Begin typing your search above and press return to search.

అమిత్ షా మామూలోడు కాదంట‌!

By:  Tupaki Desk   |   22 Nov 2017 7:20 AM GMT
అమిత్ షా మామూలోడు కాదంట‌!
X

జాతీయ‌పార్టీలు త‌మిళ‌నాడులో సొంతంగా విజ‌యం సాధించి కొన్ని ద‌శాబ్దాలైంది. ఆ రాష్ట్రంలో డీఎంకే - అన్నాడీఎంకే హ‌వా మొద‌ల‌య్యాక వాటిలో ఏదో ఒక పార్టీతో పొత్తు కుదుర్చుకుని ఎన్నిక‌ల బ‌రిలోకి దిగాల్సిన దుస్థితి ఆ పార్టీల‌ది. దేశ‌మంతా ప్ర‌భావం చూపుతున్నా త‌మిళ‌నాడులో సొంతంగా ఎద‌గ‌లేని ప‌రిస్థితికి జాతీయ పార్టీలు చేరాయి. దివంగ‌త ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత మ‌ర‌ణం త‌ర్వాత రాష్ట్రంలో ఏర్ప‌డిన రాజ‌కీయ శూన్య‌త‌ను త‌మ‌కు అనుకూలంగా మార్చుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్న ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ - బీజేపీ అధ్య‌క్షుడు అమిత్ షా జోడీ.. వేగంగా పావులు క‌దిపారు. ముందుగా ప‌న్నీర్ సెల్వంను, ఆ త‌ర్వాత‌ ప‌ళ‌నిస్వామిని త‌మ దారికి తెచ్చుకున్నారు. ఇవ‌న్నీ ఒకెత్త‌యితే ఇప్పుడు అమిత్ షా తీసుకున్న నిర్ణ‌యం రాజ‌కీయ పండితుల‌ను ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంద‌ట‌.

త‌మిళ‌నాడు ప్ర‌జ‌ల‌కు భాష‌పైన‌, త‌మ సంప్ర‌దాయంపైన అప‌రిమిత‌మైన ప్రేమ‌. ఆ రాష్ట్రంలో ప‌ర‌భాష‌పై అంత వ్యామోహం లేదు. త‌మిళంలో మాట్లాడేందుకు ఏ స్థాయి వ్య‌క్తులైనా సంకోచించ‌రు. దీంతో ఇప్ప‌టివ‌ర‌కూ జాతీయ‌పార్టీల అగ్ర‌నేత‌లు ఎవ‌రైనా త‌మిళ‌నాడు ప‌ర్య‌ట‌న‌కు వెళితే ఇంగ్లిష్‌, హిందీలోనే మాట్లాడ‌టంతో వారికి అంత ఆద‌ర‌ణ ల‌భించ‌డంలేద‌నేది ఓ అభిప్రాయం. స‌రిగ్గా ఇదే అంశాన్ని గుర్తించిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా తమిళ భాషను నేర్చుకుంటున్నారు. ఆ భాష మీద పట్టు సాధించేందుకు తీవ్రంగానే కుస్తీలు పడుతున్నట్టు ఆ పార్టీ నేత‌లు చెబుతున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా దేశవ్యాప్తంగా పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్ప‌టి వ‌ర‌కూ ఆయ‌న ప‌ర్య‌టించిన రాష్ట్రాల్లో ఎక్కువ‌గా హిందీ తెలిసిన వారు ఉండడం ఆయనకు కలిసి వచ్చిన అంశం. అయితే, తమిళనాడులో పాగా వేయాలంటే భాష చాలా ముఖ్య‌మనే విష‌యం గుర్తించిన షా ఇప్పుడు ఎలాగైనా త‌మిళం నేర్చుకోవాల‌ని ఫిక్స‌య్యార‌ట‌.

త‌మిళ‌నాడులో ఇత‌ర భాష‌ల‌తో మాట్లాడితే ప్ర‌జ‌ల‌ను ఆక‌ట్టుకోలేమ‌న్న విష‌యాన్ని పరిగణనలోకి తీసుకున్న అమిత్‌ షా తమిళ తంబీల స్టైల్‌ లోనే స్థానిక భాష మాట్లాడాల‌ని నిర్ణ‌యించుకున్నార‌ట‌. దీని కోసం ఏదో అల్లాట‌ప్పాగా కాకుండా ప‌క్కాగా రంగంలోకి దిగుతున్నార‌ట‌. తమిళనాట రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఇక్కడ పాగావేయాలనే ప్రయత్నంలో ఉన్న కమలం నేత, ప్రజల్ని ఆకర్షించేందుకు తమిళ ప్రసంగం సాగించే విధంగా కసరత్తులు చేస్తున్నట్టు సమాచారం. ఇక్కడి ప్రజలు - కేడర్‌ తో సంప్రదింపులు జరిపే సమయంలో భాషాపరంగా ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అనర్గళంగా మాట్లాడే విధంగా, అర్థం చేసుకునే విధంగా తమిళం మీద ఆయన సాధనలో నిమగ్నమైనట్టు ఇక్కడి బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్ర‌స్తుత రాష్ట్ర రాజ‌కీయ ప‌రిస్థితుల నేప‌థ్యంలో షా వ్యూహం ఫ‌లించి ఇన్నేళ్లు కాంగ్రెస్ కు సాధ్యం కానిది బీజేపీ చేసి చూపుతుందేమోన‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు సైతం భావిస్తున్నారు.