Begin typing your search above and press return to search.

బాబు ఆగ్ర‌హానికి వార్నింగ్‌ మందేసిన షా

By:  Tupaki Desk   |   4 Feb 2018 4:56 AM GMT
బాబు ఆగ్ర‌హానికి వార్నింగ్‌ మందేసిన షా
X
మంచిగా కాల్చిన అట్ల‌కాడ ప‌ట్టుకొని ఎలాంటి క‌నిక‌రం లేకుండా వాత‌లు పెట్టే తీరుకు త‌గ్గ‌ట్లే ఉంటుంది ప్ర‌ధాని మోడీ వ్య‌వ‌హారం చూస్తే. బీజేపీ జాతీయ అధ్య‌క్షుడి కుర్చీలో కూర్చునేది అమిత్ షా అయినా.. మోడీ మ‌న‌సెరిగి న‌డ‌వ‌టంలో ఆయ‌న‌కు ఆయ‌నే సాటి. మోడీ మ‌న‌సులో ఏం అనుకుంటారో.. స‌రిగ్గా అదే రీతిలో రియాక్ట్ కావ‌టంలో అమిత్ షాను కొట్టేటోళ్లే లేర‌ని చెప్పాలి. ఎప్ప‌టి మాదిరి ఈసారీ కేంద్ర బ‌డ్జెట్లో ఏపీకి హ్యాండిచ్చేశారు

దీంతో ఏపీ ప్ర‌జ‌ల‌కు ఏం స‌మాధానం చెప్పాలో అర్థం కాని ప‌రిస్థితి బాబుకు ఎదురైంది. త‌న ద‌గ్గ‌ర తిరుగులేని ఆస్త్రంగా ఉండే.. మాట‌ల‌ బెదిరింపుల‌కు దిగారు. రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం పోరాడ‌తాం.. అవ‌స‌ర‌మైన నిధుల కోసం అడుగుతాం.. బ‌తిమిలాడ‌తాం.. అప్ప‌టికి విన‌కుంటే దండం పెట్టి బ‌య‌ట‌కు వ‌చ్చేస్తామంటూ బాబు నోటి నుంచి ఊహించిన రీతిలోనే మాట‌లు వ‌చ్చేశాయి.

ఆ మాట‌ల్ని విన‌న‌ట్లుగా అమిత్ షా కామ్ గా ఉండిపోతే.. ఏపీ బీజేపీ నేత‌లు మాత్రం అందుకు భిన్నంగా చెల‌రేగిపోయారు. బాబు మాట‌కు మాటే స‌మాధానం అన్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించిన ఏపీ బీజేపీ నేత‌ల‌పై అమిత్ షా ఫైర్ అయ్యారు. బ‌డ్జెట్ కేటాయింపుల్లో ఏపీకి ఎంత‌లా హ్యాండిచ్చింది షాకు తెలియ‌నిది కాదు. మిత్ర‌ధ‌ర్మంగా మిగిలిన వారికంటే మిన్న‌గా నిధులు ఆశించ‌టం మామూలే. అయితే.. త‌మ ప్రాధాన్య‌తా అంశాల్లో ఏపీ లేక‌పోవ‌టంతో.. నిధుల కేటాయింపుల్లో శీత‌క‌న్ను వేశారు మోడీ అండ్ కో.

ఎన్నిక‌ల‌కు మ‌రో ఏడాది కాలం మాత్ర‌మే ఉన్న నేప‌థ్యంలో ఈసారి బ‌డ్జెట్ లో అయినా విభ‌జ‌న హామీల‌తో పాటు.. ఏపీ ప‌ట్ల ప్ర‌త్యేక శ్ర‌ద్ధ వ‌హిస్తార‌ని ఏపీ స‌ర్కారు భావించింది. వారి అంచ‌నాల్ని త‌ల‌కిందులు చేస్తూ బ‌డ్జెట్ ఉండ‌టంతో ఏమీ పాలుపోని ప‌రిస్థితి. మిత్ర‌ప‌క్షంపై ఫైర్ కాక‌పోతే ప్ర‌జాగ్ర‌హానికి గురి కావ‌టం త‌ప్ప‌ద‌న్న విష‌యం తెలిసిందే. దీంతో ఎప్ప‌టిలానే బాబు ఫైర్ అయ్యారు.

ఏదైనా విష‌యం మీద ప్ర‌జ‌లు ఆగ్ర‌హంగా ఉన్న‌ప్పుడు.. అంత‌కు మించిన ఆగ్ర‌హాన్ని స‌మ‌స్య మీద పాల‌కులు ప్ర‌ద‌ర్శించ‌టం ద్వారా ప్ర‌జ‌ల్లో పాజిటివ్ ఫీలింగ్స్ పెంచ‌టంతో పాటు.. త‌మ బాధ‌లు.. ఆవేద‌న‌లు పాల‌కుల‌కు అర్థ‌మ‌వుతున్నాయ‌ని ఫీల‌వుతుంటారు. అందుకే బ‌డ్జెట్ ప్ర‌సంగం అయిన కొన్ని గంట‌ల్లోనే ఘాటుగా స్పందించారు. పార్టీపై బాబు వ్యాఖ్య‌ల‌పై దూరం ఆలోచించ‌ని ఏపీ బీజేపీ నేత‌లు ఎవ‌రికి వారు నోటికి ప‌ని చెప్పారు.

ఈ వ్య‌వ‌హారం మొత్తాన్ని చూసీచూడ‌న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించిన అమిత్ షా.. ఇష్యూ మ‌రింత ముదిరిపోతుంద‌న్న విష‌యాన్ని గుర్తించి.. తాను ఎంట్రీ కావాల్సిన టైం ఆస‌న్న‌మైంద‌ని అర్థం చేసుకున్నారు. ఆ వెంట‌నే పార్టీ నేత‌ల‌కు ఘాటు వార్నింగ్ ఇచ్చేశారు. మిత్ర‌ప‌క్షంపై ఇష్టం వ‌చ్చిన‌ట్లుగా మాట్లాడ‌తారా? అంటూ గ‌ద‌మాయించేశారు. సొంత అజెండాతో వెళ్తున్న పార్టీ నేత‌ల్ని దూకుడు త‌గ్గించాల‌న్న స్ప‌ష్ట‌మైన సంకేతాన్ని ఇచ్చారు.

ఇప్ప‌టికే ఏపీ బీజేపీ అధ్య‌క్షుడు హ‌రిబాబు.. సీనియ‌ర్ నేత‌లు పురంధేశ్వ‌రి.. క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌.. విష్ణుకుమార్ రాజు.. సోము వీర్రాజు ల‌ను ఢిల్లీకి పిలిపించిన అధినాయ‌క‌త్వం.. వారితో ఏపీ విష‌యాల గురించి ముచ్చ‌టించారు. మిత్ర‌ప‌క్షంతో ఉన్న పంచాయితీతో పాటు.. ఏపీలో పార్టీ ప‌రిస్థితిపై ఆరా తీశారు. అనంత‌రం.. ఏపీ అధికార‌ప‌క్షంపై తొంద‌ర‌ప‌డి వ్యాఖ్య‌లు చేయొద్ద‌ని స్ప‌ష్టంచేశారు. మిత్ర ధ‌ర్మాన్ని పాటించాల‌న్న సూచ‌న‌ను చేశారు.

కేంద్ర సంక్షేమ ప‌థ‌కాల్ని ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్ల‌ట‌మే ధ్యేయంగా ప‌ని చేయాల‌ని.. ఏపీ అధికార‌ప‌క్షంపై ఎట్టి ప‌రిస్థితుల్లో నోరు జారొద్ద‌ని స్ప‌ష్టం చేశారు. వాత పెట్టాక ఉప‌శ‌మ‌నం కోసం లేప‌నం పెట్ట‌టంలో బీజేపీ త‌ర్వాతే ఎవ‌రైనా.. మంట పుట్టినోడి అరుపులు మామూలేన‌ని.. అలాంటి వాటికి రియాక్ట్ అయితే ఇబ్బందుల‌న్న విష‌యాన్ని పార్టీ నేత‌ల‌కు షా లోగుట్టుగా చెప్పిన‌ట్లుగా చెబుతారు. మొత్తానికి బాబు ఈగో సంతృప్తి చెందేలా అమిత్ షా నోటి నుంచి వార్నింగ్ వ‌చ్చిన నేప‌థ్యంలో.. బీజేపీతో త‌మ అనుబంధాన్ని మ‌రికొంత‌కాలం కొన‌సాగించాల‌ని బాబు డిసైడ్ కావ‌టం ఖాయ‌మంటున్నారు.మ‌రి.. బాబు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.