Begin typing your search above and press return to search.

షా.. భ‌య‌పెడుతున్నారా? భ‌య‌ప‌డుతున్నారా?

By:  Tupaki Desk   |   29 April 2019 5:18 AM GMT
షా.. భ‌య‌పెడుతున్నారా? భ‌య‌ప‌డుతున్నారా?
X
అధికారం చేతికి రానంత వ‌ర‌కూ దాని రుచి తెలిసి చావ‌దు. కానీ.. ఒక్క‌సారి చేతికి అందాకా.. ఏమైనా స‌రే.. ఎంత‌కైనా స‌రే.. దాన్ని వ‌దిలిపెట్టేందుకు ఏ మాత్రం ఇష్ట‌ప‌డ‌ని త‌త్త్వం రాజ‌కీయాల్లో స్ప‌ష్టంగా క‌నిపిస్తూ ఉంటుంది. ఐదేళ్ల క్రితం బంప‌ర్ మెజార్టీతో అధికారాన్ని చేప‌ట్టిన మోడీ ప‌రివారానికి.. ప‌వ‌ర్ మ‌జా ఏమిటో అర్థ‌మైంది. దాన్ని కాపాడేందుకు ఎంత‌కైనా స‌రే అన్న‌ట్లుగా ఆయ‌న వ్య‌వ‌హ‌రిస్తున్న తీరుపై భారీ ఎత్తున విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్న వైనం తెలిసిందే. అయిన‌ప్ప‌టికీ.. వెన‌క్కి త‌గ్గ‌కుండా అధికారాన్ని నిలుపుకునేందుకు విప‌రీతంగా శ్ర‌మిస్తున్నారు మోడీషాలు.

త‌న రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థుల‌పై వ‌రుస పెట్టిన విచార‌ణ సంస్థ‌ల చేత ఆక‌స్మిక త‌నిఖీలు చేయిస్తూ.. షాకుల మీద షాకులు ఇస్తున్న‌ప్ప‌టికీ గాలి త‌మ‌కు వాటంగా వీయ‌టం లేద‌న్న స‌మాచారం మోడీషా ద్వ‌యానికి అస్స‌లు మింగుడుప‌డ‌టం లేదు. 2014లో మాదిరి కాకున్నా.. క‌నీసం ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసేంత బొటాబొటి సీట్లు వ‌చ్చినా అడ్జెస్ట్ అవుదామ‌న్నా.. అలాంటి ప‌రిస్థితి లేద‌న్న వాద‌న‌లు జోరుగా వినిపిస్తున్నాయి.

దీంతో.. హుందాత‌నాన్ని ప‌క్క‌న పెట్టేసిన మోడీషాలు.. త‌మ ఎన్నిక‌ల ప్ర‌చారంలో ఎలాంటి ప‌ద‌జాలాన్ని వాడుతున్నారో తాజా ఉదంతాన్ని చూస్తే ఇట్టే అర్థ‌మైపోతుంది. బిహార్ లోని సితామ‌డి.. శ‌ర‌న్ ల ప్రాంతంలో జ‌రిగిన ఎన్నిక‌ల ప్ర‌చారంలో మాట్లాడిన బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా కీల‌క వ్యాఖ్య చేశారు.

ప్ర‌త్య‌ర్థుల‌కు వ‌ణుకు పుట్టేలా చేసిన ఈ వార్నింగ్ చూస్తే.. మ‌ళ్లీ మోడీ ప్ర‌భుత్వం కాని వ‌స్తే జాతి వ్య‌తిరేక శ‌క్తుల‌న్నీ కూడా జైలు పాలు కావ‌టం ఖాయ‌మ‌న్న కీల‌క వ్యాఖ్య చేశారు. వాస్త‌వానికి ఈ త‌ర‌హా వ్యాఖ్య ఎన్నిక‌ల స‌మ‌యంలో మేలు కంటే కీడే ఎక్కువ చేస్తుంది. ఈ విష‌యాన్ని వ‌దిలేసి.. షా చేసిన వ్యాఖ్య చూస్తుంటే.. ఒత్తిడి వారిపై ఎంత‌లా ఉంద‌న్న విష‌యం ఇట్టే అర్థం కాక మాన‌దు.

జాతి వ్య‌తిరేకులు నిజంగానే దేశంలో ఉంటే.. 56 అంగుళాల ఛాతీ ఉన్న ప్ర‌ధాని త‌న మొద‌టి ట‌ర్మ్ లోనే ఎందుకు అరెస్ట్ చేయ‌లేదు? అన్న‌ది ప్ర‌శ్న‌. అలాంటి వారిని అరెస్ట్ చేయ‌టానికి రెండోసారి ప‌వ‌ర్ ప్ర‌జ‌లు ఇవ్వాలా? అన్న ప్ర‌శ్న‌కు షా చెప్పే స‌మాధానం ఏమిటి? జాతీయ స్థాయి రాజ‌కీయాల్లో రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థిత్వం ఉండొచ్చు కానీ.. శ‌త్రుత్వం ఉండ‌కూడ‌ద‌న్న చిన్న విష‌యాన్ని మిస్ అవుతున్న షా మాష్టారిని చూస్తుంటే.. ఓటమి ద‌గ్గ‌ర‌గా వ‌చ్చింద‌న్న భావ‌న‌లో ఆయ‌న ఉన్నారా? అన్న భావ‌న క‌లుగ‌క మాన‌దు.