Begin typing your search above and press return to search.

ఆవేద‌న తెలుసంటూ క్లారిటీ ఇచ్చిన షా

By:  Tupaki Desk   |   14 July 2018 8:30 AM GMT
ఆవేద‌న తెలుసంటూ క్లారిటీ ఇచ్చిన షా
X
అమిత్ షా హైద‌రాబాద్ న‌గ‌ర ప‌ర్య‌ట‌న‌లో ఆస‌క్తిక‌ర ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. ప‌లువురు ప్ర‌ముఖుల‌తో భేటీ కావ‌టం ఒక ఎత్తు అయితే.. న‌గ‌రానికి చెందిన 60 మంది కీల‌క సంఘ్ ప‌రివార్‌.. భ‌జ‌రంగ్ ద‌ళ్‌.. వీహెచ్ పీ నేత‌ల‌తోనూ స‌మావేశ‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంగా వారి మ‌ధ్య ఆస‌క్తిక‌ర సంభాష‌ణ జ‌రిగిన‌ట్లుగా తెలుస్తోంది.

అయోధ్య‌లో రామ‌జ‌న్మ‌భూమి.. ఉమ్మ‌డి పౌర‌స్మృతి.. 370 ఆర్టిక‌ల్ ర‌ద్దు లాంటి అంశాల‌పై కేంద్రం వైఖ‌రిని అడిగిన సంఘ్ నేత‌ల‌కు స్ప‌ష్ట‌త ఇచ్చే ప్ర‌య‌త్నం చేసిన అమిత్ షా.. ప‌రిణామాల‌న్నీ సానుకూలంగా మారిన‌ట్లుగా చెప్పారు. రామ‌జ‌న్మ‌భూమి అంశంలో అనుకూల ప‌రిస్థితులు ఉన్న‌ట్లు చెప్పిన ఆయ‌న‌.. లోక్ స‌భ ఎన్నిక‌ల నాటికి ప‌రిస్థితుల్లో అనూహ్య‌మైన మార్పులు చోటు చేసుకోనున్న‌ట్లు చెప్ప‌టం గ‌మ‌నార్హం.

టీఆర్ ఎస్ తో పొత్తు ఉంద‌న్న ప్ర‌చారం జ‌రుగుతున్న వేళ‌.. బీజేపీ ఒంట‌రిగా పోటీ చేయాల‌ని కొంద‌రు సంఘ్ నేత‌ల ప్ర‌శ్న‌ల‌కు స‌మాధాన‌మిస్తూ.. ఒంట‌రిగానే పోటీ చేస్తామ‌ని స్ప‌ష్టం చేసిన‌ట్లు తెలిసింది. ఇక‌.. హిందుత్వ అంశాల్ని పార్టీ బ‌లంగా తీసుకెళ్లాన‌ని మ‌రొక‌రు కోరారు. ఇదే స‌మ‌యంలో వారి మ‌ధ్య స్వామీ ప‌రిపూర్ణానంద విష‌యంలో హిందుత్వ‌కు వ్య‌తిరేకంగా వ్య‌వ‌హ‌రించిన వారిని క‌ల‌వ‌కూడ‌ద‌న్న ఒక‌రి మాట‌పై స్పందించిన షా.. "మీ ఆవేద‌న తెలుసు. కానీ.. విరోధుల‌ను మ‌రింత విరోధులుగా చేసుకోకూడ‌దు" అంటూ అనున‌యించిన‌ట్లుగా తెలిసింది. టీఆర్ ఎస్ నేత‌ల‌తో క‌ల‌వొద్ద‌న్న సూచ‌న‌పై షా ఇచ్చిన స‌మాధానం ఆస‌క్తిక‌రంగా మార‌ట‌మే కాదు.. చ‌ర్చ‌నీయాంశంగా మారింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.