Begin typing your search above and press return to search.

లాక్‌డౌన్‌, క‌వ్వింపు చర్య‌ల‌పై ఏం చేద్దాం: ప్ర‌ధాని మోదీతో అమిత్ షా భేటీ

By:  Tupaki Desk   |   29 May 2020 7:45 AM GMT
లాక్‌డౌన్‌, క‌వ్వింపు చర్య‌ల‌పై ఏం చేద్దాం: ప్ర‌ధాని మోదీతో అమిత్ షా భేటీ
X
దేశంలో ప్ర‌ధానంగా ఇప్పుడు స‌మ‌స్య‌లు సంక‌టంలా మారాయి. దేశ‌వ్యాప్తంగా వైర‌స్ ప్ర‌భావం తీవ్ర రూపం దాల్చింది. పుండు మీద కారం చ‌ల్లిన‌ట్టు ఈ స‌మ‌యంలో నేపాల్‌, చైనా క‌వ్వింపు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతున్నాయి. ఈ స‌మ‌యంలోనే స‌రిహ‌ద్దుల్లో ఉద్రిక్త వాతావ‌ర‌ణం ఏర్ప‌డేలా ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఇలాంటి స‌మ‌యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా స‌మాలోచ‌న‌లు చేశారు. న్యూఢిల్లీలోని 7 కల్యాణ్ మార్గ్‌లో ఉన్న ప్రధాని నివాసంలో శుక్ర‌వారం సమావేశమ‌య్యారు. ఈ నెల 31వ తేదీతో ముగియ‌నున్న నాలుగో ద‌శ లాక్‌డౌన్‌ పై ఏం చేద్దామ‌ని చ‌ర్చించిన‌ట్టు స‌మాచారం.

ఐదో దశ లాక్‌డౌన్ విధించాలా వద్దా అనే విషయంపై చర్చించిన‌ట్లు తెలుస్తోంది. గురువారం ఈ విష‌య‌మై అన్ని రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌తో హోం శాఖ మంత్రి అమిత్ షా మాట్లాడారు. ఆ విష‌యాల‌ను ప్ర‌ధానికి వివ‌రించారు. లాక్‌డౌన్ ఎత్తివేస్తే ఎలా ఉంటుంది? ఎత్తివేయ‌కుండా కొన‌సాగిస్తే ఎలాంటి ఇబ్బందులు వ‌స్తాయ‌ని తీవ్రంగా చ‌ర్చించారు. ఈ క్ర‌మంలోనే మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ, తమిళనాడు, మధ్యప్రదేశ్‌లో వైర‌స్ తీవ్రత అధికంగా ఉందని గుర్తించి కేవ‌లం ఆ రాష్ట్రాల్లో లాక్‌డౌన్ విధించి మిగ‌తా దేశ‌వ్యాప్తంగా స‌డ‌లింపులు ఇద్దామ‌ని కూడా చ‌ర్చించిన‌ట్లు మీడియాలో చ‌ర్చ జ‌రుగుతోంది.

ఇక వీటితో పాటు భార‌త‌దేశంపై ఒక్క‌సారిగా నేపాల్‌, చైనా వ్య‌తిరేక గ‌ళం విప్పుతున్నారు. స‌రిహ‌ద్దులో ఉద్రిక్త‌త‌లు రేపుతున్నారు. దీనిపై ఏం చేద్దామ‌ని కూడా చ‌ర్చించిన‌ట్లు వినికిడి. ఈ వివాదంపై అమెరికా స్పంద‌న‌.. నేపాల్ హెచ్చ‌రిక‌లు వంటివి చ‌ర్చ‌కు వ‌చ్చాయి. దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డే అవ‌కాశం ఉంది. అప్పుడు ఏం నిర్ణ‌యాలు తీసుకున్నారో తెలియ‌నుంది.