Begin typing your search above and press return to search.

బాబు ఫార్ములాతోనే అమిత్ షా కూడా వెళ్తున్నారే

By:  Tupaki Desk   |   8 Nov 2017 4:52 AM GMT
బాబు ఫార్ములాతోనే అమిత్ షా కూడా వెళ్తున్నారే
X
టీడీపీ అధినేత‌ - ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు స‌క్సెస్‌ ఫార్ములానే బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా సైతం ఆశ్ర‌యించారు. కీల‌క‌మైన ఎన్నిక‌ల్లో ఆయ‌న బాబు మార్కు ఎపిసోడ్‌ తోనే ముందుకు సాగుతుండ‌టం ఇందుకు నిద‌ర్శ‌నంగా చెప్తున్నారు. ఇంత‌కూ ఇది దేని గురించి అంటే..తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు చంద్ర‌బాబు రూపొందించిన ఇంటింటికీ టీడీపీ గురించి. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ స్వ‌రాష్ట్రమైన గుజ‌రాత్ ఎన్నిక‌ల ప్ర‌చారం గురించి. రాష్ట్రంలో తాము అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు నేరుగా తెలిపేందుకు ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలుసుకోవాలని బీజేపీ నిర్ణయించింది. ఇందులో భాగంగా ‘గుజరాత్ గౌరవ్ మహా సంపర్క్ అభియాన్’ కార్యక్రమాన్ని రూపొందించింది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రతి ఓటరుకూ చేరువకావాలన్న లక్ష్యంతో ఆరు రోజుల పాటు జరిగే ఈ ప్ర‌చార ప‌ర్వాన్ని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ప్రారంభించారు.

అభ్యర్థుల పేర్లను ప్రకటించడానికి ముందే సుమారు ఏభై వేల పోలింగ్ బూత్‌ ల పరిధిలో ఓటర్లను కలుసుకోవాలని పార్టీ అధిష్ఠానం భావిస్తోంది. తాను గతంలో ప్రాతినిధ్యం వహించిన నారణ్‌ పూర్ నియోజకవర్గంలో అమిత్ షా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. భారీ సంఖ్యలో కార్యకర్తలు - స్థానిక నాయకులు తోడురాగా పది నివాస ప్రాంతాల్లో షా పర్యటించి ఓటర్లను కలుసుకున్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీకి అఖండ విజయం చేకూర్చాలని ఆయన ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. 1998 నుంచి నారణ్‌ పూర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన అమిత్ షా ఇటీవల రాజ్యసభకు ఎన్నికైన సంగతి తెలిసిందే. ఓటర్లకు ప్రధాని నరేంద్ర మోడీ రాసిన లేఖ ప్రతులను ప్రచారం సందర్భంగా షా పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి విజయ్ రూపానీ - మాజీ సిఎం ఆనందీబెన్ పటేల్ - ఇతర నాయకులు కూడా వివిధ ప్రాంతాల్లో ‘ఇంటింటికీ బీజేపీ’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. గథ్లోడియాలో ఆనందీబెన్ - గాంధీగ్రామ్‌ లో విజయ్ రూపానీ ప్రచారం చేశారు. పోలింగ్ బూత్‌ ల పరిధిలో ఓటర్లను స్థానిక నాయకులు కలసుకుని రాష్ట్రంలో బీజేపీ సర్కారు సాధించిన ప్రగతిని, చేపట్టబోయే కార్యక్రమాలను వివరించారు.

కాగా, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు డిసెంబర్ 9 - 14 తేదీల్లో పోలింగ్ జరుగుతుంది. డిసెంబర్ 18న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఎన్నికల ప్రచారంలో కేంద్ర మంత్రులు స్మృతి ఇరానీ - జేపీ నడ్డా - నిర్మలా సీతారామన్ - వికె సింగ్ - మన్షుక్ మాండవీయ - ప్రకాశ్ జవదేకర్ వంటి ప్రముఖులు పాల్గొంటారు. వీరంతా ఓటర్లను ప్రత్యక్షంగా కలుసుకుంటారని గుజరాత్ బీజేపీ అధికార ప్రతినిధి ఐకె జడేజా తెలిపారు.