Begin typing your search above and press return to search.

ఏపీ బీజేపీ నేతలకు క్లాసు పీకిన అమిత్ షా?

By:  Tupaki Desk   |   4 Sep 2019 3:30 PM GMT
ఏపీ బీజేపీ నేతలకు క్లాసు పీకిన అమిత్ షా?
X
నానాజాతి సమితిలా ఉంది భారతీయ జనతా పార్టీ ఏపీ విభాగం. సాధారణంగా ఏ పార్టీలో అయినా అలానే ఉంటుంది. అయితే భారతీయ జనతా పార్టీలోకి మాత్రం వివిధ పార్టీల నుంచి వచ్చిన వారు ఉన్నారు. కొందరేమో తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చారు. మరి కొందరు కాంగ్రెస్ మూలాలు ఉన్న వాళ్లు. ఇంకొందరు బీజేపీ ఏదో కేంద్రంలో అధికారంలో ఉందని అక్కడకు చేరిన వారు. ఇలా రకరకాల వైపుల నుంచి వచ్చి.. ఏదో అవసరార్థం అక్కడ చేరారు నేతలు.

అలాంటి అవకాశవాద నేతల మధ్యన విబేధాలు కూడా అదే స్థాయిలో ఉన్నాయని పరిశీలకులు అభిప్రాయపడుతూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీలో గ్రూపుల గోల తీవ్రంగా ఉందని వారు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. తలోదిక్కు నుంచి బీజేపీలోకి చేరిన వారు తలో రకంగా వ్యవహరిస్తూ ఉన్నారని టాక్.

భారతీయ జనతా పార్టీలో గల గందరగోళం గురించి ఆ పార్టీ నేతల ప్రెస్ మీట్లతోనే అందరికీ అర్థం అవుతూ ఉండవచ్చు. ఒక్కో అంశం గురించి ఆ పార్టీ నుంచి అనేక రకాల ఒపీనియన్స్ వినిపిస్తూ ఉంటాయి. ఇలా బీజేపీ లోని భిన్నాభిప్రాయాలు, విబేధాలు బయటపడుతూ ఉంటాయి. తమ ఓటు బ్యాంకు ఒకటి లోపే అయినా..భారతీయ జనతా పార్టీ ఏపీ విభాగం నేతలు నెక్ట్స్ అధికారం తమదే అన్నట్టుగా మాట్లాడుతూ ఉండటం ఈ వ్యవహారంలో మరో కామెడీ.

వారిలో వారికే ఒక స్టాండు లేదు. ఏ పార్టీ నుంచి వచ్చిన వారు తమ గత పార్టీ తరహాల్లోనే మాట్లాడుతూ ఉంటారు. ఇలాంటి నేపథ్యంలో ఈ పరిణామాలపై ఆ పార్టీ అధిష్టానానికి నివేదిక వెళ్లిందని టాక్. ఆ విషయంలో బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా తీవ్రంగా రియాక్ట్ అయినట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి.

విబేధాలను పక్కన పెట్టాలని, ఎవరి గ్రూపు్ వారిది అన్నట్టుగా వ్యవహరించవద్దని, వ్యక్తుల కన్నా పార్టీ ప్రధానమంటూ భారతీయ జనతా పార్టీ అధిపతి గట్టిగా చెప్పినట్టుగా టాక్ వినిపిస్తోంది. మరి అమిత్ షా క్లాసు పీకిన అనంతరం అయినా భారతీయ జనతా పార్టీలో విబేధాలు సమసిపోయి, గ్రూపులన్నీ ఏకం అవుతాయా? అనేది ప్రశ్నార్థకమే!