Begin typing your search above and press return to search.

బీజేపీ పతనానికి అమిత్ షా పెత్తనమే కారణమా?

By:  Tupaki Desk   |   24 Dec 2019 4:26 AM GMT
బీజేపీ పతనానికి అమిత్ షా పెత్తనమే కారణమా?
X
అనువు గానీ అధికులమని బయలు దేరితే ఇలాగే ఉంటుందని తెగ బాధపడిపోతున్నారట కమలనాథులు.. దేశాన్ని రెండు సార్లు కొట్టేశామని విర్రవీగిన పాపానికి ఇప్పుడు ఒక్కో రాష్ట్రం చేజారుతుంటే ముద్ద దిగడం లేదట.. మోడీ ఆధిపత్యం నుంచి అమిత్ షా హస్తగతమైన బీజేపీ పార్టీ పతనం చూసి కమలనాథుల్లో కలవరం మొదలైందట..

2014లో మోడీ తన స్టామినాతో ఒంటరిగా బీజేపీ ప్రభుత్వాన్ని కేంద్రంలో ఏర్పాటు చేయించారు. 2016 వరకూ వరుసగా దేశంలోని రాష్ట్రాలను కొల్లగొడుతూ వెళ్లారు. అమిత్ షా ఆధిపత్యం అప్పుడు తక్కువగా ఉండేది. దేశంలో దాదాపు 71 శాతం రాష్ట్రాల్లో బీజేపీ ఆధిపత్యం వచ్చింది. అఖండ భారతంలో 71శాతం అంటే దాదాపు మూడు వంతులు కాషాయమయం అయినట్టే.. ఇక కాంగ్రెస్ పని ఖతం అనుకున్నారంతా... కానీ ఇక్కడే ట్విస్ట్ నెలకొంది.

మన అమిత్ షా పెత్తనం మొదలైంది. అమిత్ బీజేపీలోకి రంగప్రవేశం జరిగింది. బీజేపీ అధ్యక్షుడిగా అమిత్ షా కావడంతో అంతా మోడీషాలను చూసి కృష్ణార్జునులు అని మురిసిపోయారు. మొదట్లో బాగానే విజయాలు దక్కాయి. కానీ ఇప్పుడు అమిత్ షా దూకుడు ఆ పార్టీకి చేటు తెస్తోంది. ఫక్తు హిందుత్వ ఏజెండాతో అమిత్ షా రాజకీయం మొదలు పెట్టారు. మోడీ హిందుత్వ ఎజెండాకు మొదట్లో దూరంగా ఉన్నా అమిత్ షా మాత్రం దాన్నే ప్రధాన అస్త్రంగా మలిచి రాజకీయం మొదలుపెట్టారు.

ఈ క్రమంలోనే పాకిస్తాన్ పై దాడి - అభినందన్ ఇష్యూ - అయోధ్య వివాదం - దళితులపై దాడులు సహా అమిత్ షా జాతీయ భావాన్ని రెచ్చగొట్టారు. గెలిచారు. కానీ గెలిచాక అదే హిందుత్వ ఎజెండాతో పౌరసత్వ చట్టం - ఎన్నార్సీలను తెరపైకి తెచ్చి తమది ఫక్తు హిందుత్వ పార్టీ అని చాటిచెప్పారు. ఇదే బీజేపీ కొంప ముంచింది.

మైనార్టీలు - ఇతర వర్గాలు ముఖ్యంగా దళితులు - బహుజనులు - బీసీలు అమిత్ షా ఉచ్చులో చిక్కుకోలేదు. క్రమంగా బీజేపీకి దూరమయ్యారు. పౌరసత్వ రణంపై దేశంలో ఎంత పెద్ద తిరుగుబాటు వచ్చిందో చూశాం.. అమిత్ షా దుందుడుకు నిర్ణయాల కారణంగానే వరుసగా రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ కుదేలైంది. కేవలం 12 నెలల్లోనే చత్తీస్ ఘడ్ - మధ్యప్రదేశ్ - రాజస్థాన్ - మహారాష్ట్ర - జార్ఖండ్ రాష్ట్రాలను బీజేపీ కోల్పోయింది. కర్ణాటకలో మాత్రమే పూర్తి స్థాయి సొంతంగా అధికారం చేపట్టింది. హర్యానాలో పొత్తుల సంసారం చేస్తోంది. ఇలా అఖండ దేశాన్ని ఏలిన కమలనాథులకు ఇప్పుడు ఒక్కో రాష్ట్రం చేజారుతూ ఉంటే దిక్కుతోచని పరిస్థితి ఎదురవుతోందని చెప్పవచ్చు.

ప్రస్తుతం 2016లో 71శాతం దేశంలోని రాష్ట్రంలోని తన కబంధ హస్తాల్లో దాచుకున్న బీజేపీ బలం 2019 డిసెంబర్ వచ్చేసరికి కేవలం 35శాతానికి పడిపోయింది. దీనికంతటికి అమిత్ షా పెత్తనమే కారణమని కమలనాథులు రగిలిపోతున్నారట.. ఆయన వచ్చినప్పటి నుంచి బీజేపీ పడిపోయిందని ఇప్పుడు లెక్కలు చూపి మరీ తెగ బాధపడిపోతున్నారట.. బీజేపీకి బలంగా మారుతాడని అనుకుంటే బలహీనతగా మారిపోతున్న అమిత్ షాను చూసి ఇప్పుడు కక్కలేక మింగలేక మౌనంగా ఉండిపోతున్నారట..