేని మునుగోడు వస్తారని.. అలాగే నిన్న కేసీఆర్ మునుగోడు వచ్చారని.. నా రాజీనామాతో గట్టుప్పల్ మండలం వచ్చిందని.. కొత్త పింఛన్లు వచ్చాయని.. తెలంగాణ ప్రజలు ఆకలినైనా చంపుకుంటారు కానీ.. ఆత్మ గౌరవాన్ని కాదని రాజగోపాల్ రెడ్డి అన్నారు.

ఇక ధర్నా చౌక్ ను ఎత్తేసిన కేసీఆర్ కు సీపీఐ మద్దతు సిగ్గు చేటు అని ఈటల రాజేందర్ అన్నారు. ఎనిమిదేళ్లుగా ఏనాడు ప్రగతిభవన్ లో అడుగుపెట్టని మీరు.. సమ్మెలు చేసినా పిలవని మిమ్మల్ని సీఎం ఇప్పుడు పిలిస్తే వెళతారా? అంటూ కమ్యూనిస్టులపై ఈటల రాజేందర్ విరుచుకుపడ్డారు.

మొత్తంగా కేసీఆర్ టార్గెట్ గానే మునుగోడులో అమిత్ షా సభ జరిగింది. నేతలంతా కేసీఆర్ తీరును ఎండగడుతూ ప్రసంగాలు చేశారు.