Begin typing your search above and press return to search.

షాను చిరాకు పెట్టిన క‌మ‌ల‌నాథుల క్వ‌శ్చ‌న్లు!

By:  Tupaki Desk   |   17 Sep 2018 4:22 AM GMT
షాను చిరాకు పెట్టిన క‌మ‌ల‌నాథుల క్వ‌శ్చ‌న్లు!
X
అధికారాన్ని అర‌చేతిలో పెట్టుకొని తిరుగులేని రీతిలో చెల‌రేగిపోతున్న బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షాకు దిమ్మ తిరిగిపోయేలా షాక్ ఒక‌టి తాజా తెలంగాణ ప‌ర్య‌ట‌న‌లో ఎదురైంది. పార్టీ అధినేత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న త‌న మాట‌ను సైతం సొంత పార్టీకి చెందిన తెలంగాణ నేత‌ల్ని క‌న్వీన్స్ చేయ‌లేని వైనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

పైకి చెప్ప‌టం లేదు కానీ.. లోలోప‌ల టీఆర్ ఎస్ తో త‌మ పార్టీ పొత్తు పెట్టుకుంద‌న్న డౌట్ మొద‌ట్నించి వ‌స్తున్న‌దే. అయితే.. అలాంటి వాద‌న‌ల్లో వీస‌మెత్తు వాస్త‌వం లేద‌న్న షా మాట‌ల్ని విశ్వ‌సించ‌ని క‌మ‌ల‌నాథులు.. అదే ప‌నిగా వేసిన క్వ‌శ్చ‌న్లు బీజేపీ అగ్ర‌నేత‌కు చిరాకు తెప్పించింది.

క‌మ‌ల‌నాథుల‌కు మ‌రింత క్లారిటీ వ‌చ్చేలా గులాబీ పొత్తుపై అమిత్ షా కొన్ని వ్యాఖ్య‌లు చేసిన‌ట్లుగా చెబుతున్నారు. తెలంగాణ ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన అమిత్ షా.. కొత్తూరు రిసార్ట్ లో పార్టీ నేత‌ల‌తో స‌మావేశ‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంగా ప‌లువురు క‌మ‌ల‌నాథుల నోట్లో నుంచి టీఆర్ ఎస్ తో పొత్తు ముచ్చ‌ట తెర మీద‌కు వ‌చ్చింది.

నో అంటే నో అంటూ టీఆర్ ఎస్ తో పొత్తు మాటే లేద‌న్న షా మాట‌ల్ని తెలంగాణ బీజేపీ నేత‌లు లైట్ తీసుకోవ‌టంపై అమిత్ షా ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన‌ట్లుగా చెబుతున్నారు. తెలంగాణ‌లోని 119 స్థానాల‌కు బీజేపీ ఒంట‌రిగా బ‌రిలోకి దిగ‌నున్న‌ట్లుగా ఆయ‌న స్ప‌ష్టం చేయ‌టం గ‌మ‌నార్హం.

ఇంత సూటిగా.. స్ప‌ష్టంగా షా చెప్పినా.. బీజేపీ నేత‌ల మ‌నసుల్లో ఏదో ఒక మూల మిగిలిన సందేహాల్ని తీర్చుకునే ప్ర‌య‌త్నంలో భాగంగా.. గులాబీ పార్టీతో దోస్తానా ఉందా? లేదా? అన్న ప్ర‌శ్న అదే ప‌నిగా ఎదురుకావ‌టంతో షా స‌హ‌నం కోల్పోయినట్లుగా స‌మాచారం. పొత్తులు ఉండ‌వ‌ని ఎప్ప‌టి నుంచో చెబుతున్నా.. ఇప్ప‌టికి న‌మ్మ‌కం క‌లుగ‌క‌పోతే ఎలా? అని ప్ర‌శ్నించిన ఆయ‌న‌.. ఇప్ప‌టికీ త‌న మాట‌ల‌పై న‌మ్మ‌కం క‌ల‌గ‌క ఉంటే. ఎలా? ఇంకెలా చెప్పాలి? పార్టీ అధినేత‌గా స్ప‌ష్టం చేస్తున్న‌ట్లుగా చెప్పిన అమిత్ షా.. టీఆర్ ఎస్ తో పొత్తు అన్న మాటే లేద‌ని చెప్పారు.

ఈ సంద‌ర్భంగా శివ‌సేన ప్ర‌స్తావ‌న‌ను తీసుకొచ్చారు షా. మ‌హారాష్ట్రలో శివ‌సేన‌తోనే త‌మ పార్టీ తెగ‌తెంపులు చేసుకున్న విష‌యాన్ని గుర్తు చేస్తూ.. శివ‌సేన కంటే టీఆర్ ఎస్ గొప్ప పార్టీనా అని ప్ర‌శ్నించిన‌ట్లుగా తెలుస్తోంది. పొత్తుపై ముందు బీజేపీ నేత‌ల మ‌న‌సుల్లో ఉన్న ఆలోచ‌న‌ల్ని తొల‌గించాల‌ని అమిత్ షా ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌టం గ‌మ‌నార్హం. మొత్తానికి తెలంగాణ ప్ర‌జ‌ల కంటే కూడా.. సొంత పార్టీ నేత‌ల‌కు గులాబీ పార్టీతో పొత్తు లేదని షా తేల్చేసినా బీజేపీ నేతల మ‌నసుల్లో క్వ‌శ్చ‌న్లు అలానే ఉండ‌టం బీజేపీ చీఫ్ కు చిరాకు పుట్టించింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.