Begin typing your search above and press return to search.

లేట్ నైట్.. 45 నిమిషాల పాటు సాగిన అమిత్ షా.. ఎన్టీఆర్ భేటీ

By:  Tupaki Desk   |   22 Aug 2022 4:16 AM GMT
లేట్ నైట్.. 45 నిమిషాల పాటు సాగిన అమిత్ షా.. ఎన్టీఆర్ భేటీ
X
అంచనాలకు భిన్నంగా.. అనూహ్యంగా చోటు చేసుకున్న పరిణామాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. మునుగోడులో నిర్వహించిన బహిరంగ సభ అనంతరం..రాత్రి పొద్దుపోయిన తర్వాత కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. ప్రముఖ సినీనటుడు ఎన్టీఆర్ అలియాస్ తారక్ తో భేటీ అయ్యారు.

వీరి భేటీకి సంబంధించిన సమాచారాన్ని ఆదివారం మధ్యాహ్నం వేళలో రివీల్ చేయటం అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. వీరి భేటీ హాట్ టాపిక్ గా మారటమే కాదు.. అందరూ చూపు దాని మీదనే ఉండేలా చేసింది.

మునుగోడు సభ అనంతరం హైదరాబాద్ కు వచ్చిన అమిత్ షా.. శంషాబాద్ లోని నోవాటెల్ హోటల్ కు రాత్రి 10.26 గంటల వేళలో చేరుకున్నాడు. ఎన్టీఆర్ అక్కడకు చేరుకున్నారు. అనంతరం ఎన్టీఆర్ ను మరో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్వయంగా వెంటబెట్టుకొని కేంద్ర మంత్రి అమిత్ షా వద్దకు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా అమిత్ షాకు శాలువా కప్పి.. పుష్పగుచ్చం అందజేశారు. అనంతరం వీరిద్దరూ 20 నిమిషాల పాటు ఏకాంతంగా చర్చించుకున్నారు.

ఆపై వీరిద్దరితో పాటు పార్టీ నేతలు కిషన్ రెడ్డి.. తరుణ్ ఛుగ్.. బండి సంజయ్ లు కలిసి భోజనం చేశారు. జూనియర్ ఎన్టీఆర్ తో బేటీ సందర్భంగా సీనియర్ ఎన్టీఆర్ గురించి అమిత్ షా ప్రస్తావించినట్లుగా తెలుస్తోంది. ఎన్టీఆర్ నటించిన దానవీరశూర కర్ణ సినిమాను తాను చూసినట్లుగా అమిత్ షా చెప్పినట్లుగా సమాచారం. సీనియర్ ఎన్టీఆర్ ఉమ్మడి ఏపీకి సీఎంగా ఉన్నప్పుడు అధికారులు బాగా పని చేసేవారని ఆయన ప్రశంసించినట్లుగా చెబుతున్నారు. మొత్తంగా వీరి భేటీ దాదాపు 45 నిమిషాలకు పైనే సాగింది.

తారక్ తో జరిగిన సమావేశాన్ని అమిత్ షా ట్విటర్లో వెల్లడించారు. "అత్యంత ప్రతిభావంతుడైన నటుడు.. తెలుగు సినిమా తారకరత్నం అయిన జూనియర్ ఎన్టీఆర్ ను ఈ రోజు హైదరాబాద్ లో కలిసి మాట్లాడటం చాలా ఆనందంగా అనిపించింది" అంటూ అమిత్ షా ట్వీట్ లో పేర్కొన్నారు.

ఇంతకీ వారిద్దరి మధ్య జరిగిన ఏకాంత సంభాషణ ఏమిటన్న దానిపై మాత్రం సమాచారం బయటకు రాలేదు. ఎన్టీఆర్ వర్గీయులు సైతం పెదవి విప్పకపోవటం గమనార్హం.