Begin typing your search above and press return to search.

కేసీఆర్‌ తో ర‌హ‌స్య పొత్తు..కమ‌లం కొంప ముంచింది

By:  Tupaki Desk   |   25 Dec 2018 2:30 PM GMT
కేసీఆర్‌ తో ర‌హ‌స్య పొత్తు..కమ‌లం కొంప ముంచింది
X
అధికారంలోకి వ‌చ్చేస్తామ‌ని...అదీ కాక‌పోతే ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం హోదా త‌మ‌దేన‌న‌ని బీరాలు ప‌లికిన బీజేపీకి తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌లు ఊహించ‌ని షాక్ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. 118 స్థానాల్లో ఆ పార్టీ పోటీచేయగా ఒక్క‌టంటే ఒక్క స్థానంలోనో గెలుపొందింది. బీజేపీ మైండ్ బ్లాంక‌య్యే ఓట‌మిపై ఇప్ప‌టికే విశ్లేష‌ణ‌లు కొన‌సాగుతున్నాయి. ఈ క్ర‌మంలో తాజాగా ఆస‌క్తిక‌ర‌మైన అంశం తెర‌మీద‌కు వ‌చ్చింది. టీఆర్ ఎస్- బీజేపీ ఒక్కటేనన్న భావన ప్రజల్లో బలంగా ఉండ‌టం - ఈ అభిప్రాయాన్ని మార్చడంలో బీజేపీ నేత‌లు విఫ‌ల‌వ‌డం క‌మ‌లం పార్టీ క‌ల‌వ‌ర‌పాటుకు గుర‌య్యే ఓట‌మికి తార్కాణంగా పలువురు పేర్కొంటున్నారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీ ఓట‌మికి అనేక కార‌ణాలు ఉన్నాయ‌ని పేర్కొన‌వ‌చ్చు. ప్ర‌ధానంగా కేసీఆర్‌ ప్రభంజనాన్ని ముందస్తుగా అంచనా వేయడంలో ఆ పార్టీ వైఫ‌ల్యం చెందింది. దీనికి తోడు అభ్యర్థుల ఎంపికలోనూ ఆలస్యమైంది. ఇంతేకాకుండా బీజేపీ - టీఆర్ ఎస్ ఒకటే అన్న భావన ప్రజల్లో నెలకొంది. కొన్ని పరిణామాలు ఈ ఊహకు బలం చేకూర్చాయి కూడా! ప్రధాని మోడీ.. పార్లమెంటులో తెలంగాణ ప్రభుత్వాన్ని పొగిడారు. కేంద్ర మంత్రులు రాష్ట్రానికి వచ్చినపుడు టీఆర్ ఎస్ పార్టీ పథకాల్ని మెచ్చుకున్నారు. ఈ పరిణామాలు పార్టీకి మరింత నష్టం కలిగించాయి. బీజేపీతో టీఆర్ ఎస్‌ కు స‌ఖ్య‌త ఉంద‌నే భావ‌న క‌లిగించాయి. త‌ద్వారా బీజేపీకి ఓటు వేసే బ‌దులుగా...టీఆర్ ఎస్‌ కు ఓటు వేయ‌డం మేల‌ని ప్ర‌జ‌లు గులాబీ పార్టీకి గెలుపు అవ‌కాశం క‌ల్పించారు.

మ‌రో ప్ర‌ధాన అంశం అంశాల వారీ పోటీ అంటున్నారు. ‘ప్రజలు ఈ ఎన్నికలను కేసీఆర్‌ - చంద్రబాబు మధ్య జరిగిన పోరుగానే చూశారు. మరోవైపు తెలంగాణలో బీజేపీ తరపున ముఖ్య నాయకత్వం లేదు. మన పార్టీలో కేసీఆర్‌ ను ఎదుర్కొనే దీటైన నాయకుడే లేరు. ఆంధ్రప్రదేశ్‌ నాయకులకు రాజ్యసభ - కేంద్ర మంత్రి పదవి - ఉప రాష్ట్రపతి పదవి ఇచ్చారు. తెలంగాణలో దత్తాత్రేయను తొలగించిన తర్వాత కేంద్ర మంత్రివర్గంలో మరొకరికి స్థానం కల్పించలేదు. ఆయన్ను ఎందుకు తొలగించారో కూడా తెలియదు. ఇలాంటి అంశాల నేప‌థ్యంలో బీజేపీకి అనేక అంశాలు స‌మ‌స్య‌గా మారాయి ఓట‌మికి కార‌ణంగా మారిన‌ట్లు విశ్లేషిస్తున్నారు.